బుధవారం 20 జనవరి 2021
Nirmal - Dec 31, 2020 , 02:31:47

సర్కారు తీపికబురుపై ఆనందహేల

సర్కారు తీపికబురుపై ఆనందహేల

  • ఉద్యోగ విరమణ వయస్సు పెంపు నిర్ణయంపై ప్రశంసలు
  • పీఆర్సీపై విశ్వాసం 
  • కరోనా కష్టకాలంలోనూ అండగా నిలవడంపై హర్షం
  • ఖాళీల భర్తీ ప్రకటనపై నిరుద్యోగుల్లో ఆశలు
  • పలుచోట్ల సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం 

వేతన జీవులను కొత్త ఏడాదిలోకి సంబురంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రాష్ట్రంలోని అన్ని శాఖల, అన్ని రకాల ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించడంతో, ఆయా వర్గాలు సంబురాలు చేసుకుంటున్నాయి. జీతాలు, రిటైర్మెంట్‌ వయసును పెంచడంతో పాటు నిరుద్యోగులకు భరోసానిచ్చేలా ప్రకటన రావడంతో ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు. నిర్మల్‌, చెన్నూర్‌ పట్టణ కేంద్రాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేయగా, ఉద్యోగ సంఘాల నాయకులు, పారిశుధ్య, కాంట్రాక్ట్‌ కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలోనూ తమకు సర్కారు తీపికబురు అందించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

- నిర్మల్‌ టౌన్‌/నిర్మల్‌ అర్బన్‌/చెన్నూర్‌/ఎదులాపురం


నిర్మల్‌ టౌన్‌/చెన్నూర్‌/నిర్మల్‌ అర్బన్‌/ ఎదులాపురం: ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, ఉద్యోగోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, డైలీ వేజ్‌, ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు, హోంగార్డులు,

అంగన్‌వాడీ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆశకార్యకర్తలు, విద్యావలంటీర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం కేసీఆర్‌ మంగళవారం పేర్కొన్నారు. దీంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలు చేసి ముఖ్యమంత్రి తమకు మేలు చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పీఆర్సీని అమలు చేస్తే ట్రెజరీ ఉద్యోగులతో పాటు గ్రాంటియేటెడ్‌ ఉద్యోగులు, వర్క్‌చార్జి, డెలీవైస్‌, ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగులతో పాటు పారితోషికం ద్వారా పని చేసే హోంగార్డులు, అంగన్‌వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, సెర్ప్‌ ఉద్యోగులు, గౌరవ వేతనం తీసుకునే ప్రజాప్రతినిధులు, పెన్షనర్లకూ లాభం చేకూరుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖాల్లో రిటైర్డ్‌ అయిన రోజే గౌరవంగా వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త సంవత్సరం వేళ తమకు తీపికబురు అందించారని, కరోనా కష్టకాలంలోనూ తమకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారని కొనియాడారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, కౌన్సిలర్లు గండ్రత్‌ రమణ, బిట్లింగ్‌ నవీన్‌, సంపంగి రవి, శ్రీకాంత్‌, కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ మజర్‌, కోటగిరి నాగలక్ష్మి, తదిత రులున్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకులు ఫయాజ్‌, సునీల్‌, సంతోష్‌, తదితరులు న్నారు. చెన్నూర్‌ సీడీపీవో కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోమ న్నారు. టీచర్లు రజియా, భూతం విజయ, నాయిని రాజేశ్వరి, దాసరి లక్ష్మి, గట్టు సరిత, సుమతి, సుభద్ర, వనజ, విజయ, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు కొత్త సంవత్సర బొనాంజా ప్రకటించడంపై టీఎన్జీవో ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంద అశోక్‌, ఏ నవీన్‌ కుమార్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 

గౌరవం పెంచేలా నిర్ణయం


హాజీపూర్‌ : ముఖ్య మంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల గౌరవాన్ని పెంచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు, ఒప్పంద, కాంట్రాక్టు, పార్ట్‌ టైం, సెర్ప్‌ ఉద్యోగాలు, కారుణ్య తదితర నియమాకాలన్నీ చేపట్టారు. ఉద్యోగుల విరమణ వయస్సు పెంచారు. ఉద్యోగ విరమణ రోజే అన్ని ప్రయోజనాలను అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం అభినందనీయం. 

-గడియారం శ్రీహరి, టీఎన్‌జీవో, ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

నమ్మకంతోనే పని చేసిన..


మాది చిట్యాల్‌ గ్రామం.జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో రోజూవారీ కార్మికురాలిగా పని చేస్తున్నా.  జీతం రూ.7వేలే. ఇంటి అవసరాల కు ఏమాత్రం సరిపోవడం లేదు. తక్కువ జీతం అయినప్పటికీ ప్రభుత్వశాఖలో పని చేయడం వల్ల ఎప్పటికైనా మంచి జీతం వస్తుందని అనుకున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకంతోనే పనిచేస్తున్నా. ఇప్పుడు కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని స్వయంగా ఆయనే ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్‌ సారు అందరికీ మంచి చేస్తున్నడు. 

 - సుజాత, కాంట్రాక్ట్‌ వర్కర్‌

వయస్సు పెంపు శుభపరిణామం..


ఉద్యోగుల విరమణ వయస్సు పెంచడం శుభపరిణామం. ఉద్యోగ సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ తాను ఇచ్చిన హామీని నెరవేర్చి ఎంతో మంది అనుభవం కలిగిన ఉద్యోగుల సేవలను మరికొంత కాలం ఉపయోగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ రీత్యా ఎంతో అనుభవం కలిగిన ఉద్యోగులకు పదవీకాలం పెరగడం వల్ల మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పీఆర్‌సీ, బదిలీలు , ఉద్యోగోన్నతులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న వేళ కొత్త ఏడాది రానున్న తరుణంలో ప్రకటన రావడం సంతోషంగా ఉంది.

 - ఏ నవీన్‌ కుమార్‌, టీఎన్జీవోస్‌ ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
logo