e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home కామారెడ్డి దెబ్బతిన్న చెరువులు,పంటలను పరిశీలించిన మంత్రి

దెబ్బతిన్న చెరువులు,పంటలను పరిశీలించిన మంత్రి

  • 35 ఏండ్ల తర్వాత మత్తడి దుంకిన మోతె చెరువుకు పూజలు
  • సాగునీటికి గోసపడిన మోతె.. నేడు జలకళతో మురిసిపోతుంది
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వేముల ప్రశాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌, జూలై 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):అతి భారీ వానలతో నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వానలతో చెరువులు మత్తడి పోయగా… వాగులు, వంకలు ఉప్పొంగాయి. రికార్డు స్థాయిలో జూలై నెలలోనే జలాశయాలు అలుగులు పోయడంతోపాటు ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. భారీగా వరద పోటెత్తడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు హుటాహుటిన వరద ప్రాంతాలకు గురువారమే చేరుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వరుసగా రెండో రోజు ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికార బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో తిరిగారు. వరదతో దెబ్బతిన్న పంటలను, రోడ్లను పరిశీలించారు. మరమ్మతులకు అధికారులకు ఆదేశాలిచ్చారు. పంట నష్టానికి సంబంధించి రైతులకు భరోసా కల్పించారు. పొలం గట్లపై నడుస్తూ… వాహనాలు తిరుగని ప్రాంతాలకు మోటర్‌ సైకిల్‌పై వెళ్లి వాస్తవ స్థితిని తెలుసుకున్నారు. మోతె గ్రామంలో 35 ఏండ్ల తర్వాత మత్తడి దుంకిన చెరువును చూసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంబురపడ్డారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నదని మంత్రి వేముల చెప్పారు. గురువారం ఒక్క రోజే మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగిందన్నారు. వరద ప్రవాహానికి తగ్గట్లుగా ఐదు లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. ఎస్సారెస్పీలో 85 టీఎంసీలు బ్యాలెన్సు చేస్తూ ప్రస్తుతం 2లక్షల క్యూసెక్కుల మేర వరదను కిందికి వదులుతున్నామన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దిగువ ఉన్నవారు ఒకట్రెండు రోజులు బయటికి రాకుండా ఉండాలని వాతావరణ శాఖ సూచన చేస్తుందని మంత్రి తెలిపారు. విద్యుత్తు, ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూస్తున్నారని చెప్పారు. ముచ్కూర్‌లో చెరువు తెగిపోవడంతో మరమ్మతులు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. చెరువు కట్ట కింద ఉన్న 150 ఎకరాల్లో పంట నీట మునిగి ఇసుక, మట్టి చేరిందన్నారు. నష్టాన్ని అంచనా వేయాలని తహసీల్దార్‌, వ్యవసాయ అధికారులను వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

రాత్రంతా మేల్కొని..
ఏకధాటి వానలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో గురువారం నది పరీవాహక ప్రాంతాల్లో తిరిగిన మంత్రి వేముల శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. గురువారం అర్ధరాత్రి వరకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు స్థితిని అంచనా వేస్తూ ఇరిగేషన్‌ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. మెండోరా మండలంలోని తడ్‌పాకల్‌ శివారులో ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులను కాపాడడం కోసం మంత్రి తీవ్రంగా శ్రమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తో మాట్లాడి అవసరమైతే హెలికాప్టర్‌ తెప్పించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. సీఎం ఆదేశాలతో అప్పటికే స్పాట్‌కు చేరుకున్న ఎన్డీఆర్‌ఆఫ్‌ బృందాలు క్షేమంగా పడవల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి స్వయంగా సమీక్షించారు. శుక్రవారం ఉదయం తన స్వగృహంలో అధికార యంత్రాంగంతో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

సంబురం వ్యక్తం చేసిన వేముల..
బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కలియ తిరిగారు. మోతె, అక్లూర్‌, భీమ్‌గల్‌, ముచ్కూర్‌లోని చెరువులు, చెక్‌డ్యాములను సందర్శించారు. మోతె గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగుపారడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సాగునీటికి గోస పడిన గ్రామంలో 35 ఏండ్ల అనంతర కాలం లో అలుగు పారిన మోతె చెరువును చూసి సంబురపడ్డారు. మోతె గ్రామంలో సాగునీటికి తీవ్రమైన సమస్య ఉండేదని గుర్తు చేశారు. ముఖ్యమం త్రి సహాయనిధి నుంచి మాటు కాలువకు రూ.3.80 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేయించామని తద్వారా గత సంవత్సరం కొంత ఫలితం రాగా ఈ సంవత్సరం మంచి వానలతో జూలైలోనే చెరువు నిండడం, అలుగు పారడం సంతోషకరమన్నారు. మూడు దశాబ్దాల తర్వాత మోతె చెరువు మత్తడి పోయడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ తలపెట్టిన తెలంగాణ ఉద్యమాన్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టిన గడ్డ మోతె అని వివరించారు. సాగునీటికి గోస పడ్డ మోతె నేడు జలకళతో మురిసిపోతుందన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana