శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 15, 2020 , 02:04:43

గేవర్‌ సూపర్‌..

గేవర్‌ సూపర్‌..
  • సంక్రాంతికి స్పెషల్‌ స్వీట్‌ భైంసా పట్టణంలో 25 దుకాణాల్లో లభ్యం

భైంసా, నమస్తే తెలంగాణ : ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగకు స్పెషల్‌గా సకినాలను చేసుకుంటారు. ఇక పక్కనే మహారాష్ట్రలో సైతం పిండి పదార్థాలకు ప్రఖ్యాతి. కానీ నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణానికి ఇటీవల కాలంలో సంక్రాంతి పండుగకు పేరు వచ్చింది. అదే గేవర్‌.. ఇదో రకమైన పిండి పదార్థం. ఈ గేవర్‌ స్వీట్‌ లేనిదే భైంసా పరిసర ప్రాంతాల ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భైంసా పట్టణంలో ఈ రకం స్వీట్‌ పదార్థం దొరకడం విశేషం.

 పట్టణంలో అందుబాటులో..

సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పిండి పదార్థాలు స్పెషల్‌గా చేస్తారు. సంక్రాంతి పండుగకు  పట్టణంలో పలు హోటళ్లు, దుకాణాల్లో ప్రత్యేకంగా గేవర్‌ను తయారు చేస్తారు. కిలోల కొద్ది ఘుమఘుమలాడే గేవర్‌ను తయారు చేసి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచారు. భైంసా పట్టణంతో పాటు కుభీర్‌, ముథోల్‌, తానూర్‌, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఈ గేవర్‌ స్వీట్‌ పదార్థంతో సంక్రాంతి సంబురాలు జరుపుకుంటారు.

రాజస్థానీల ద్వారానే..

రాజస్థాన్‌ రాష్ర్టానికి చెందిన పలు కుటుంబాలు వలస నిమిత్తం భైంసా పట్టణానికి వచ్చారు. పట్టణంలో హోటళ్లను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగకు ఇక్కడి ప్రాంత ప్రజలకు మిఠాయి పదార్థం అందించేందుకు గేవర్‌ స్వీట్‌ను తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో అంతగా విక్రయించని గేవర్‌ ఇటీవల కాలంలో ఈ గేవర్‌ను ఇక్కడి ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. భైంసాలో ప్రఖ్యాతిగాంచిన కలం స్వీట్‌ను ఈ గేవర్‌ మరింత ఖ్యాతి సాధించే విధంగా రాజస్థాని వాసులు తయారు చేస్తున్నారు. సాధారణ గేవర్‌ కిలో రూ. 200, మలాయ్‌ గేవర్‌ రూ. 400కు విక్రయిస్తున్నారు.

తయారీ ఇలా..

గేవర్‌ను పాలు, మైదా, నెయ్యి, చక్కర మిశ్రమాలతో తయారు చేస్తారు. మొదట్లో ఈ రకం గేవర్‌ అంతగా విక్రయాలు జరగలేదు. దీంతో మలాయ్‌ గేవర్‌ను తయారు చేస్తున్నారు. ఈ మలాయ్‌ గేవర్‌ మైదా, పాలు, నెయ్యి, చక్కరతో తయారు చేయడం ప్రారంభించి పట్టణ ప్రజలకు రుచికరంగా విక్రయిస్తున్నారు. ఎక్కువగా మలాయ్‌ గేవర్‌ భైంసా పట్టణంలో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన గేవర్‌ను కుటుంబీకులు తమ ఇంటి పక్క వారికి, బంధువులు, స్నేహితులకు పంచిపెడుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మహరాష్ట్ర వాసులు సైతం భైంసాకు వచ్చి గేవర్‌ను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. దాదాపు భైంసాలో 25కు పైగా హోటళ్లు ఈ గేవర్‌ను తయారు చేస్తున్నారు. భైంసాలో సంక్రాంతి స్పెషల్‌ గేవర్‌గా చెప్పవచ్చు.logo