మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Dec 25, 2020 , 00:05:23

జీతం తగ్గితే బతుకుడెట్లా.. ?

జీతం తగ్గితే బతుకుడెట్లా.. ?

నిర్మల్‌టౌన్‌/సారంగాపూర్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సుమారు 30 వేల మంది కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 20 వేల మంది తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. మిగతా 10 వేల మంది పొట్టకూటి కోసం ప్రాణాలకు తెగించి.. పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలోని, నిర్మల్‌, సారంగాపూర్‌, మామడ, లక్ష్మణచాంద, కడెం, ఖానాపూర్‌, పెంబి, లోకేశ్వరం, కుంటాల, కుభీర్‌ తదితర మండలాలతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ, బోథ్‌, ఇచ్చోడ, తలమడుగు, భీంపూర్‌, మంచిర్యాల్‌ జిల్లాలోని లక్షెట్టిపేట్‌, జన్నారం, దండేపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది కార్మికులు బెహరాన్‌, ఇరాక్‌, దుబాయ్‌, మస్కట్‌, సౌదీ అరేబియా, కువైట్‌ తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఈ కార్మికుల్లో 90 శాతం శ్రామిక జీవులే. రోజంతా కష్టపడి వచ్చిన జీతంలో కొం త ఖర్చులకు ఉంచుకొని.. మిగతా డబ్బులను తమ కుటుంబాలకు పంపిస్తారు. ఆ డబ్బులతో ఇక్కడున్న వారు అప్పులను తీర్చడం, పిల్లలను చదివించుకోవడంతో పాటు ఇంటి అవసరాల కోసం వాడుకుంటారు. అయితే, సర్కారోళ్లు అక్కడికి కార్మికుల కనీస వేతనాల్లో కోత విధించేందుకు సర్క్యులర్‌ తీసుకురావడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

కనీస వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత విధిస్తే..

అక్కడ పని చేసే సాధారణ కూలీకి 800 దినార్లు ఉంటే (ఇక్కడ రూ.16000), 1200 దినార్లు ఉంటే (రూ. 24వేలు) వేతనం వస్తుంది. సర్కారోళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోతవిధిస్తే రూ. 16 వేల వేతనం ఉన్న వారికి రూ. 12 వేలు, రూ. 24వేల వేతనం ఉన్న వారికి రూ. 18 వేలు చేతికి వస్తుంది. దీంతో అక్కడ పని చేసే కార్మికులు వచ్చిన జీతం సరిపోక ఇంటికి పంపే డబ్బులు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వచ్చిన డబ్బులన్నీ ఖర్చులకే పోతే పిల్లలను ఎలా చదివించాలో.. ఇంటి అవసరాలు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక మరింత ఆందోళన చెందుతున్నారు. కార్మికులకు అండగా ఉండాల్సిన సర్కారు వలస జీవుల ఉపాధికి గండికొడుతుందని ఆవేదన చెందుతున్నారు.

బతుకడం కష్టమే..

దండేపల్లి : మాది తాళ్లపేట. మా ఊరిలో ఫొటో స్టూడియో, మీ సేవ పెట్టుకున్న. సరిగ్గా నడువలేదు. పదేళ్ల కింద అమ్మానాన్నలు, భార్యా పిల్లలను వదిలి దుబాయ్‌కి వచ్చిన. మొదట్లో మస్తు కష్టపడ్డా. ఇప్పుడు సెంట్రల్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న. ప్రస్తుతం రూ. 30 వేల జీతం వస్తుంది. పిల్లలను చదివిస్తున్న. నా భార్యకు మంచి ఉద్యోగం రావాలని హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పిస్తున్నా. ఇంతలోనే సర్కారు పిడుగులాంటి వార్త వినిపించింది. జీతంలో కోత విధిస్తామని సర్యులర్‌ తెచ్చింది. అసలే ఇక్కడి కంపెనీలు చేసిన పనికి సరైన వేతనాలు ఇవ్వక ఇబ్బంది పెడుతాయి. ఈ తరుణంలో ఇచ్చే జీతంలో కోత పెడితే బతుకడం కష్టం. దుబాయ్‌లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.16 వేల నుంచి రూ. 30 వేల దాకా జీతం వస్తుంది. ప్రస్తుత ఉత్తర్వులతో వేతనం తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరిచి ఉత్తర్వులు విరమించుకోవాలి. - పెరుగు మల్లికార్జున్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఉద్యోగి, దుబాయ్‌, తాళ్లపేట

మా బతుకుల్లో మన్నుపోస్తరా..?

