గురువారం 28 మే 2020
Nizamabad - Jan 17, 2020 , 01:47:59

కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి

కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి


ఖలీల్ :  మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇకముందు అన్ని రోజులు కీలకమైనవేనని, అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సాధారణ పరిశీలకుడు ముషారఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం పూర్తయిందని తెలిపారు. ప్రచారం, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. అధికారులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఎన్నికల విధుల కోసం నియమించిన అన్ని రకాల టీములు ఈ మిగిలిన రోజుల్లో అత్యంత కీలకంగా విధులు  నిర్వహించాలన్నారు. ప్రతి దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించాలని, డబ్బులు దొరికితే సంబంధిత వ్యక్తుల వివరాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రచారం అనుమతుల మేర సాగేలా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామవళిని పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలన్నారు.

ఖర్చుల వివరాలు సమర్పించాలి

వ్యయ పరిశీలకుడు రాము మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఖర్చుల వివరాలను సంబంధిత నమూనాల్లో సమర్పించాలని, ఖర్చుల విషయంలో ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. అటు అభ్యర్థులు,ఇటు అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనల మేరకు లౌడ్ స్పీకర్లు ఉపయోగించాలన్నారు. ప్రవర్తన నియామవళి ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇతరులపై దూషణలు ఉండకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని కోరారు. వాటికి తోడు జాతీయ సమగ్రత ముఖ్యమన్నారు. దాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దన్నారు. ఓటరు చీటీలను ఈనెల 18, 19 తేదీల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారమే ఓటింగ్ అవకాశం ఉంటుందని, డబుల్స్, డెత్ కేసులుంటే వాటికి మార్కుడు కాపీలలో ముద్రలు వేస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఈనెల 19 వరకు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయ్యిందని, ఈ రోజు వరకు బ్యాలెట్ పేపర్ ముద్రణ పూర్తి చేసి నంబరింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ముద్రణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీల సందర్భంగా నిజమైన పౌరులను ఇబ్బందులు పెట్టవద్దని, నిబంధనలు అతిక్రమణ జరగకుండా చూడాలని సూచించారు. బృందాలు క్రమం తప్పకుండా తిరుగుతూనే ఉండాలని, తనిఖీలు చేస్తుండాలని ఆదేశించారు. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.  సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, అడిషనల్ సీపీలు శ్రీధర్ ఉషా విశ్వనాథ్, శిక్షణ ఐపీఎస్ అధికారి కిరణ్, ఆర్డీవోలు వెంకటయ్య, గోపీరామ్, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జాన్ సాంసన్, శైలజ, గంగాధర్, స్వామి, అధికారులు, తనిఖీ బృందాల సిబ్బంది, పోలీస్ అధికారులు , రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
logo