ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 19, 2021 , 00:56:43

శ్రమశక్తి.. ఉపాధి హామీ..

శ్రమశక్తి.. ఉపాధి హామీ..

కొత్త గ్రూప్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ 

సభ్యులు తక్కువగా ఉన్న వారు కొత్త గ్రూపుల్లో చేరికకు అవకాశం

ప్రతి కూలీకి పని కల్పించే లక్ష్యంతో ముందుకు..

ఈజీఎస్‌ ఏపీవోలకు అవగాహన

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి కూలీకి అడిగినంత పని కల్పించాలనే ఉద్దేశంతో కొత్త శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం గ్రూప్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ప్రతి కూలీకి పని కల్పించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతుండగా.. ఈ విషయమై ఈజీఎస్‌ ఏపీవోలకు అవగాహన కల్పించింది.

- నిర్మల్‌ టౌన్‌, జనవరి 18

నిర్మల్‌టౌన్‌, జనవరి 18 : గ్రామీణ పేదలకు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త శ్రమ శక్తి సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకు తక్కువ సభ్యులున్న శ్రమశక్తి సంఘాల్లోని వారు వేరే సంఘాల్లో చేరేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కమిషనర్‌ రఘునందన్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.350 కోట్లతో వివిధ పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో లేబర్‌ పనులే ఎక్కువ కావడంతో ఈ సంవత్సరం కూడా శ్రమశక్తి సంఘాలు పెద్ద మొత్తంలో తయారు చేసి ప్రతి ఒక్క జాబ్‌కార్డు హోల్డర్‌కు పని కల్పించేందుకు యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. జాబ్‌ కార్డు పొందిన వారికి ఉపాధి చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉండడంతో శ్రమశక్తి సంఘాలను పెంచడం, గతంలో తక్కువ సభ్యులున్న గ్రూపులోని వారిని వేరే గ్రూపులోకి మార్చడం వంటి ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. 20మంది సభ్యులు ఒక శ్రమశక్తి సంఘంలో ఉండవచ్చు. వారిలో ఎక్కువ పనిదినాలు చేసిన వారికి మేట్‌గా అవకాశం కల్పిస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇది..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా ఉపాధి పనులు ఫిబ్రవరి నుంచి ప్రారంభమై మే వరకు జోరుగా సాగుతాయి. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత ఈ పనులు చేపట్టడంతో చిన్న, సన్నకారు రైతుల కుటుంబాల సభ్యులు సైతం జాబ్‌కార్డు పొంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. రోజువారీ పనిని బట్టి రూ.120 నుంచి రూ.200 వరకు కూలి దొరుకుతుంది. 

జాబ్‌కార్డులు.. 5,88,899..

ఉమ్మడి జిల్లాలో జాబ్‌కార్డున్న కుటుంబాలు 5,88,899 ఉ న్నాయి. ఇందులో 4,09,467 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనుల నిర్వహణకు ఆయా జిల్లాల్లో శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేశారు. ఇందులో జనరల్‌ సంఘాలతో పాటు దివ్యాంగుల సంఘం, తాత్కాలిక శ్రమశక్తి సంఘాల పేరుతో మూడు గ్రూపులుగా విభజించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 40,675 శ్రమశక్తి సంఘాలు ఉండగా..  28,841 జనరల్‌, 1,026 దివ్యాంగుల, 10,808 తాత్కాలిక సంఘాలున్నాయి. జనరల్‌ సంఘాల్లో 15 నుంచి 20 మంది కూ లీలు ఉండగా.. తాత్కాలిక సంఘాల్లో 10 మందిలోపే ఉన్నారు. దీంతో వారు సభ్యులు తక్కువగా ఉన్న సంఘాల్లోకి తమ పేర్లను  మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి ఒక్కరికీ  అడిగినంత పని ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొం టున్నారు.


సద్వినియోగం చేసుకోవాలి..

అన్ని జిల్లాల్లో శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. తక్కువ సభ్యులున్న సంఘాల నుంచి  ఎక్కువగా ఉన్న సంఘాల్లోకి కూలీలు తమ పేర్లను మార్చుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా ఉపాధి పనులు జరిగే చోట పనులకు వెళ్తున్న  కూలీలు పనుల డిమాండ్‌ దృష్ట్యా తాత్కాలిక సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల్లో కూలీలు తక్కువగా ఉండడంతో వారికి గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ నేపథ్యంలో వారు వేరే సంఘంలోకి మార్చుకునేందుకు అవకాశం కలిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. శ్రమశక్తి సంఘాల ఏర్పాటు, సంఘాల మార్పిడిపై ఇప్పటికే అన్ని మండలాల ఈజీఎస్‌ ఏపీవోలకు  వివరించాం.     - వెంకటేశ్వర్లు, డీఆర్డీవో, 

నిర్మల్‌ జిల్లా

VIDEOS

logo