e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home కామారెడ్డి అర్హులందరికీ ‘ఆహార భద్రత’

అర్హులందరికీ ‘ఆహార భద్రత’

  • ఈ నెల 26నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ
  • దరఖాస్తుల పరిశీలన, క్షేత్ర స్థాయి విచారణ పూర్తి
  • అర్హులైన లబ్ధిదారుల లెక్క తేల్చిన పౌరసరఫరాల శాఖ
  • ఉమ్మడి జిల్లాలో 21,489 మందికి కొత్త కార్డులు
  • సీఎం ఆదేశాలతో ఆగస్టు నుంచి సరుకుల పంపిణీకి ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):నూతన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరికీ కొత్త కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం నూతన కార్డులను అందించేందుకు సన్నద్ధం అవుతున్నది. గతంలో వచ్చిన దరఖాస్తులను నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని అధికారులు పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులుగా తేలిన వారందరికీ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అర్హత లేకపోయినా దరఖాస్తు చేసిన వారి వినతులను తిరస్కరించారు. జూలై 26 నుంచి 31వ తేదీ వరకు నూతన రేషన్‌ కార్డులు జారీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 21,489 మంది అర్హులుగా ఉన్నట్లుగా తేల్చారు. దాదాపు 4,800 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. ప్రస్తుతం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 6లక్షల 38వేల రేషన్‌ కార్డులున్నాయి. వీటికి అదనంగా ఆగస్టు నుంచి సుమారు 21 వేల రేషన్‌ కార్డులు జత కానున్నాయి.

అర్హులందరికీ ఆహార భద్రత…
కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అర్హులైన పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆహార భద్రత లభించనున్నది. గతంలో ఉన్న రేషన్‌ కార్డులో అదనంగా పేర్లు నమోదు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు నూతన కార్డుల కోసం, సంతానం కలిగిన వారంతా తమ పిల్లలు పేర్లను జోడించడం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో రేషన్‌ కార్డుల మంజూరు కోసం దాదాపు 25వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజులుగా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్‌ జిల్లాలో 20,817 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 4,481 దరఖాస్తులను తిరస్కరించారు. 16,205 దరఖాస్తులను అప్రూవ్‌ చేయడంతో వీరందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ కానున్నాయి. మరో వందకు పైగా దరఖాస్తులు రెవెన్యూ అధికారుల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలిసింది. ఇవీ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. కామారెడ్డి జిల్లాలో 5,649 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 365 దరఖాస్తులను తిరస్కరించారు. 5,284 మందికి నూతన రేషన్‌ కార్డు లు మంజూరు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21,489 మందికి కొత్త రేషన్‌ కార్డులు రానున్నాయి.

- Advertisement -

ఇదీ లెక్క…
నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 3లక్షల 90వేల 515 రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,68,770 ఉండగా 12లక్షల 32వేల 991 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నది. అంత్యోదయ కార్డులు 20,628 ఉండగా వీటి పరిధిలో 56,519 మంది ఉన్నా రు. ఒక్కో కార్డుకు 35 కిలోల బియ్యం అందిస్తున్నారు. ప్రతి నెలా సుమారు 1000 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేస్తున్నారు. అన్నపూర్ణ కార్డులు 1117 ఉన్నా యి. వీటి పరిధిలో 1145 మంది ఉన్నారు. వీరికి 10 కిలోల బియ్యం చొప్పున ప్రతి నెలా 11మెట్రిక్‌ టన్నులు అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 2లక్షల 48వేల 268 రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 2లక్షల 29వేల 965, అంత్యోదయ 17,309, అన్నపూర్ణ కార్డులు 994 ఉన్నాయి. అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా, ఆహార భద్రత, అంత్యోదయ కార్డుదారులకు రూపాయికి కిలో బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కో సభ్యుడికి 6 కిలోల చొప్పున 8,15, 327 మందికి 4,891 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డుల పరిధిలో 50,358 ఉన్నారు. ఒక్కో కార్డుకు 35 కిలోల చొప్పున 605 మెట్రిక్‌ టన్నులు, అన్నపూర్ణ కార్డుల్లో 1,015 మందికి 9.9 మెట్రిక్‌ టన్నులు మొత్తం కామారెడ్డి జిల్లాలో ఒక నెలలో 5,507 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.

పౌరసరఫరాల శాఖ సన్నద్ధం…
కొత్త రేషన్‌ కార్డులను జూలై 26 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయించడంతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. కొద్ది రోజులుగా నూతన రేషన్‌ కార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ భారీ ఊరట దక్కనుంది. నెల రోజులుగా కొత్త రేషన్‌ కార్డులకు వచ్చిన దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారందరినీ గుర్తించింది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో విచారణ జరిపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను నిర్ధారించిన తర్వాత దరఖాస్తులను అప్రూవ్‌ చేశారు. ఇందులో అర్హత లేకున్నప్పటికీ దరఖాస్తులు చేసిన వాటిని తిరస్కరించారు. సీఎం ఆదేశాలతో నూతన రేషన్‌ కార్డులు జారీ కానున్నాయి. ఈ నెలాఖరు వరకు రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉండనున్నట్లుగా తెలుస్తున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంది. కొత్త కార్డుదారులకు ఎలాంటి జాప్యం లేకుండానే వచ్చే నెల నుంచే సరుకులు పంపిణీ చేయనున్నారు.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ సన్నద్ధం అవుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana