బుధవారం 03 మార్చి 2021
Nirmal - Feb 23, 2021 , 03:15:08

శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
  • అధికారులతో ప్రత్యేక సమావేశం

నిర్మల్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 : నిర్మల్‌ జిల్లాలో రైతులు యాసంగిలో సాగు చేసిన శనగ పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రాల ను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనగ కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ జిల్లాలో ఈ యాసంగిలో మక్కకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ పంట వేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సాగు ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముథోల్‌ నియోజకవర్గంలో ఎక్కువగా పంట సాగైనందున నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర రూ.5వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌, సహకార శాఖ అధికారి సత్యనారాయణ వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, మార్క్‌ఫెడ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు..

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంతో పాటు వైఎస్సార్‌ కాలనీలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం, సారంగాపూర్‌ మండలంలోని చించోలి (బి) గ్రామం వద్ద ఉన్న మహిళా ప్రాంగణాన్ని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తనిఖీ చేశారు. సఖీ కేంద్రంలో అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆత్మరక్షణగా సఖీ కేంద్రం పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. మహిళా ప్రాంగణంలో మహిళలకు అందిస్తున్న వివిధ కోర్సులు, శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మరిన్ని శిక్షణలు ప్రారంభించాలని సూచించారు. వృద్ధ్దాశ్రమంలో వృద్ధులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి స్రవంతి, మహిళా ప్రాంగణ సిబ్బంది, ఐసీడీఎస్‌ ఉద్యోగులున్నారు. 

VIDEOS

logo