మంగళవారం 02 మార్చి 2021
Nirmal - Jan 26, 2021 , 00:06:26

ప్రగతి బాటలో బల్దియాలు

ప్రగతి బాటలో బల్దియాలు

  • రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు
  • ‘పట్టణ ప్రగతి’తో కళకళలాడుతున్న కాలనీలు
  • పాలకవర్గాలు కొలువుదీరి రేపటితో ఏడాది

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా పన్నెండు బల్దియాలు ఉన్నాయి. ఇందులో మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగలేదు. మిగతా పదకొండు బల్దియాల్లో గతేడాది జనవరి 27న మున్సిపాలిటీ పాలక వర్గాలు కొలువుదీరాయి. రేపటితో ఏడాది పూర్తికానుంది. ఈ కాలంలో తెలంగాణ సర్కారు మున్సిపాలిటీల అభివృద్ధికి వందల కోట్లు కేటాయించింది. సీసీ రోడ్లు, పార్కులు, సెంట్రల్‌ లైటింగ్‌, ఓపెన్‌ జిమ్‌లు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు, మొబైల్‌ టాయిలెట్లు, డంప్‌యార్డులు, మార్కెట్‌ యార్డుల నిర్మాణాలు చేపట్టింది. పట్టణాలు సర్వాంగ సుందరంగా తయారవగా.. కొత్త శోభను సంతరించుకున్నాయి.

- నిర్మల్‌ అర్బన్‌/ఆదిలాబాద్‌ రూరల్‌/భైంసా/ ఖానాపూర్‌ టౌన్‌, జనవరి 25 

నిర్మల్‌@రూ.30 కోట్లు

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 25 : నిర్మల్‌ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో దాదాపు రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.  ఇందులో రూ.57 లక్షలతో భారీ జాతీయ జెండా నిర్మాణం, రూ.2.90 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, రూ.10 లక్షలతో స్ట్రిప్‌లైట్‌, రూ.70 లక్షలతో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఈద్‌గాం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు రూ.3 కోట్లతో రోడ్డు పనులు పూర్తికాగా, ఈద్‌గాం నుంచి మున్సిపాలిటీ వరకు రూ.3 కోట్లతో, చైన్‌గేట్‌ నుంచి బంగల్‌పేట్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని శ్యాంగఢ్‌ కోటను రూ.20 లక్షలతో అభివృద్ధి చేశారు. రూ.10 లక్షలతో రెండు చోట్ల ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. 42 వార్డుల్లో వార్డు ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుండగా.. ఒక్కోదానికి రూ.8-10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తడి, పొడి చెత్తకోసం రూ.1.15 కోట్లతో షెడ్లు నిర్మించారు. రూ.48 లక్షలతో డంప్‌ యార్డు వరకు రోడ్డు, గాంధీ, ఎన్టీఆర్‌ మార్కెట్ల పునరుద్ధరణ, రూ.కోటితో మున్సిపల్‌ ఫంక్షన్‌ హాల్‌ పనులు కొనసాగుతున్నాయి. రూ.29 లక్షలతో జౌళినాల పూడికతీత పనులు పూర్తయ్యాయి. పట్టణంలో 42 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.4.20 కోట్లు మంజూరుకాగా, పనులు కొసాగుతున్నాయి.

కాగజ్‌నగర్‌ బల్దియాకు కళ

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 25 : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఈ యేడాదిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. కాలనీల్లో రూ.51.18 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తారు రోడ్లు నిర్మించారు. కూరగాయల, మటన్‌ మార్కెట్లలో రూ.1.47 కోట్లతో షెడ్లు, రూ.51.40 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించారు. పలు కాలనీల్లో రూ.20 లక్షలతో ఓపెన్‌జిమ్‌లు, రూ.30 లక్షలతో స్లాటర్‌హౌస్‌లు, రూ. 10 లక్షలతో పార్కు, రూ.4.97 లక్షలతో మొబైల్‌ టాయిలెట్లు, రూ.93.84 లక్షలతో వైకుంఠధామం, రూ.23 లక్షలతో నర్సరీలు ఏర్పాటు చేశారు. రూ.25 లక్షలతో మూడు ట్రాక్టర్లు, రూ.27 లక్షలతో జేసీబీ, డీజిల్‌ ఆటో, ఈ -ఆటోలు కొనుగోలు చేశారు. రూ. 45.90 లక్షలతో పట్టణంలో వివిధ పనులు చేపట్టారు. రూ.35 లక్షలతో స్విమ్మింగ్‌  ఫూల్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రగతి పథంలో చెన్నూర్‌