నేరడిగొండ : నా భర్త పేరు గడ్డం లస్మన్న. మాకు బిడ్డ, కొడుకు ఉన్నరు. మాది పేద కుటుంబం. మా ఆయన రూ. 3 లక్షల దాకా అప్పు చేసి గల్ఫ్‌కు పోయిండు. నెలంతా కష్టపడితే రూ. 10 వేల నుంచి రూ. 12 వేల దాకా జీతం దొరుకుతదట. ఓటీ చేసుకుంటే చిల్లర ఖర్చులకు కొంత దొరుకుతయట. ఆయన పంపించే జీతం అప్పులకే సరిపోతున్నయ్‌. ఇగ మెమెట్లా బతుకుడు. అసలే జీతం తక్కువగా ఉండే. ఇగ దాంట్ల కూడా కటింగ్‌ చేస్తే ఎట్లా.. గిదెక్కడి న్యాయం. మాలాంటి పేదల బతుకుల్లో మన్ను పోస్తరా. మా గతేం కావాలి. మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి. అప్పులు చేసి గల్ఫ్‌కు పంపినం. ఇప్పుడు ఇలా చేస్తే అప్పులు కుప్పలవుతయి. మాలాంటోళ్లకు సాయం చేయాల్సింది పోయి.. పొట్టగొట్టడం సరికాదు.      - గడ్డం అనిత, గల్ఫ్‌ కార్మికుడి భార్య, తేజాపూర్‌

బంగారం తాకట్టుపెట్టి పోయిన్రు..

బజార్‌హత్నూర్‌ : నా భర్త మల్లయ్య 13 ఏండ్ల కింద, నా కొడుకు ప్రశాంత్‌ ఏడాదిన్నర కింద దుబాయ్‌కి పోయిన్రు. బంగారం తాకట్టు పెట్టి అక్కడికి పంపించిన. నా భర్త క్లీనింగ్‌ చేస్తడు. నా కొడుకు ఏసీ మెకానిక్‌. నెలంతా కష్టపడితే వచ్చే జీతంల కొన్ని డబ్బులు ఉంచుకొని మిగతావి ఇక్కడికి పంపిస్తున్నరు. అవి కూడా బాకీలు కట్టడానికే సరిపోతున్నయ్‌. ఇప్పుడు సర్కారోళ్లు గా జీతంల కూడా కోత పెడ్తరట. ఇగ వాళ్లకు గీ పేదోళ్లే దొరికిన్రా. మాలాంటోళ్లను ఇట్లగూడ బతుకనీయరా.. ఇదెక్కడి న్యాయం. దేశంగాని దేశంపోయి.. పడరాని పాట్లు పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి గిట్ల తిప్పలపెట్టుడు మంచిగ లేదు. ఇకనైనా ఆలోచించాలి.- రైనవేణి నర్సక్క, బజార్‌హత్నూర్

గాళ్లు జీతం ఇస్తే.. గీళ్లకు ఏమౌతుందో..

దిలావర్‌పూర్‌ : మా ఊరులో పనిదొరకక నా భర్త రమేశ్‌ రెండేండ్ల కింద దుబాయికి పోయిండు. మధ్యల ఓసారి వచ్చి మళ్లా పోయిండు. అప్పట్లో పని మంచిగనే ఉండే.. కరోనా వచ్చిందని మస్తు రోజులు వట్టిగనే ఉన్నరు. మూడు నాలుగు నెలల నుంచి పనిచాలైందని చెప్పిండు. గిప్పుడు సర్కారోళ్లు అక్కడ పని చేసేటోళ్ల జీతంల కోత పెడుతరని చెబుతున్నరు. ఏదో జీవో తీసుకచ్చింన్రట. మన దగ్గర పని చూపెట్టరు. అక్కడైనా ఏదో ఒక పని చేసుకొని బతుకుదామని పోతే గిట్ల చేయవట్టే.. గక్కడ పని చేయించుకునేటోళ్లు జీతం ఎంత ఇస్తే.. గీళ్లకు ఏమౌతుందో మరి. పేదోళ్ల కడుపు కొట్టే చట్టాలు తెచ్చుడెందుకో. ఇదెక్కడి న్యాయమో అర్థమైతలేదు. - మమత, లోలం

