బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 15, 2020 , 02:10:31

బరిలో 778 మంది..

బరిలో 778 మంది..

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నామినేషన్ల ఉపసంహరణ కీలకఘట్టం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడైంది. జిల్లాలోని  నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో మొత్తం 778 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను 415 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ మాత్రమే అన్ని డివిజన్లలో అభ్యర్థులను పోటీకి నిలిపింది. ప్రతిపక్షాలు అనుకూలతను బట్టి అభ్యర్థులను బరిలోకి దింపాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ సైతం మొత్తం డివిజన్లలో అభ్యర్థులను నిలుపలేక చేతులెత్తేసింది. 6, 45 డివిజన్లలో అభ్యర్థులు దొరకక పోటీకి దూరం కావడం గమనార్హం. బీజేపీ అనూహ్యంగా ఈసారి ఎక్కువ డివిజన్‌లలో పోటీకి సిద్ధమైంది. ఇద్దరు ముస్లిం మైనార్టీలకు కూడా టికెట్‌ ఇవ్వడం కొసమెరుపు. మొత్తం 48 మంది అభ్యర్థులను బీజేపీ బరిలోకి దించింది. వార్డుల విభజనతో ఈ సారి ఎంఐఎం 25 కలిపి ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 248 మంది పోటీలో ఉన్నారు. చివరిరోజు నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పెద్ద మొత్తంలో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 202 మంది చివరి రోజు పోటీ నుంచి తప్పుకోగా.. అంతకు ముందు 27 మంది తప్పుకున్నారు. మొత్తం కార్పొరేషన్‌లో 229 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 415 మంది మాత్రమే పోటీలో ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. బోధన్‌లో 38 వార్డులకు గాను 151 మంది బరిలో నిలిచారు. ఆర్మూర్‌ 36 వార్డులకు 162 మంది, భీమ్‌గల్‌లో 11 వార్డులకు 50 మంది బరిలో ఉన్నారు. కాగా భీమ్‌గల్‌ ఏడో వార్డు, బోధన్‌లోని 19వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. ఇవి టీఆర్‌ఎస్‌ ఖాతాలో బోణీ కొట్టాయి.

నేటి నుంచి ప్రచార పర్వం షురూ..

నామినేషన్ల ఉపసంహరణ కీలకఘట్టం ముగియడంతో ఇక ప్రచార పర్వానికి తెర లేచింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతుండగా.. ప్రతిపక్షాలు సైతం ప్రచార బరిలోకి దిగనున్నాయి. నేడు మకర సంక్రాంతి సందర్భంగా జనాల్లోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. పండుగను వేదికగా చేసుకొని తమ ప్రచారాన్ని నిర్వహించేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 22న పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో 20 వరకే ప్రచారం నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రచారానికి ఇంకా ఆరు రోజులే మిగిలి ఉండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు, అన్ని వర్గాలను కలిసేందుకు ఎవరికి వారే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటరు నాడిని పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఈ సారి స్వతంత్ర అభ్యర్థులు 223 మంది పోటీలో ఉండడం గమనార్హం.
logo