చెన్నూర్‌, జనవరి 25 : చెన్నూర్‌ పట్టణంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ చొరవ తో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. రూ.15 కోట్లతో పట్టణంలోని జలాల్‌ పెట్రోల్‌ పంపు నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ప్రధాన రహదారి విస్తరణ, డివైడర్‌, మురుగు కాలువలు, సెంట్రల్‌ లైటింగ్‌, ఫుట్‌పాత్‌, తెలం గాణ తల్లి విగ్రహం, అంబేద్కర్‌ చౌరస్తా సుందరీకరణ పనులు సాగుతున్నా యి. రూ.4 కోట్లతో వివిధ గ్రాంటు నిధులతో కాలనీల్లో సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నారు. రూ.6 కోట్లతో పెద్ద చెరువు ఆధునీకరణ, రూ.3 కోట్లతో కుమ్మరి కుంట మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు సాగుతున్నాయి. రూ.50 లక్షలతో విద్యుత్‌ లేన్‌ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల రూ.5 కోట్లతో నిర్మించే అంబేద్కర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి శంకుస్థాపన జరగగా.. పనులు ఊపందుకోనున్నాయి.

నస్పూర్‌లో..

సీసీసీ నస్పూర్‌, జనవరి 25 : ఈ ఏడాది కాలంలో నస్పూర్‌ మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రగతి కింద రూ. 6 కోట్ల 30 లక్షలు మంజూరు కాగా, రూ. కోటీ 20 లక్షలతో నర్సరీలను అభివృద్ధి చేశారు. రూ. కోటి డీఎంఎఫ్‌టీ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. రూ. 2 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేపట్టారు.

లక్షెట్టిపేట మున్సిపాలిటీ..

లక్షెట్టిపేట రూరల్‌, జనవరి 25 : లక్షెట్టిపేట మున్సిపల్‌ పాలక వర్గం కొలువుదీరిన నాటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ. 72 లక్షలతో శానిటైజేషన్‌, హరితహారం, సీసీ రోడ్లువంటివి చేపట్టారు. వివిధ పనుల కోసం ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నుంచి రూ. కోటీ లక్షా తొమ్మిది వేలు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి రూ. 5 లక్షల 20 వేలు మంజూరు కాగా, టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నారు. రూ. 20 లక్షలతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేస్తుండగా, త్వరలోనే అందుబాటు లోకి రానున్నాయి. మరో రూ. 35 లక్షలతో నర్సరీల ఏర్పాటుతో పాటు వివిధ పనులు ప్రారంభం కానున్నాయి. దాతల ప్రోత్సాహంతో అంబేద్కర్‌ చౌరస్తాలో సుమారు రూ. 10 లక్షలతో పబ్లిక్‌ టాయిలెట్లు, వైకుంఠధామాన్ని నిర్మించారు. 

ఆదిలాబాద్‌ @ రూ.100 కోట్లు

ఆదిలాబాద్‌ రూరల్‌, జనవరి 25 : ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌  ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది కాలంలో సుమారు రూ.100 కోట్లతో పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానంగా పట్టణంలో రూ.44 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్ని పూర్తయ్యాయి. శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.4 కోట్లు, పార్కుకు రూ.5 కోట్లు, ప్రధాన కూడళ్లకు రూ.10 కోట్లు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటునకు రూ.1.20 కోట్లు, పారిశుధ్య వాహనాలకు రూ.5 కోట్లు, స్టేడియం అభివృద్ధికి రూ.కోటి, వీధి వ్యాపారులకు షెడ్ల ఏర్పాటుకు రూ.50 లక్షలు, డీఆర్‌సీకి రూ.కోటి, క్లీనింగ్‌ మెషిన్‌కు రూ.50 లక్షలు, టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.5 కోట్లతో బీటీ రోడ్లు, ప్రధాన కూడళ్లలో హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటుకు రూ.38 లక్షలు, కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.12 కోట్లు, ఐఎఫ్‌డీసీ పథకం కింద రూ.1.50 కోట్లు ఇలా వివిధ రకాల నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి.

