బుధవారం 20 జనవరి 2021
Nirmal - Jan 05, 2021 , 00:13:38

విస్తరణ దిశగా హరితవనం

విస్తరణ దిశగా హరితవనం

  • రూ.2.65 కోట్లతో అభివృద్ధి పనులు
  • వెయ్యి ఎకరాల్లో వనం.. బోటింగ్‌ సౌకర్యం
  • తిలకించేందుకు సఫారీ వాహనాలు 
  • పర్యాటకుల విడిదికి ఎకో హట్‌ల ఏర్పాట్లు
  • మార్చినాటికి అందుబాటులోకి..
  • మంత్రి అల్లోల కృషితో చకచకా పనులు

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 4 : నిర్మల్‌ పట్టణంలోని గండి రామన్న హరితవనాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. దీంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ పలు పనులకు ప్రారంభోత్సవం చేశారు. మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా అటవీ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రూ. 2 కోట్లతో హరిత వనాన్ని అందంగా తీర్చిదిద్దారు. అదనంగా మంజూరైన రూ. 2.65 కోటతో మరింత అభివృద్ధి చేయనున్నారు.                 

‘గండిరామన్న’ పార్కుకు మరోసారి మెరుగులు వెయ్యి ఎకరాల్లో..

గండిరామన్న హరిత వనం ప్రస్తుతం 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికే ఈపార్కులో వాచ్‌టవర్‌, కెనాపీ వాక్‌, అక్యుపెషర్‌ వాక్‌, ప్లే గ్రౌండ్‌, చిన్న పిల్లలు ఆటలాడేం దుకు ఆట వస్తువులు, స్కైవాక్‌, వంటి అనేక రకాల సదుపాయా లతో పార్కును అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం పార్కును (దాదాపు 5 కిలీమీటర్ల విస్తీర్ణంలో) వెయ్యి ఎకరాల్లో అభివృద్ధి పర్చి, చుట్టూ ఫెన్సింగ్‌ వేయనున్నారు. పార్కు అందాలను తిలకించేందుకు సఫారీ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. దట్టమైన అటవీ ప్రాంతంలో చెట్లను, కొండలను వీక్షిస్తూ వెళ్లే సఫారీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోనుంది. అక్కడక్కడ మూడు చోట్ల వంపులు తిరిగే ప్రదేశాలు (ఘాట్స్‌) ఉన్నాయి. దాదాపు 5 కిలో మీటర్ల అటవీ ప్రాంతంతో చెట్లను, కొండలను చీల్చుకుంటూ వెళ్లే ప్రయాణం ప్రత్యేక ఆకర్ష ణగా నిలువనుంది. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి రక్షణ కోసం రూ.కోటి 8 లక్షలతో చైన్‌లింక్‌ ఫెన్సింగ్‌ పనులను చేపట్టనున్నారు.

మంత్రి అల్లోల కృషితో అభివృద్ధి పనులు

మహానగరాల్లో మాత్రమే కనబడే పార్కులను పట్టణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ నిత్యం వివిధ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు కాస్త రిలాక్స్‌ కల్పించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్కు మహానగరాల్లో ఉండే విధంగా తీర్చిదిద్దడంతో మంత్రి అల్లోలను జిల్లా వాసులు, పర్యాటకులు అభినందిస్తున్నారు. నిర్మల్‌లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఒక్క పార్కు కూడా లేకపోవడంతో ఇబ్బందులకు గురైన ప్రజలు వెయ్యి ఎకరాల్లో పార్కును అభివృద్ధి పర్చడంతో స్థానికుల కల నెరవేరబోతున్నది.

పార్కులో ప్రత్యేక ఆకర్షణగా మూషిక జింకలు..

హరిత హారానికి మరింత అదనపు ఆకర్షణను తీసుకువచ్చి చిన్నారులకు వన్యప్రాణులపై మక్కువ పెంచేలా తీర్చిదిద్దనున్నారు. అర ఎకరంలో దాదాపు రూ.8 లక్షల నిధులతో మూషిక జింకల పార్కును ఇటీవలే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జూ పార్కు నుంచి 5 మూషిక జింకలను తీసుకువచ్చి అందుబాటులో ఉంచారు. వీటికి ఆహారంగా పచ్చని గడ్డి, నీటి తొట్టెలు, నివాసం ఉండేందుకు చిన్న గుడిసెలను ఏర్పాటు చేశారు. వీటి కదలికలను గమనించేందుకు రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

బోటింగ్‌పై పట్టణ వాసుల ఆసక్తి..

జిల్లా కేంద్రంలోని పర్యాటకులకు బోటింగ్‌పై ఎనలేని ఆసక్తి ఉంది. పట్టణ ప్రజలు జిల్లా కేంద్రంలో బోటింగ్‌ చేయా లనే కోరికను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నెరవేర్చ నున్నారు. రూ.20 లక్షల చొప్పున విలువ చేసే 2 బోటింగ్‌లను కొనుగోలు చేసి పార్కుకు వచ్చే పర్యాట కులకు ఆహ్లాదాన్ని పంచనున్నారు. ఇందుకోసం బోటింగ్‌ ఏర్పాటు పూర్తి చేశారు. పార్కు ప్రవేశ ద్వారం పక్కనే కుడి వైపున బోటింగ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

పర్యాటకుల విడిదికి ఎకో హట్‌ల ఏర్పాట్లు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పర్యాటక రంగానికి పెట్టింది పేరు. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నిర్మల్‌ కొయ్యబొమ్మలు, నిర్మల్‌ పెయింటింగ్స్‌, కవ్వాల్‌ అభయారణ్యం, నిర్మల్‌ కోటలు, కడెం, సదర్‌మాట్‌, కుంటాల, పొచ్చెర, వాస్తాపూర్‌ వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నింటినీ తిలకించేందుకు సుదూర ప్రాంతాలు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల విడిది కోసం గండిరామన్న హరిత వనంలో 6 ఎకో హట్స్‌ను (గదులను) నిర్మించనున్నారు. దాదాపు వీటికి పది లక్షల రూపాయల నిధులను ఖర్చు చేయనున్నారు. అలాగే రూ.8 లక్షల నిధులతో రాక్‌ ఐలాండ్‌ను నిర్మించనున్నారు.

మార్చి నాటికి పనులు పూర్తి

గండి రామన్న హరిత వనంలో రూ.2.65 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. 60 ఎకరాల్లో ఉన్న హరితవనం వెయ్యి ఎకరాల్లో విస్తరించి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే 1000 ఎకరాల్లో దాదాపు 5 కిలో మీటర్ల పాటు సఫారీ వాహనాలు తిరిగేందుకు రోడ్డు పనులను చేపట్టాం. బోటింగ్‌ ఏర్పాటు పనులను నిర్వహిస్తున్నాం. మూషిక జింకల పార్కు ఏర్పాటు చేసి పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నాం. 

-ఎఫ్‌ఆర్వో జైపాల్‌, నిర్మల్‌ 



logo