శనివారం 30 మే 2020
Nizamabad - Jan 13, 2020 , 00:57:58

కళ్యాణి ప్రాజెక్ట్‌లో నీరు ఖాళీ

కళ్యాణి ప్రాజెక్ట్‌లో నీరు ఖాళీ


ఎల్లారెడ్డి రూరల్‌ : కళ్యాణి ప్రాజెక్ట్‌ మూడో గేటును శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తివేయడంతో ప్రాజెక్టులోని నీరు ఖాళీ అయ్యింది. దీంతో సుమారు 700 ఎకరాలకు సరిపడా నీరు ఉందన్న భరోసాతో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కింద మూడు గ్రామాలకు చెందిన రైతులు పంట పొలాలు సాగు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుంటే కొందరు ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రి పరిస్థితులు తారుమారు అవడంతో ప్రాజెక్ట్‌ పరిధిలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంజీరాలో వృథాగా కలిసే ఓవర్‌ ఫ్లో వాటర్‌ను నిలిపితే రైతులకు ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో 1998లో అప్పటి ప్రభుత్వం కళ్యాణి ప్రాజెక్టును నిర్మించింది. ప్రాజెక్ట్‌ పరిధిలోని తిమ్మాపూర్‌, తిమ్మాపూర్‌ తండా, అన్నాసాగర్‌ గ్రామాల రైతులకు ప్రాజెక్టు వరంగా మారింది. గత వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌లో నిండుగా నీరు ఉండడంతో ఈ మూడు గ్రామాల రైతులు యాసంగిలో సుమారు 700 ఎకరాలను దుక్కిదున్ని  నాట్లకు సిద్ధం చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల చర్యల వల్ల ప్రాజెక్ట్‌ ఖాళీ కావడంతో ప్రస్తుతం రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పంటల సాగుకు సిద్ధమైన రైతులకు నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది.

కాలిపోయిన సుమారు 50 బోరు మోటార్లు...

ప్రాజెక్ట్‌లోని నీరు ఖాళీ కావడంతో పంటల సాగుకు నీరందించడానికి ఏర్పాటు చేసుకున్న సుమారు 50 బోరు మోటార్లు కాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఖాళీ కావడంతో పాటు బోరు మోటార్లు కాలిపోవడంతో రెండు విధాలా రైతులు నష్టపోతున్నారు. ఆదివారం ఉదయం తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి చూడడంతో బోరుమోటారు కాలిపోయింది. ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఇరిగేషన్‌ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు.

ప్రాజెక్టు గేటును ఎత్తివేసిన గుర్తుతెలియని వ్యక్తులు

గుర్తు తెలియని వ్యక్తులు కల్యాణి ప్రాజెక్ట్‌ గేట్‌ను ఎత్తివేయడంతో స్టోరేజీ ఉన్న నీళ్లు కాస్తా ఖాళీ అయ్యాయి. మండల పరిధిలోని కల్యాణి ప్రాజెక్ట్‌ 3వ గేటును శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టుల్లో స్టోరేజీ ఉన్న నీరు ఖాళీ అయ్యింది. ఆదివారం ఉదయం పొలానికి నీరు పారించేందుకు వచ్చిన రైతు ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడం చూశాడు. గేటు ఎత్తినట్లు గమనించి వెంటనే మూసి వేసి ఇరిగేషన్‌ అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రాజెక్ట్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో ప్రాజెక్ట్‌ పరిధిలోని తిమ్మాపూర్‌, తిమ్మాపూర్‌ తండా, అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన రైతులు సుమారు 700 ఎకరాలకు సంబంధించి నారు సిద్ధం చేసుకున్నారు. రాత్రికి రాత్రి ప్రాజెక్ట్‌లోని నీరు ఖాళీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటితో మళ్లీ ప్రాజెక్టులో నీటిని నింపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిజాంసాగర్‌ ఇరిగేషన్‌ ఏఈఈ శివప్రసాద్‌ మాట్లాడుతూ.... బొగ్గు గుడిసె వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తిసామన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.


logo