మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jan 04, 2021 , 01:22:05

దివ్యమైన ప్రోత్సాహకం

దివ్యమైన  ప్రోత్సాహకం

  • దివ్యాంగులను పెళ్లి చేసుకున్న సకలాంగులకు భరోసా
  • రూ.లక్షా 116 అందిస్తున్న ప్రభుత్వం
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలూ వర్తింపు
  • నిర్మల్‌ జిల్లాలో 65 మందికి రూ.39.50 లక్షలు మంజూరు 
  • లబ్ధిదారుల హర్షం

సారంగాపూర్‌, జనవరి 3 : దివ్యాంగులను ప్రభుత్వం తీరొక్క విధంగా ఆదుకుంటున్నది. వారు స్వయంశక్తితో ఎదిగేందుకు సహకారం అందిస్తున్నది. అన్ని రంగాల్లో రాణించేందుకు, వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్‌తో పాటు విద్యార్థి దశలో ఉపకార వేతనాలు, వసతిగృహాలు, ఇంటర్‌ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 21 సంవత్సరాల నుంచి 55 ఏళ్లలోపు వయసు వారికి స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి స్టడీ సర్కిల్‌, 50శాతం రాయితీతో బస్‌పాసులు, యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహానికి ప్రత్యే క ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం వారికి ప్రోత్సాహక నిధులు మంజూరు చేసి ఆర్థికంగా చేయూతనిస్తున్నది. గతంలో రూ.50 వేలు అందించగా.. దానిని రూ.1,00,116కు పెంచింది. నిర్మల్‌ జిల్లాలో 2015-16 నుంచి 2019-20 వరకు 65 మందికి రూ.39.50 లక్షల ప్రోత్సాహక నిధులు అందజేసింది.

ప్రోత్సాహకంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌..

దివ్యాంగులను పెండ్లి చేసుకున్న సకలాంగులకు రూ.లక్షా 116ను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్నది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందజేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు కూడా వీరికి వర్తిస్తాయి. గతంలో కేవలం ప్రోత్సాహకం మాత్రమే వర్తించేది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జీవో నంబర్‌ 12ను జారీ చేసింది. దివ్యాంగులకు ప్రోత్సాహకంతోపాటు ఏడాదిలో 10 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో దివ్యాంగులకు రెండు విధాలా లబ్ధిచేకూరుతున్నది.

నిర్మల్‌ జిల్లాలో 9,902 మంది దివ్యాంగులు..

నిర్మల్‌ జిల్లాలో 9,902 మంది దివ్యాంగులు ఉన్నారు. 2018, మార్చి నెలకు ముందు వరకు దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు రూ.50 వేల వరకు ప్రభుత్వం  ప్రోత్సాహకాన్ని అందించేది. 2018, మార్చి 28వ తేదీ నుంచి జీవో నంబర్‌ 2 ప్రకారం వికలాంగులను పెళ్లి చేసుకున్న సకలాంగులకు ప్రోత్సా హకం కింద రూ.లక్షా 116 అందించాలని నిర్ణయించింది. 

దరఖాస్తు చేసుకునేందుకు :  దరఖాస్తు ఫారం, భార్యాభర్తల ఆధార్‌ కార్డు, కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, మ్యారేజ్‌ రిజిస్ట్రే షన్‌ సర్టిఫికెట్‌, మూడు పెండ్లిఫోటోలు, స్టడీ సర్టిఫికెట్‌ అవసరం.

ఐదేండ్ల నుంచి ఇలా..

జిల్లాలో దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహిస్తూ అర్హులను గుర్తించి అధికారులు నగదు అందిస్తున్నారు. 2015-2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-2020 వరకు 65 మంది వికలాంగులకు రూ.39.50 లక్షలను ప్రభుత్వం అందించింది. ఇందులో 2016-2017, 2017-2018 వరకు దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకుంటే 49 మందికి గాను రూ.50 వేల చొప్పున రూ.24.50 లక్షలను ప్రోత్సాహకంగా ఇచ్చారు. 2018-2019, 2019-2020లో దివ్యాంగులకు రూ.లక్షా 116 చొప్పున 16 మందికి రూ.15 లక్షలు అందజేశారు. ఇంకా ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఏడుగురు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రోత్సాహకం పెంచడం సంతోషం..

దివ్యాంగులు సకలాంగులను పెండ్లి చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకం అందించడం సంతోషం. కొత్త జీవో ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. గతం లో ప్రోత్సాహకంగా రూ. 50 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.1,00,116కు పెంచడం ఆనందంగా ఉంది. నాకు 2014-2015లో వివాహమైంది. 2016-2017లో ప్రభుత్వం రూ. 50వేలను ప్రోత్సాహకంగా అందించింది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి ఇవ్వడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                        

- సాక్‌పెల్లి సురేందర్‌, వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, నిర్మల్‌


logo