శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 12, 2020 , 06:01:33

అర్వింద్‌ అబద్ధాల పుట్ట

అర్వింద్‌ అబద్ధాల పుట్ట
  • రైతులు, ప్రజలను మోసం చేసిన ఎంపీ
  • త్వరలో ‘పల్లెప్రగతి’ తరహాలో ‘పట్టణ ప్రగతి’
  • మున్సిపాలిటీలకు భారీగా నిధులిచ్చాం
  • పురపోరులో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయం
  • ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : నిజామాబాద్‌ ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ అబద్ధాలతో రైతులు, మహిళలు, పేదలను మోసం చేసి గెలిచాడని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు అంశాల్లో అర్వింద్‌ పచ్చి అబద్ధాలాడి మోసం చేసి గెలిచాడని,  వాస్తవాలను ప్రజల ముందు బాధ్యత గల మంత్రిగా ఉంచుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఇస్తున్న ఆసరా పింఛన్లు కేంద్రమే ఇస్తుందని పచ్చిగా అర్వింద్‌ అబద్ధాలు ప్రచారం చేశాడని అన్నారు. రాష్ట్రంలో 45లక్షల మందికి ఆసరా పింఛన్ల కింద రూ. 9,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే.. కేంద్రం ఇందులో ఇచ్చేది కేవలం రూ. 200 కోట్లు మాత్రమేనని వివరించారు. రూ.200 కోట్లు ఎక్కడ?, రూ. 9వేల కోట్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. పేదలకు ఇండ్ల నిర్మాణం విషయంలోను అర్వింద్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఒక్కొ ఇంటి నిర్మాణానికి కేవలం రూ. 1.50 లక్షలు మాత్రమే ఇస్తోందన్నారు. తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి రూపకల్పన చేశారన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు, మౌలిక వసతుల కల్పనకు మరో రూ.1.50 లక్షలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం అన్ని రాష్ర్టాల్లో వివిధ ఆరో గ్య పథకాల కింద అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధు లు ఇస్తోందన్నారు. ఇది రాష్ర్టాల హక్కు అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.  2019లో కేసీఆర్‌ కిట్‌ కోసం టీఆర్‌ఎస్‌ సర్కారు రూ.430 కోట్లు వెచ్చిస్తే, అందులో కేంద్రం నుంచి ఆరోగ్య పథకాల కింద వచ్చిన డబ్బుల నుంచి రూ. 80 కోట్లు మాత్రమే కేసీఆర్‌ కిట్‌కు వినియోగించారన్నారు. 

పసుపుబోర్డు పేరిట అర్వింద్‌ నయవంచన.. 

 పసుపు బోర్డు పేరిట రైతులను ఎంపీ అర్వింద్‌ నయవంచనకు గురి చేశారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇప్పిస్తానని బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చిన అర్వింద్‌, తొమ్మిది నెలలు కావస్తున్నా ఇవేవి చేయలేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. అర్వింద్‌ అబద్ధాలతో మోసం చేశారని రైతులు గ్రహించారన్నారు.  దశాబ్దాలుగా పసుపుబోర్డు కోసం ఎదురుచూస్తున్న రైతులు అర్వింద్‌ అబద్ధాలను నమ్మారు అని అన్నారు. అర్వింద్‌ పసుపుబోర్డు పై రోజుకో రకంగా, తికమకగా మాట్లాడుతుంటే రైతులు నవ్వుకుంటున్నారని విమర్శించారు. నమ్మి ఓటేస్తే అర్వింద్‌ మోసం చేశాడని కన్నీళ్లు కూడా పెడుతున్నారని అన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు కేంద్ర పరిధిలోనిది కాబట్టి, జాతీయ పార్టీ అయిన బీజేపీ అభ్యర్థిగా ఉన్న అర్వింద్‌ కేంద్రం నుంచి బోర్డు తెస్తాడని రైతులు నమ్మారని పేర్కొన్నారు.  

సమష్టిగా పనిచేసి గులాబీజెండా ఎగురవేద్దాం..  

టీఆర్‌ఎస్‌ శ్రేణులన్నీ కలిసి సమష్ఠిగా పనిచేసి మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాల సమాచారాల ఆధారంగా గెలువగల అభ్యర్థులనే పోటీలో పార్టీ నిలిపిందన్నారు. టికెట్‌ రాని వారు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. టికెట్‌ రానివారి కోసం భవిష్యత్తులో నామినేటెడ్‌ పోస్టులు గానీ, పార్టీ పదవులు కానీ సమయం, సందర్భాన్ని బట్టి దక్కేలా ఉమ్మడి జిల్లా మంత్రిగా సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు విన్నవిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.  మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చరిత్రలో లేని విధంగా నిధులను మంజూరు చేశారని గుర్తుచేశారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు, కామారెడ్డి మున్సిపాలిటీకి రూ. 60 కోట్లు, బోధన్‌ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, ఆర్మూర్‌ ము న్సిపాలిటీకి రూ. 30 కోట్లు, బాన్సువాడ మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు, భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. ఎంతో బలంగా మారిన టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్ల కోసం పోటీ నెలకొనడం సహజమేనని అన్నారు. ఎదుటి పార్టీల్లో అభ్యర్థులు  దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం 

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి తుల ఉమ అన్నారు. జిల్లాలోని ఒక కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాల్టీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధే తమ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌  మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి లోక బాపురెడ్డి , మధు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. logo