బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 14, 2020 , 03:44:57

బోధన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ

బోధన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ


బోధన్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం గడువు ముగియక ముందే టీఆర్‌ఎస్‌ బోణీ చేసింది. బోధన్‌ మున్సిపాలిటీ 19వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలుచేసిన ఖమరున్నీసా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వార్డు నుంచి ఆమెతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థిగా షేక్‌ వసీమా బేగం, స్వతంత్ర అభ్యర్థిగా పున్నం రజిత నామినేషన్లు వేశారు. కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి వసీమాబేగం, స్వతంత్ర అభ్యర్థి పున్నం రజిత తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖమరున్సీసా బేగం ఒక్కరే రంగంలో మిగలడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో పట్టణంలో బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ నివాసగృహంలో సంబురాలు జరిగాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన ఖమరున్నీసా బేగం భర్త ఆబిద్‌ను ఎమ్మెల్యే షకీల్‌ పూలమాలలతో సత్కరించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబురాలు చేసుకున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకున్న పున్నం రజిత భర్త కనకయ్యను, వసీమాబేగం కుటుంబసభ్యులనూ ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్‌ మాట్లాడుతూ.. బోధన్‌ పట్టణంలో ప్రస్తుతం ఒక్క వార్డుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభారంభం అన్నారు. వచ్చే ఎన్నికల్లో మిగిలిన 37 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని, మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్న నిర్ణయానికి బోధన్‌ పట్టణ ప్రజలు వచ్చారన్నారు. ఈ సంబురాల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీ, టీఆర్‌ఎస్‌ బోధన్‌ నియోజకవర్గ నాయకులు గిర్దావర్‌ గంగారెడ్డి, వీఆర్‌ దేశాయ్‌, ఎంఏ రజాక్‌, బుద్దె రాజేశ్వర్‌, ఆబిద్‌ అహ్మద్‌ సోఫీ, బోధన్‌ వైస్‌ ఎంపీపీ కోట గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భీమ్‌గల్‌ ఏడో వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవం
భీమ్‌గల్‌: భీమ్‌గల్‌ మున్సిపల్‌ పరిధిలోని ఏడో వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖైరున్నీసా బేగం ఏకగీవ్రంగా నిలిచారు. ఈ వార్డు నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో నుంచి ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖైరున్నీసా బేగం ఏకగ్రీవమయ్యారు.logo