e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home కామారెడ్డి ఆత్మబంధువు..దళిత బంధు

ఆత్మబంధువు..దళిత బంధు

  • సీఎం కేసీఆర్‌ ఆలోచనకు జేజేలు పలుకుతున్న ప్రజలు
  • అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పథకం అమలు
  • సామాజిక వెనుకబాటుతనంపై దృష్టి సారించిన కేసీఆర్‌
  • పైలట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో పథకం అమలుకు శ్రీకారం
  • అనంతర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నిర్ణయం
  • సర్కారు చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సమాజం

నిజామాబాద్‌, జూలై 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలంతా ఇంకా వెనుకబాటుకు గురవుతున్నారు. వారి జీవితాల్లో చీకటి తప్ప వెలుగులు దరిచేరడం లేదు. ప్రజాస్వామిక దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ ఓట్ల కోసం హామీలు గుమ్మరించుడే తప్ప అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నేటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్న దళిత కుటుంబాలు ప్రతి గ్రామంలో అనేకం ఉన్నాయి. గడిచిన కొద్దికాలంలో తెలంగాణ స్వరాష్ట్రంలో ఆత్మగౌరవం దక్కుతున్నప్పటికీ కొన్ని కు టుంబాలకు శాశ్వతంగా పేదరికం మాత్రం పోవ డం లేదు. కిందిస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను తొలగించి దళిత సమాజంలో నేటికీ వివక్షకు గురవుతున్న వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిశ్చయించడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దళితులంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం దళిత సాధికారత పథకం పేరుతో జరిగిన చర్చోపచర్చల్లో వెల్లువెత్తిన ఆలోచనలు, సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రతిష్టాత్మక పథకానికి దళిత బంధు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఈ పథకాన్ని త్వరలోనే కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో అమలుకు శ్రీకారం చుట్టబోతుండడంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని మూడున్నర లక్షల మంది దళిత ప్రజలంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దళిత బంధు పథకం ద్వారా కేసీఆర్‌ ఆయావర్గాలకు ఆత్మబంధువుగా నిలవడం ఖాయమని ప్రజలంతా కొనియాడుతున్నారు.

మానవీయ పరిపాలన…
తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు, ఇప్పుడున్న పరిస్థితులకు మధ్య స్పష్టమైన తేడాలున్నాయి. ఆనాడు పాడుబడిన ఊర్లు, పడావు భూములు ఉండేవి. నేడు పచ్చని పొలాల మధ్య ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసుకుంటున్న రైతన్నలు కనిపిస్తున్నారు. కోతల్లేని కరెంట్‌, కొత్తగా అందివచ్చిన సాగునీటి సదుపాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, పెట్టుబడి సాయం చేస్తూనే, పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో రంది లేదు. పల్లెల్లో ఉన్న భూమి అమ్ముకొని పట్టణాల్లో కొలువులు వెతుక్కున్న స్థితి నుంచి తెలంగాణ రైతులు ఇప్పుడు తిరిగి పల్లెబాట పట్టి వ్యవసాయం చేసుకునే స్థాయికి వచ్చారు. ముందుచూపుతో వ్యవసాయ రంగంలో మర్పులను, రైతులకు ఎదురవుతున్న సమస్యల్ని గుర్తించి వాటికి సీఎం పరిష్కారాలను చూపించారు. కేసీఆర్‌ పట్టుదలతో ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తూ, యంత్రాంగాన్ని పని చేయిస్తున్న తీరు అభినందనీయం. రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడిచి యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు దళిత బంధు పథకం ద్వారా మరోమారు అందరి దృష్టిని ఆకట్టుకోబోతున్నారు. సమాజ సంక్షేమం కోసం, దళితులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అభివృద్ధి వైపు నడిపించడం కోసం పడుతున్న తపన, ఆరాటం అంతా ఇంతా కాదు. ప్రతి పథకంలో మానవీయతను జోడించి గతంలో ఎన్నడూ అందని విధంగా రెట్టింపు సాయాన్ని అందిస్తూ మానవీయ పరిపాలనను ప్రజలకు చేరవేస్తున్నారు.

- Advertisement -

దళిత బంధువు…
తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో సంక్షేమ రాజ్యం పరిఢవిల్లుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఏడేండ్లలో అ మలు చేయని పథకం అంటూ లేదు. అన్ని వర్గాల ప్రజల సాధారణ సమస్యలను తీరుస్తూనే ఆయా వర్గాలకు ప్రోత్సాహకాలు అందించారు. పూర్తి రాయితీతో అనేక పథకాలను తీసుకువచ్చారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలకు తోడుగా దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ అనే కొత్త పథకాన్ని రూ.వేల కోట్లతో ఆరంభించనున్నట్లుగా సీఎం ప్రకటించారు. దళితుల్లో ఉన్న సమస్యలను కూకటి వేళ్లతో తొలగించడం కోసం ఈ పథకం రూపొందించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం భుజానకేసుకున్నది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు ప్రభుత్వం ఎంతో లబ్ధి చేకూర్చింది. ఆసరా పెన్షన్‌, కల్యాణలక్ష్మి, గురుకులాల ద్వారా అధిక శాతం ప్రయోజనాలు అందాయి. ఇప్పుడు ఈ నూతన పథకం మరింతగా దళితుల మేలు కోసం పాటుపడనున్నది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన వంద దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలనే ఆలోచనపై దళిత మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే నిధులు మరింత పెంచుతామని కేసీఆర్‌ ప్రకటించడంతో పాటు దళిత బంధు పథకం అనేది సబ్‌ ప్లాన్‌ నిధులకు అదనపు కేటాయింపులను చెప్పడంతో ఆ వర్గాల్లో సంతోషం రెట్టింపు అవుతున్నది.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ..
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల మంది దళిత జనాభా ఉంది. నిజామాబాద్‌ జిల్లా మొత్తం జనాభా 15లక్షల 77వేలు. ఇందులో పురుషులు 7.71లక్షలు కాగా, స్త్రీలు 8.05లక్షలు మంది ఉన్నారు. షెడ్యూల్డ్‌ కులాల జనాభా 2.17లక్షలు. ఇందులో పురుషులు 1.04 లక్షలు, స్త్రీలు 1.12 లక్షలు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్‌ కులాల శాతం 13.78 శాతంగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా మొత్తం జనాభా 9.72లక్షలు. పురుషులు 4.78 లక్షలు కాగా స్త్రీలు 4.94 లక్షలుగా ఉన్నారు. షెడ్యూల్డ్‌ కులాల జనాభా 1.53 లక్షలు. ఇందులో పురుషులు 74,133, స్త్రీలు 79,169 మంది ఉన్నారు. మొత్తం జిల్లా జనాభాలో షెడ్యూల్డ్‌ కులాల శాతం 15.76 శాతంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో దళిత ప్రజలు అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ మంది ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలోనే దళితులకు సంక్షేమ పథకాలు
సీఎం కేసీఆర్‌ ముందు చూపు ఉన్న వ్యక్తి. దళితులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దళితబంధు పథకం ప్రకటించి మా పాలిట దేవుడయ్యాడు. సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణాపడి ఉంటాం.
-బట్ట రమేశ్‌,అక్కాపూర్‌,మాచారెడ్డి మండలం

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో ఏ రాష్ట్రంలోనూ దళితులను పట్టించుకోలేదు. ఏడు సంవత్సరాల నుంచి దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. ‘దళితబంధు’ తో మా జీవితాలు మారబోతున్నాయి.
-సాడెం నర్సింహులు, ఘన్‌పూర్‌(ఎం), మాచారెడ్డి మండలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana