మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jan 07, 2021 , 01:48:17

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

  • ముగ్గురికి గాయాలు 

భైంసా టౌన్‌, జనవరి 6 : ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి.  నిర్మల్‌ జిల్లా భైంసా మండలం మాటేగాం గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో  శేషారావు(56) మృతిచెందాడు. భైంసారూరల్‌ ఎస్‌ఐ పున్నంచందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..నర్సాపూర్‌ మండలంలోని బామ్ని గ్రామానికి చెందిన శేషారావు భైంసా మండలంలోని చింతల్‌బోరికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. మాటేగాం నుంచి ఎగ్గాం  వైపునకు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా దానికి ద్విచక్రవాహనం తగిలింది. ఈ ప్రమాదంలో శేషారావు అక్కడికక్కడే కింద పడి మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పున్నంచందర్‌ తెలిపారు. 

ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి

భైంసా మండలంలోని పాంగ్రి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి లక్ష్మీకాంత్‌(18) మృతిచెందాడు. భైంసారూరల్‌ ఏఎస్‌ఐ బాల్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం..పాంగ్రి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్‌ ద్విచక్రవాహనంపై పొలానికి వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి పండరి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఊడిపోయిన కారు టైరు.. ముగ్గురికి గాయాలు 

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్‌నగర్‌ గ్రామ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉట్నూర్‌ వైపు నుంచి చౌహాన్‌ దీపక్‌, రాథోడ్‌ అజయ్‌ కారులో ఆదిలాబాద్‌కు వెళ్తున్నారు. ఈశ్వర్‌నగర్‌ సమీపంలో కారు వెనుక టైరు ఊడిపోయింది. దీంతో  కారు అదుపుతప్పి ఉట్నూర్‌ మండలంలోని నర్సాపూర్‌కు చెందిన జోంద్లే విజయ్‌కుమార్‌ ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. విజయ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న యువకులకు  స్వల్ప గాయాలయ్యాయి. వీరిని మండలకేంద్రంలోని దవాఖానకు తరలించి చికిత్స అందించారు. logo