e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు రేషన్‌ కార్డుల జాతర

రేషన్‌ కార్డుల జాతర

టి నుంచి అందరికీ మంజూరు పత్రాలు పంపిణీ
ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఆగస్టు నుంచి బియ్యం సరఫరా..
సర్కారు సంక్షేమ పథకాలకు అనుసంధానం

నిర్మల్‌ టౌన్‌/ఎదులాపురం, జూలై 25 : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులను సర్కారు మంజూరు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 20,129 కార్డులు మంజూరయ్యాయి. నేటి(సోమవారం) నుంచి ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. ముందుగా ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్న ప్రభుత్వం.. త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి అందజేయనున్నది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్జీదారుల కల నెరవేరనుండగా.. నేటి నుంచి రేషన్‌ కార్డుల జాతర మొదలు కానుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నూతన కార్డుదారులకు ఆగస్టు నుంచి బియ్యం సరఫరా కానున్నాయి.

నూతన రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న అర్జీదారుల కల నెరవేరనుంది. అర్హులైన వారికి కొత్తగా రేషన్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అర్జీదారులను గుర్తించాలని పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖకు ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలు సేకరించిన అధికారయంత్రాగం.. అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. నేటి (సోమవారం) నుంచి వాటిని ఇవ్వనున్నారు. కొత్త రేషన్‌కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ముందుగా ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్న ప్రభుత్వం.. త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి అందజేయనున్నది. నూతన కార్డుదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి.

- Advertisement -

ఆదిలాబాద్‌ జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో 355 రేషన్‌ దుకాణాల పరిధిలో 1,88,480 రేషన్‌ కార్డులున్నాయి. కొత్తగా 5,330 మంది దరఖాస్తు చేసుకోగా.. వివిధ కారణాలతో 884 తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 4,446 మందికి కార్డులు జారీ అయ్యాయి. ఇందులో బోథ్‌ నియోజకవర్గంలో 1746, ఆదిలాబాద్‌లో 1821, ఖానాపూర్‌లో 630, ఆసిఫాబాద్‌లో 249 మంజూరయ్యాయి. కాగా.. లబ్ధిదారులకు రేషన్‌ కార్డు ధ్రువీకరణ పత్రాలను ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పంపిణీ చేయనున్నారు. మొత్తం ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా రేషన్‌కార్డుల సంఖ్య 1,92,926కు చేరనుంది.

నిర్మల్‌ జిల్లాలో..
నిర్మల్‌ జిల్లాలో 190 రేషన్‌షాపులుండగా.. 2,04,220 మందికి రేషన్‌కార్డులున్నాయి. ఖానాపూర్‌, నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గ పరిధిలో 6,459 మంది కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. 608 అర్జీలను తిరస్కరించారు. మిగతా 5,851 మందిని అర్హులుగా గుర్తించారు. మొత్తం జిల్లాలో కార్డులు 2,10,071కు పెరగనున్నాయి. ఇందులో మామడ మండలంలో 136, నిర్మల్‌ అర్బన్‌ 737, నిర్మల్‌ రూరల్‌ 219, సోన్‌ 194, నర్సాపూర్‌(జి) 204, లక్ష్మణచాంద 289, దిలావర్‌పూర్‌ 163, సారంగాపూర్‌ 285, కడెం 285, ఖానాపూర్‌ 431, దస్తురాబాద్‌ 101, పెంబి 77, కుభీర్‌ 352, కుంటాల 147, భైంసా 939, లోకేశ్వరం 263, ముథోల్‌ 460, తానూరు 378, బాసర 191 కార్డులు ఇవ్వనున్నారు. నేడు నిర్మల్‌ జిల్లాలోని దివ్యగార్డెన్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందించనుండగా.. ముథోల్‌ నియోజకవర్గంలోని తానూరు, లోకేశ్వరంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌ పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 423 రేషన్‌ దుకాణాల పరిధిలో 2,14,258 కార్డులున్నాయి. కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. 8,643 అర్జీలు వచ్చాయి. వీటిలో 6,702 మంది అర్హులుగా గుర్తించి, వివిధ కారణాలతో 1,941 దరఖాస్తులను తిరస్కరించింది. నేటి నుంచి కొత్తగా 6,702 మందికి నూతన రేషన్‌ కార్డులు జారీ చేయనుంది. ఇందులో బెల్లంపల్లి మండలంలో 826, భీమినిలో 145, భీమారంలో 98, చెన్నూర్‌లో 515, దండేపల్లిలో 354, హాజీపూర్‌లో 197, జైపూర్‌లో 319, జన్నారంలో 287, కన్నెపల్లిలో 118, కాసిపేటలో 347, కోటపల్లిలో 170, లక్షెట్టిపేటలో 248, మంచిర్యాలలో 1,023, మందమర్రిలో 702, నస్పూర్‌లో 947, నెన్నెలలో 119, తాండూరులో 210, వేమనపల్లి 77 నూతన రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. కొత్త, పాతవి కలుపుకొని జిల్లాలో రేషన్‌ కార్డుల సంఖ్య 2,20,960కి చేరనుంది. కాగా.. జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో నేడు(సోమవారం) మంచిర్యాల నియోజకవర్గంలోని మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్‌రావు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా రేపటి నుంచి కార్డులు పంపిణీ చేయనున్నారు. నూతనంగా రేషన్‌ కార్డు పొందిన లబ్ధిదారులు ఆగస్టు 1వ తేదీ నుంచి సమీపంలోని రేషన్‌ దుకాణంలో సరుకులు పొందవచ్చు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 278 రేషన్‌ దుకాణాలు ఉండగా.. 1,37,306 రేషన్‌ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం 3345 దరఖాస్తు చేసుకోగా.. 215 తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 3130 దరఖాస్తులను అర్హులుగా గుర్తించారు. ఆసిఫాబాద్‌ మండలంలో 240, బెజ్జూర్‌ 54, చింతలమానేపల్లి 48, దహెగాం 91, జైనూర్‌ 195, కాగజ్‌నగర్‌ 1087, కెరమెరి 245, కౌటాల 91, లింగాపూర్‌ 105, పెంచికల్‌పేట్‌ 59, రెబ్బెన 341, సిర్పూర్‌-టి 163, సిర్పూర్‌-యూ 151, తిర్యాణి 73, వాంకిడి 187 కార్డులు ఇవ్వనున్నారు. అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో రేషన్‌ ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త, పాత వాటితో కలుపుకొని మొత్తం జిల్లాలో 1,40,436 కార్డులు కానున్నాయి.

కొత్త కార్డులు 20,129..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా 20,129 మందికి రేషన్‌కార్డులు ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికార యంత్రాగం అర్హులను గుర్తించి ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు అందించింది. ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నా.. ప్రజల అవసరాలే లక్ష్యంగా కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తున్నది. ఇందుకోసం సోమవారం నుంచి అన్ని చోట్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లను జిల్లాయంత్రాంగం చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana