బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 13, 2020 , 00:59:38

పల్లె మురిసె !

పల్లె మురిసె !


నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: రెండో విడుత పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతమైంది. ముప్పై రోజుల ప్రణాళిక మాదిరిగానే రెండో విడుత కార్యక్రమాన్ని ప్రజలు సక్సెస్‌ చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దిశానిర్దేశంలో  కలెక్టర్‌ నారాయణ రెడ్డి నిరంతరం పర్యవేక్షణలో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యాయి. యావత్‌ జిల్లా యంత్రాంగం పల్లెల వైపు కదిలాయి. పల్లె జనం కదంకదం కలిపి పల్లెప్రగతిలో భాగస్వాములయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పల్లెలు పరిశుభ్రంగా మారాయి. పచ్చదనం పరిఢవిల్లింది. అభివృద్ధికి బాటలు పడ్డాయి. కనీస సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఏండ్లుగా తిష్ట వేసిన సమస్యలు పరిష్కారమయ్యాయి. విరాళాలు వెల్లువలా వచ్చాయి. తమ ఊరి బాగు కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలు విరాళాలు ప్రకటించి ఆదర్శంగా నిలిచారు.

రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గత నెల 22న జిల్లా యంత్రాంగానికి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అవగాహన సదస్సును రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు. గత నెల 28న కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ నెల 2న గ్రామసభ నిర్వహించి మొదటి విడత పల్లె ప్రగతిలో చేపట్టిన, పూర్తి చేసిన పనుల నివేదికను, వ్యయ వివరాలను, రెండో విడుత పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళికను ప్రజలకు వివరించారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేంగల్‌ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

పారిశుద్ధ్యంపై ప్రత్యేక నజర్‌...

- గ్రామాలలో కూలేందుకు సిద్ధంగా ఉన్న 1568 ఇండ్లను గుర్తించి యజమానుల అంగీకారంతో 1391 ఇండ్లను కూల్చివేశారు.
- గ్రామాల్లో 7379 పిచ్చి మొక్కల పొదలున్న ప్రాంతాలను గుర్తించి 6992 ప్రాంతాల్లోని పొదలను తొలగించారు.
- 1060 లోతట్టు ప్రాంతాలకు 1009  ప్రాంతాల్లో మొరం వేసి పూడ్చి వేశారు.
- అన్ని మురికి కాలువలను శుభ్రం చేసి ఆ చెత్తను, మట్టిని ఎత్తివేశారు.
- గ్రామాలను సంపూర్ణ ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా చేయడానికి సంబంధిత గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీర్మానం చేశాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేక ప్లాస్టిక్‌ కలెక్షన్‌ యూనిట్‌లను ఏర్పాటు చేశారు.
- పలు గ్రామ పంచాయతీల్లో వినూత్నంగా ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి తెచ్చిన వారికి కిలో బియ్యం, కిలో చక్కెర, గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
- రోడ్లపై ఉన్న 2281 గుంతల్లో 225 గుంతలను పూడ్చి వేశారు.
- ప్రభుత్వ భవనాలైన పాఠశాలలు 964, అంగన్‌వాడీ పాఠశాలలు 1048, కమ్యూనిటీ భవనాలు 688, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు 210లను శుభ్రం చేశారు. గ్రామాల్లో ముఖ్య కూడళ్ల వద్ద చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో 1,18,125 చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
- చెత్తను రిక్షాలు, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డులకు తరలించారు. గ్రామ ప్రజలు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ మలవిసర్జన చేసినా జరిమానా విధించడానికి కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ సభల్లో తీర్మానం చేశాయి. ఈ విషయంలో ప్రజలు ఉల్లంఘిస్తే జరిమానా తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
- గ్రామాల్లో దోమల నివారణ మందు, గడ్డి మందు పిచికారీ చేశారు.
- అన్ని మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేసి, రంగులు వేయడం, మంచినీటి పైపులైన్‌ లీకేజీలను బాగు చేశారు.  మురికి ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను వేశారు.
- కొత్తగా 140 గ్రామాలలో చెత్త సేకరణ, హరితహారం నిర్వహణకు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లో బ్యాంకుల సహాయంతో ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి తగు చర్యలు తీసుకున్నారు.


logo