బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 24, 2020 , 00:14:44

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

  • ఉచితంగా కోట్లాది చేప, రొయ్య పిల్లల పంపిణీ
  • రాష్ట్ర మంత్రి  అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
  • రూ.50 లక్షలతో చేపల మార్కెట్‌ భవన నిర్మాణానికి భూమి పూజ
  • కొండాపూర్‌ పంచాయతీ భవనం ప్రారంభం

నిర్మల్‌ అర్బన్‌ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రూ.50 లక్షలతో చేపల మార్కెట్‌ భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది చేప, రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు. అలాగే చేపలను అమ్ముకునేందుకు వీలుగా వాహనాలు, ఐస్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ కాంటాలు అందించిందని తెలిపారు. కాగా చేపల మార్కెట్‌ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని మత్స్యకార సంఘం నాయకులు మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన, అదనంగా మరో రూ.కోటి మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. కానీ బీజేపీ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. రైతులతో పాటు సామాన్య ప్రజలను మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, నిర్మల్‌ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఫిషరీస్‌ ఏడీ దేవేందర్‌, వార్డు కౌన్సిలర్‌ ఫర్హానాబేగం, గొనుగోపుల నర్సయ్య, యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొండాపూర్‌ జీపీ భవనం ప్రారంభం..

సోన్‌ : నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌లో రూ.16 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదన్నారు. వాటితోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతికి ప్రాధాన్యతనిస్తూనే రైతుల వెన్నంటి ఉంటున్నదని గుర్తుచేశారు. ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామ రైతులను శాలువాతో సన్మానించారు. అలాగే ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థినులు ఎల్లుల ప్రణయ, పాటిల్‌ పల్లవిని సన్మానించారు. భవిష్యత్‌లో మంచి వైద్యులుగా ఎదిగి, గ్రామ సేవకు కృషిచేయాలని ఆకాంక్షించారు. అన్ని గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామానికి చెందిన సాదం లతకు రూ.5లక్షల రైతు బీమా చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మద, సర్పంచ్‌ నవాత్‌ గంగాధర్‌, తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌, ఎంపీడీవో సాయిరాం, నాయకుడు మల్లికార్జున్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. logo