శనివారం 23 జనవరి 2021
Nirmal - Dec 28, 2020 , 04:34:27

అకౌంట్లలోకే ‘ఆసరా’ నగదు

అకౌంట్లలోకే ‘ఆసరా’ నగదు

  • పింఛన్‌ పంపిణీలో అక్రమాల నివారణకు చర్యలు
  • ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌.. 
  •  లబ్ధిదారుడికి ఎప్పటికప్పుడు సమాచారం
  •  బ్యాంక్‌ అకౌంట్ల వివరాల సేకరణలో అధికారులు
  • ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జమ

నిర్మల్‌ అర్బన్‌ : సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. సంక్షేమ పథకాలు దక్కకపోవడంతో కొంతమంది మధ్యవర్తులు, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా, ఇతర పింఛన్లను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం జిల్లాలో పింఛన్లు పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు, బీడీ, చేనేత కార్మికులు, ఇతర లబ్ధిదారుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారుల సమక్షంలోనే పింఛన్లను పంపిణీ చేసేవారు. దీంతో కొంత మంది అధికారులు చేతివాటం ప్రదర్శించడం, అక్రమాలకు పాల్పడడంతో లబ్ధిదారులకు పింఛన్‌ మొత్తం అందడం లేదన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో నగదు జమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జిల్లాలోని లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్ల సేకరణ, ఆధార్‌ కార్డులకు మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేస్తున్నారు.

పారదర్శకంగా పింఛన్ల పంపిణీ..

ప్రభుత్వం పింఛన్లను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాల్టీల్లో లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా పింఛన్‌ నగదు అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారుల సమక్షంలో పింఛన్‌ డబ్బులను అందజేస్తున్నారు. ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.2,016 అందిస్తుండగా, అధికారులు కేవలం రూ.2000 మాత్రమే అందజేస్తూ మిగతా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల వృద్ధులకు సక్రమంగా పింఛన్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నది.

బ్యాంకు అకౌంట్‌, ఆధార్‌కు మొబైల్‌ నంబర్ల లింక్‌..

పింఛన్లు పక్కదారి పట్టకుండా అధికారులు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోనే నగదు జమచేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని పట్టణ ప్రాంతాలు మినహా 19 మండలాల్లోని లబ్ధిదారుల బ్యాంకు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆధార్‌ నంబర్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేస్తున్నారు. ఈ లింక్‌తో పింఛన్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు లబ్ధిదారుడి మొబైల్‌ నంబర్‌కు పంపిస్తున్నారు.లబ్ధిదారులు మొబైల్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి నగదును తీసుకుంటున్నారు. ఈ విధానం మున్సిపల్‌ పరిధిలోని లబ్ధిదారులకు అందుబాటులో ఉండగా.. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో అమలు కానుంది.   

లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్న అధికారులు..

నిర్మల్‌ జిల్లాలో పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మున్సిపాల్టీల్లో ఇప్పటికే బ్యాంక్‌ అకౌంట్లకు నగదును పంపిణీ చేయగా.. ఆధార్‌ నంబర్‌కు మొబైల్‌ లింక్‌ చేస్తున్నారు. జిల్లాలో 1,41,053 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 1,21,401 మంది మొబైల్‌ నంబర్ల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా 19,652 మంది మొబైల్‌ నంబర్లను నమోదు చేయనున్నారు. బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించిన వివరాలను సైతం సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,19,706 మంది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు.. ప్రభుత్వం అందజేసే పింఛన్లను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. జిల్లాలో 1,41,053 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు. ఇప్పటికే మున్సిపాల్టీల్లోని లబ్ధిదారులకు నేరుగా అకౌంట్‌లో నగదు జమకాగా.. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల్లో పింఛన్లను పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంకా 1,602 మంది లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లను, 19,652 మంది లబ్ధిదారుల ఆధార్‌ కార్డుల్లో మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. 

- వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో


logo