బెల్లంపల్లిలో..

బెల్లంపల్లిటౌన్‌, జనవరి 25 : బెల్లంపల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ప్రారంభమైనప్పటి నుంచి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. రూ. 42 కోట్లతో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయి. పట్టణంలోని పాత మార్కెట్‌ స్థలంలో రూ. 3 కోట్లతో మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. కాల్‌టెక్స్‌, బజార్‌ ఏరియా ప్రధాన రహదారుల వద్ద హైమాస్ట్‌ లైట్లను రూ. 1.30 కోట్లతో ఏర్పాటు చేశారు. 34 వార్డుల్లో వంద శాతం చెత్తను సేకరించడానికి 23 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. రోడ్డు డివైడర్లలో చెట్ల పెంపకం, పాలకవర్గం ఏర్పడిన తర్వాత పట్టణంలో 322080 మొక్కల పెంపకం లక్ష్యంతో కొత్తగా 8 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు రూ. 10 లక్షలతో కాల్‌టెక్స్‌ ఫ్లై ఓవర్‌బ్రిడ్జిపై పూలకుండీలను ఏర్పాటు చేశారు. తిలక్‌స్టేడియంలో ఓపెన్‌ జిమ్‌ కోసం రూ. 25 లక్షలతో టెండర్‌ను పిలిచారు. కాల్‌టెక్స్‌ ఏరియాలో సులభ్‌కాంపెక్ల్‌ను నిర్మించారు. రూ. 20 లక్షలతో చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 

ఖానాపూర్‌@రూ.3.92 కోట్లు

ఖానాపూర్‌ టౌన్‌, జనవరి 25 : కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీలో రూ.3.92 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. పట్టణ ప్రగతి మున్సిపాలిటీకి రూ.24లక్షలతో రెండు ట్రాక్టర్లు, ఒక ట్యాంకర్‌,రూ.17 లక్షలతో నాలుగు మినీ ఆటో వ్యాన్లు కొనుగోలు చేశారు. రూ.69 లక్షలతో పట్టణంలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.13 లక్షలతో పలు వార్డుల్లో 400 చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చి, వాటికి టైమర్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. రూ.2 కోట్లతో డంప్‌ యార్డు, శ్మశాన వాటిక, కూరగాయల మార్కెట్‌, పార్కు ఏర్పాటు చేయనున్నారు. రూ.5.40 లక్షలతో ఖబ్రస్తాన్‌ నిర్మిస్తున్నారు. మరో రూ.27లక్షల ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు వేయిస్తున్నారు. అంబేద్కర్‌నగర్‌ కాలనీకి సంబంధించి శ్మశాన వాటిక పనుల కోసం రూ.37 లక్షలు మంజూరయ్యాయి. ఇవేకాకుండా మున్సిపాలిటీలో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 

భైంసా@రూ.11.62 కోట్లు 

భైంసా, జనవరి 25 : భైంసా పట్టణంలో రూ. 11 కోట్ల 62 లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు, ఫుట్‌పాత్‌ రూ.కోటీ 80 లక్షలు, వైకుంఠధామం రూ.కోటి, డంప్‌యార్డ్‌ రూ.కోటి, రూ. 3 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, రూ.2 కోట్లతో సెంట్రల్‌, హైమాస్ట్‌ లైటింగ్‌, రూ.4 కోట్ల 90 లక్షలతో జంక్షన్‌లు, రూ.4 కోట్ల 30 లక్షలతో నర్సరీలు, రూ. కోటీ 60 లక్షలతో రోడ్డు పనులు చేపడుతున్నారు. వీటితో పాటు ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీపంలో మినీ ట్యాంక్‌ బండ్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయగా, వాటి మధ్యలో పూల మొక్కలు నాటుతున్నారు.     

VIDEOS

logo