గురువారం 28 మే 2020
Nizamabad - Jan 12, 2020 , 01:59:05

సురక్షిత ప్రయాణమే లక్ష్యం!

 సురక్షిత ప్రయాణమే లక్ష్యం!నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల నిజామాబాద్‌ నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన సుంకెటి అరవింద్‌(15)ను శ్రీమేథ కళాశాల బస్సు ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో రవాణా శాఖ స్పందించింది. జిల్లాలోని స్కూల్‌ బస్సులను నడుపుతున్న డ్రైవర్లకు డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నది. బస్సుల ఫిట్‌నెస్‌ సరిగ్గా ఉన్నా.. నాలుగు వైపులా పరిస్థితులు గమనిస్తూ ప్రమాదాలు జరగక ముందే వాటిని నివారించేలా జాగ్రత్తలతో కూడిన డ్రైవింగ్‌ చేసే పద్ధ్దతి (డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ టెక్నిక్‌)ని డ్రైవర్లకు శిక్షణనివ్వాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 700కు పైగా స్కూల్‌ బస్సులు ఉన్నాయి. వీటి ఫిట్‌నెస్‌ను విద్యాసంస్థల ప్రారంభానికి ముందే స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి పూర్తి చేయిస్తున్నారు.  డ్రైవర్లు డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ టెక్నిక్‌ పై శిక్షణనిస్తే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ బస్సు డ్రైవర్లందరికీ ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐలతో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన పెంచాలని నిర్ణయించారు. ఈనెల 13 నుంచి ఈ శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని డీటీసీ వెంకటరమణ తెలిపారు. విడతల వారీగా జిల్లాలోని అన్ని స్కూల్‌ బస్సుల డ్రైవర్లకు ఈ శిక్షణనిప్పిస్తామని ఆయన తెలిపారు. దీంతో పాటు విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు, పాదచారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైల్డ్‌ ట్రైనింగ్‌ పార్కు మాదిరిగా ఇక్కడా ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రోడ్డు నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రేపు ప్రజావాణి రద్దు

ఇందూరు: ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 13న ఉండదని కలెక్టర్‌ నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజల ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


logo