నిర్మల్‌ టౌన్‌ : నాపేరు రాంగిరి సవిత. మాది ఓలెం. నా భర్త పేరు అశోక్‌. మాకు కొడుకు, బిడ్డ ఉన్నరు. మా ఆయన ఇక్కడ ఎవుసం పనులకు పోయేటోడు. నేను బీడీలు చుట్టేదాన్ని. ఇద్దరం పొదంతా కష్టపడితే వచ్చే డబ్బులు ఎటూ సరిపోయేటివి కావు. పిల్లలు ఎదుగబట్టే.. గిట్లయితే కష్టమైతదని మా ఆయన రూ. 2 లక్షల దాకా అప్పు చేసి దుబాయ్‌కి పోయిండు. అక్కడ రూ. 15 వేల జీతమే. రూ. 7 వేలు ఖర్చుకు ఉంచుకొని మిగతా రూ. 8 వేలు ఇంటికి పంపుతుండు. పోయి రెండేండ్లు అయితంది. ఆయన పంపిన డబ్బులతో లక్ష రూపాయల దాకా బాకీ కట్టినా. ఇంకా లక్ష రూపాయల బాకీ ఉంది. ఈ బాకీ తీరాలంటే ఇంకో ఏడాదైనా పడుతది. నేను బీడీలు చుడితే రూ. 2 వేలు, బీడీల పింఛన్‌ రూ. 2 వేలు వస్తంది. గివ్విటితోనే ఇళ్లు గడుస్తంది. గిప్పుడు సర్కారోళ్లు జీతం తగ్గిస్తే బాకీలెట్లా కట్టుడు.. మేమెట్లా బతుకుడు.
సారంగాపూర్‌ : నా పేరు దాసరి దీప. మాది సారంగాపూర్‌ మండలం జామ్‌గ్రామం. మాకు వ్యవసాయ భూమి లేదు. రెక్కల కష్టం మీదే బతుకుడు. ఉన్ననాడు తిన్నం.. లేనినాడు ఉపవాసమున్నం. మా ఊరి నుంచి మస్తు మంది గల్ఫ్‌కు పోయిన్రు. మా ఆయన దాసరి నర్సయ్య కూడా పోతనంటే వద్దన్న.  నామట వినలే. 2018లో గల్ఫ్‌కు పో యిండు. మా చుట్టపోళ్ల దగ్గర నూటికి రూ. 2 చొప్పున రూ. లక్ష అప్పు చేసినం. అక్కడ మేస్త్రీ పని చేస్తుండు. రూ. 16 వేల జీతం వస్తున్నది. ఖర్చులకు రూ. 6 వేలు ఉంచుకొని మిగతా రూ. 10 వేలు ఇంటికి పంపుతండు. పోయి రెండేండ్లు అయ్యింది. వచ్చిన రూ. 10 వేలలో రూ. 5 వేలు ఇంటి ఖర్చులకు తీసుకొని రూ. 5 వేలు అప్పు కడుతున్న. ఇప్పుడు సర్కారోళ్లు జీతం తగ్గిస్తరట.. గీ పేదోళ్ల పొట్ట గొట్టుడు న్యాయం కాదు. 

పేదోళ్ల కడుపుకొడుతున్రు

జన్నారం : మా పెద్ద కొడుకు దావుల రాజు అప్పులు చేసి మూడేండ్ల కింద దుబాయికి పోయిండు. అక్కడ ఓ కంపెనీలో పని చేస్తండు. రూ. 18 వేల జీతం. మాకు ప్రతి నెలా రూ. 8 వేల దాకా పంపేటోడు. కరోనా వచ్చిందని కంపెనీలో లాక్‌డౌన్‌ పెట్టింన్రట. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా పంపించలేదు. ఇప్పుడు కంపెనీ తెరవడంతో పని చేత్తండు. మాది పేద కుటుంబం మాకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. సర్కారోళ్లు ఇప్పుడు జీతంల కోత పెడుతున్నరట. ఇగ గిట్లయితే బతుకుడెట్లా. అప్పులు కట్టేదెట్లా.. మాలాంటి పేదోళ్ల కడుపు కొడుతున్రు.  - దావుల శంకర్‌-శంకరవ్వ, రాజు తల్లిదండులు, బాదంపెల్లి

మా పెద్ద బిడ్డ పెండ్లికి కూడా రాలే..

నిర్మల్‌ టౌన్‌ : నా భర్త పేరు దశరథ్‌. మాకు ముగ్గురు కూతుళ్లు శివాని, శిల్ప, శ్రేయ. నేను బీడీలు చుడితే మా ఆయన కంపెనీలో ప్రైవేట్‌ పనిచేసేటోడు. ఇద్దరం కష్టపడితే వచ్చేది రూ.12 వేలే. బిడ్డలు ఎదుగుతున్నరు. ఇక్కడ పనిచేస్తే వచ్చే డబ్బులన్నీ ఇంటి ఖర్చులకే అవుతున్నయ్‌. అందుకే మా ఆయనను రెండేళ్ల కింద రూ. లక్షా 50 వేల అప్పు తెచ్చి దుబాయికి పంపించా. రూ. 20 వేల జీతం వస్తది. అందులో రూ.15 వేలు ఇంటికి పంపితే.. మిగతా రూ.5 వేలు ఖర్చులకు ఉంచుకుంటున్నడు. ఇటీవల పెద్ద బిడ్డ లగ్గం కుదిరింది. మా ఆయన లేడు. మా ఆయన గల్ఫ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత లగ్గం చేద్దామనుకున్నాం. పిలగానోళ్లు ఒత్తిడి చేస్తే ఆయన లేకుండానే పెద్ద బిడ్డకు మంచి సంబంధం రావడంతో లగ్గం చేసినం. ఆ రోజు బాగా ఏడ్చినం. ఇప్పటికీ గుర్తుంది. పొట్టతిప్పల కోసం మా ఆయన గల్ఫ్‌లో కష్టపడి పనిచేస్తుంటే ఉన్న జీతం తగ్గించాలని సర్కారోళ్లు నిర్ణయం తీసుకున్నరట. ఇది తప్పు. ఎప్పుడైనా కార్మికులకు జీతాలు పెంచాలి గానీ గిట్లా తగ్గించి రోడ్డు మీద పడేయద్దు. - నిర్మల, మామడ