బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 14, 2020 , 03:43:52

లెక్క తేలేది నేడే

లెక్క తేలేది నేడే


నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నామినేషన్లు ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటికే స్క్రూటీనిలో పలు నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా.. సోమవారం కొంత మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరోవైపు రెండు మున్సిపాలిటీల పరిధిలో ఇరువురు ఏకగ్రీవమయ్యారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో 7వ వార్డు నుంచి అభ్యర్థులు ఉపసంహరించుకోగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖైరున్సీసా బేగం ఏక్రగీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బోధన్‌లో సైతం 19వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖమరున్సీపా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు ఉపసంహరణ సందర్భంగా పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. పలు వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ ప్రక్రియ అనంతరం మధ్యాహ్నం తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఎన్నికల కోలాహలం మొదలుకానున్నది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌ విడతల వారీగా జాబితాను విడుదల చేస్తున్నది. నేడు మధ్యాహ్నం లోగా అధికారులకు బీ-ఫారాలు అందజేయాల్సి ఉంటుంది. బీ-ఫారాలు అందజేసిన వారి నామినేషన్‌కు మాత్రమే పార్టీ సింబల్‌ను కేటాయిస్తారు. మిగతా వారికి స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించి, ఆ మేరకు గుర్తులు కేటాయిస్తారు. కొంత మంది టికెట్‌ ఆశించి ముందుగానే నామినేషన్లు వేశారు. పార్టీ టికెట్‌ ఖరారు కావడంతో కొందరు రెబల్స్‌గా బరిలో ఉండేందుకు నిర్ణయం తీసుకోగా.. మరికొందరు బుజ్జగింపుల పర్వంతో మెట్టుదిగి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. నేడు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచేదెవరో.. రెబల్స్‌గా తిరుగుబాటు అభ్యర్థులుగా ఉండేదెవరో స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచేదెవరో తేలనున్నది.  


logo