శనివారం 30 మే 2020
Nizamabad - Jan 12, 2020 , 01:57:47

నెలాఖరులోగా పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలి

నెలాఖరులోగా పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలి


ఇందూరు: పల్లె ప్రగతి-2 కార్యక్రమం ఫార్మల్‌గా మాత్రమే ఈ నెల 12న ముగిస్తున్నామని దీని పనులన్నీ పూర్తయ్యే వరకు ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తూ, పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెల్‌ కాన్ఫరె న్సు ద్వారా మండల, జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. ఇందులో నిర్దేశించుకున్న డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేయించాలన్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో నర్సరీలలో మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకోవడంతో పాటు మొదటి విడతలో నాటిన మొక్కలు ఏవైనా చనిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్తవి నాటించాలని, ప్రతి ఇంటికి తడి పొడి చెత్త బుట్టలు అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం శుభ్రంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామంలో మొక్కలతో పచ్చదనం వెల్లివిరియాలని పేర్కొన్నారు. పాఠశాలలు, అంగన్‌ వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు శుభ్రంగా ఉంచి అవసరమైతే రంగులు వేయించాలని అన్నారు. గ్రామంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల నుంచి, గ్రామ పెద్దల నుంచి విరాళాలు సేకరించి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ సమకూర్చుకోవాలని, ఈ పనులను ఈ నెల చివరి వరకు కొనసాగిస్తూ పల్లె ప్రగతిలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా గ్యాప్‌ ఉంటే సంబంధిత అధికారుల పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆకస్మికంగా ఏ గ్రామానికి అయినా రావచ్చని తెలిపారు.

పాలిటెక్నిక్‌ను పరిశీలించిన కలెక్టర్‌ 

ఖలీల్‌వాడి: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం పాలిటెక్నిక్‌ కళాశాలను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ముందుగా కౌంటింగ్‌ హాల్స్‌గా ఎంపిక చేస్తే ఏ విధంగా ఉంటుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గతంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివి బీటెక్‌ అనంతరం నెలకు రూ. 80వేల వేతనంతో ఉద్యోగాన్ని సాధించిన వైష్ణవిని అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువుకోవాలనే కసి ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రస్తుతం మీ వయసులో టీచర్లు లేకున్నా స్వయంగా చదువుకొని అర్థం చేసుకునే స్థాయికి మీరు వచ్చారన్నారు.  కారణాలు వెతుక్కోకుండా సక్సెస్‌ కోసం కమిట్‌మెంట్‌ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్‌ వెంట డీఆర్వో అంజయ్య, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, ఆర్డీవో వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీరాంకుమార్‌ తదితరులు ఉన్నారు.


logo