సోమవారం 08 మార్చి 2021
Nirmal - Jan 24, 2021 , 01:43:09

బాలికకు భరోసా

బాలికకు భరోసా

 • నేడు జాతీయ బాలికల దినోత్సవం
 • ఆడపిల్ల పుడితే రూ. 13 వేల సాయం   
 • గురుకులాలతో పేద విద్యార్థినులకు ఉచిత విద్య   
 • 14 ఏండ్లలోపు వారికి నిర్బంధ విద్య 
 • అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం  
 • కస్తుర్బా విద్యాలయాల్లో సంపూర్ణ వసతులు   
 • బడికి వెళ్లేందుకు ఉచిత బస్‌పాస్‌లు   
 • హైజనిక్‌ కిట్ల అందజేత
 • షీటీంలు, సఖీ కేంద్రాల ద్వారా వివిధ సేవలు  
 • బాల్యవివాహాల అడ్డుకట్టకు చర్యలు  
 • వివిధ సంక్షేమ పథకాలతో అండగా రాష్ట్ర సర్కారు

ఆడ పిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. బాలికల సంరక్షణకు చర్యలు తీసుకుం టూనే గురుకులాలు, కస్తుర్బా విద్యాల యాలు ఏర్పాటు చేసి నిర్బంధ విద్యను ప్రోత్సహి స్తున్నది. లింగ నిర్ధారణను పూర్తిగా నిషేధించడంతో పాటు బాల్యవివాహాలను అడ్డుకుంటూ అండగా నిలుస్తున్నది. ఆడపిల్ల పుడితే రూ. 13 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు బాలికలను సంర క్షించేందుకు షీటీంల ద్వారా నిరంతర సేవలు అందేలా చర్యలు తీసుకున్నది.  

కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన లోలం గజేందర్‌కు ముగ్గురు ఆడపిల్లలు. వీరి పేర్లు రాగవి, జాహ్నవి, భార్గవి. ముగ్గురూ చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. 2016లో పెద్ద పాప, 2017లో చిన్న పాప, 2018లో మూడో పాప పట్టణంలోని సోఫీనగర్‌ గురుకులం పాఠశాలలో సీట్లు వచ్చాయి. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. 

నిర్మల్‌ టౌన్‌, జనవరి 23: సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిని పరిశీలిస్తే మగవారి కంటే ఆడవారు తక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకే ఆడబిడ్డల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి. జిల్లాలో 0-14 ఏండ్లలోపు బాలికలందరికీ నిర్బంధ విద్య, నాణ్యమైన పౌష్టికాహారం, ఆరోగ్య టీకాలు, బాలల సంరక్షణ పథకాలను అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3,538 అంగన్‌వాడీ కేంద్రాలు, 586 మినీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ప్రభుత్వం అందజేస్తోంది. సమయానికి అనుగుణంగా ఆరోగ్య టీకాలు వేయిస్తున్నది. బాలికల విద్య కోసం కస్తుర్బా విద్యాలయాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో ఉచిత చదువుతో పాటు నాణ్యమైన భోజనం, హైజనిక్‌ కిట్లను అందజేస్తున్నది. బడికి వెళ్లేందుకు ఉచిత బస్‌పాస్‌లను ఇస్తున్నది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలు చేస్తున్నది. బాల్య వివాహాలకు అడ్డుకుట్ట వేస్తూనే, ఆపరేషన్‌ స్మైల్‌ లాంటి కార్యక్రమాల ద్వారా బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నది. ఆడపిల్ల పుడితే కేసీఆర్‌ కిట్‌తో పాటు రూ. 13 వేల సాయం అందిస్తున్నది. పెళ్లి సమ యంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1.16 లక్షలను అందజేస్తున్నది.

చట్టాలపై పూర్తి అవగాహన...

బాలికల సంరక్షణకు ప్రభుత్వం విద్య, వైద్య సదుపాయలు కల్పిస్తూనే, వారికి అవసరమైన చట్టాలపై అవగాహన కల్పిస్తున్నది. ఆడబిడ్డలకు భరోసానిచ్చేందుకు ప్రత్యేకంగా పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. బాలికలపై లైంగికదాడులు, హింస, వేధింపులకు గురి చేస్తే ఈ చట్టం అమలు చేస్తున్నారు. చైల్డ్‌హెల్ప్‌ లైన్‌ ద్వారా 14 ఏళ్లలోపు ఆడపిల్లలను గుర్తించి పనిభారం పడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. షీ టీంల ద్వారా రక్షణకు చర్యలు తీసుకుంటూనే సఖీ కేంద్రాల ద్వారా బాధితులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌, రాష్ట్రీయ బాలవికాస్‌ పథకం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ పరిపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన ప్రేరణను అందిస్తున్నారు. బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం శిశు సంక్షేమశాఖ ద్వారా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. 100 డయల్‌ నంబరుతో పాటు 1098 నంబర్లను కేటాయించింది. బాలికలకు ఏ ఆపద వచ్చినా ఈ నంబర్లకు కాల్‌ చేయవచ్చు. పాఠశాలలో ఫిర్యాదు బాక్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకే సమాజంలో ప్రస్తుతం ఆడబిడ్డ పుడితే అదృష్ట లక్ష్మిగా భావిస్తూ కుటుంబసభ్యులు వారిని పెంచుతున్నారు. మగపిల్లలతో పోల్చితే ఆడపిల్లల్లో నైపుణ్యశక్తి, మేధస్సు, పోటీతత్వం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. 

ఆడపిల్లల రక్షణకు అనేక పథకాలు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆడపిల్లల సంరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేండ్ల లోపు పిల్లలందరికీ ఉచిత విద్య, పోషకాహారం, యువ కిశోర బాలికలకు అమృత లక్ష్మి కింద పోషకాహారం ద్వారా గుడ్లు, పాలు అందిస్తున్నారు. అనాథ పిల్లలకు బాలసదనంలో విద్యను అందిస్తున్నాం. ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా వ్యాపార దుకాణాలు, ఇండ్లలో పనులు చేస్తున్న బాలికలను గుర్తించి ప్రతి ఒక్కరికీ చదువు అందేలా ప్రోత్సహిస్తున్నాం. బాల్య వివాహాలు, హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. 

- స్రవంతి, జిల్లా సంక్షేమాధికారి


VIDEOS

logo