శనివారం 16 జనవరి 2021
Nizamabad - Jan 09, 2020 , 18:49:17

అర్వింద్ నయా డ్రామా..

అర్వింద్ నయా డ్రామా..

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎంపీ అర్వింద్‌కు పసుపుబోర్డు అంశం ఓట్లు రాల్చే యంత్రంలా మారింది. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఐదు రోజుల్లో, నెల రోజుల్లో పసుపుబోర్డు తెస్తానంటూ హామీలు గుప్పించి రైతుల ఓట్లను కొల్లగొట్టిన ఆయన.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అదే పాటనందుకున్నారు. ఢిల్లీలో ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి.. పసుపు బోర్డు ఓ అంబాసిడర్ కారులాంటిందని, టొయాటో కారు లాంటి పథకాన్ని తీసుకురాబోతున్నానని రైతుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. అసలు తనకు పసుపు బోర్డు గురించి పార్లమెంట్ ఎన్నికల సమయానికి అవగాహనే లేదని తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు.

కవితను ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేశానని, బోర్డు తెస్తాననే హామీ ఉత్తదేనన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన తీరు అర్వింద్‌తో పాటు ఏకంగా పార్టీని కూడా నవ్వుల పాలు చేసింది. దీని తర్వాత పార్టీలో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. అర్వింద్ తీరు బీజేపీని ఇబ్బందుల పాలు చేస్తున్నదని, ప్రజల వద్ద పలుచనయ్యేలా చేస్తున్నదని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. తాజాగా అర్వింద్ కొత్త రాగాన్ని.. కాదు కాదు.. పాతరాగాన్నే అందుకున్నారు. అదేమంటే.. ఈ నెలలోనే పసుపు బోర్డు తెస్తానని ప్రకటించారు. ఆదివారం భీమ్‌గల్‌లో జరిగిన పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ నెలలోనే పసుపు బోర్డు తెస్తానని ప్రకటించడంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. పసుపు బోర్డు ఎందుకు దండగ.. అన్న రీతిలో మాట్లాడిన అర్వింద్ .. ఇప్పుడు మళ్లీ పసుపు బోర్డు తెస్తానని హామీ ఇవ్వడం బల్దియా ఎన్నికల్లో లబ్ధి కోసమేనని రైతులు మండిపడుతున్నారు. అర్వింద్ మాటలు పట్టించుకొనేదే లేదని, ఆ పార్టీ జాతీయ నేతలు సైతం రైతులకు హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబడుతున్నారు. ఐదు రోజుల్లో, నెల రోజుల్లో అని చెప్పిన వ్యక్తి.. ఇప్పటి వరకు ఎందుకు తేలేదని నిలదీస్తున్నారు.

ప్రజాక్షేత్రంలో పసుపుబోర్డు విషయంలో అర్వింద్ అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. వ్యతిరేక నినాదాలు ఎక్కువవుతున్నారు. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ క్రమంలోనే వచ్చిన మున్సిపల్ ఎన్నికల బాధ్యత అర్వింద్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. దీంతో మళ్లీ పాత పాటనుందుకున్నారు. ఈ నెలలోనే పసుపు బోర్డు తెస్తానంటూ వాగ్ధానాల శరాలు సంధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు బోర్డు కోసం లేఖ రాయడం లేదంటూ విషయాన్ని పక్కదారి పట్టేందుకూ ఇంకా ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు కావాలంటూ ప్రధాని సహా ముఖ్యమంత్రులను కలిసి వారందరి మద్దతు కూడగట్టారు. రైతులతో కలిసి పోరాటం చేశారు. పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టించారు. పసుపు బోర్డు సాధనలో ఆమె అలుపెరగని కృషికి ఇక్కడి రైతులు మర్చిపోలేదు. కానీ.. నెలలోనే తెస్తానని హామినిచ్చిన అర్వింద్.. ఆ విషయాన్ని విస్మరించి మొన్నటి వరకు చులకనగా మాట్లాడడమే కాకుండా.. ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత మళ్లీ.. నెలలోనే తెస్తానని అనడం హాస్యాస్పదంగా మారింది.