శనివారం 30 మే 2020
Nizamabad - Jan 14, 2020 , 03:45:33

ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు

ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు


నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం (నేడు) ముగియనున్న నేపథ్యంలో అందరి దృష్టి దానిపైనే ఉంది. టీఆర్‌ఎస్‌ మాత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటించేసి ప్రచార బరిలో దిగింది. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సోమవారం పలు డివిజన్లలో ప్రచారం మొదలుపెట్టారు. ఆయన సెంటిమెంట్‌గా భావించే నాందేవ్‌వాడ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలో వివరిస్తూ జరిగిన అభివృద్థిని కాలనీవాసుల కళ్ల ముందు ఉంచారు. ప్రతిపక్షాల్లో అభ్యర్థులెవరో తేలక ఇంకా డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో టీఆర్‌ఎస్‌ జనంలోకి వెళ్లి పోయింది. ప్రచార పర్వంలో బిజీ అయిపోయింది. అన్ని వర్గాలను కలుస్తూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ పరిణామం ప్రతిపక్షాల్లో గుబులు రేపుతున్నది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్ని మున్సిపాలిటీల నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ, ప్రచార సరళి పై ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. వేల్పూర్‌లోని తన నివాసంలోనే తిష్ట వేసి నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీలతో తన నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నేడు ఉపసంహరణ ముగిసన తర్వాత అభ్యర్థులంతా ప్రచార పర్వంలో బిజీ కానున్నారు. ఈ నెల 22న పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో 20 వరకు ప్రచారం నిర్వహించుకునే వెసులుబాటు ఉండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నది. ప్రతిపక్షాల్లో ఆ చొరవ, వేగం మందగించింది.logo