బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 21, 2020 , 00:17:04

కోతుల సంరక్షణకు చర్యలు

కోతుల సంరక్షణకు చర్యలు

  • ఆహారం కోసమే భారీసంఖ్యలో పండ్ల చెట్ల పెంపకం
  • ప్రజల ఇబ్బందులను తొలగించేందుకే పునరావాస కేంద్రం ఏర్పాటు
  • అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • వానర కేంద్రం, మూషిక జింకల పార్కును ప్రారంభించిన అల్లోల
  • రూ.2.65 కోట్లతో గండి రామన్న పార్కులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోతుల సంరక్షణ కోసమే తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం గండి రామన్న హరితవనంలో ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని, మూషిక జింకల పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం హరితవనంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ.. ఈ పునరావాస కేంద్రంలో కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, అవి పూర్తిగా కోలుకున్నాక అడవుల్లో వదిలేస్తామని తెలిపారు. 

- నిర్మల్‌ అర్బన్‌


నిర్మల్‌ అర్బన్‌ : వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గండి రామన్న హరితవనంలో ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ముందుగా మంత్రితో పాటు పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభకు అటవీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. ‘వానలు రావాలే.. కోతులు వాపస్‌ పోవాలె’ అన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. దేశంలో రెండోదిగా, దక్షిణ భారతంలో తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు కోతుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేశామని తెలిపారు. దశల వారీగా పంచాయతీల సహకారంతో కోతులను పట్టుకొని కు.ని ఆపరేషన్‌ చేస్తారని, పూర్తిగా కోలుకున్నాక తిరిగి అడవుల్లోకి వదిలేస్తారని తెలిపారు. పర్యావరణ సమతుల్యత ద్వారానే మానవ జాతి మనుగడ సాధ్యమని నమ్మి అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో నీడనిచ్చే, పూలు, పండ్లు, ఔషధ మొక్కలను విరివిగా నాటుతున్నామని తెలిపారు.

మూషిక జింకల పార్కు ప్రారంభం..

ఇక్కడి వనంలో అర ఎకరం విస్తీర్ణంలో రూ.8లక్షలతో ఏర్పాటు చేసిన మూషిక జింకల పార్కును మంత్రి ప్రారంభించారు. ఐదు మూషిక జింకలు హాయిగా తిరిగేలా పార్కును ఏర్పాటు చేశారు. నీటి తొట్లు, గుడిసెలను నిర్మించారు. మూషిక జింకల కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

హరితవనంలో కాంప నిధులు రూ.2.65 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వెయ్యి ఎకరాల్లో పార్కును విస్తరించి, పనులను చేపట్టారు. ఇందులో భాగంగా బోటింగ్‌, చైన్‌ లింక్‌, సఫారీ, గజీబో, ఎకో హట్స్‌ వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌  వినోద్‌కుమార్‌, నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కే నర్మద, ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, వెంకట్‌ రాంరెడ్డి, వంగ రవీందర్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్‌ రెడ్డి, నాయకులు రాంకిషన్‌ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫారెస్ట్‌ సెక్షన్‌, బీట్‌ ఆఫీసర్ల భవనాలు ప్రారంభం.. 

మామడ : మండలంలోని పొన్కల్‌, దిమ్మదుర్తిల్లో ఫారెస్ట్‌ సెక్షన్‌, బీట్‌ ఆఫీసర్లకు నూతనంగా నిర్మించిన భవనాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ అందరి బాధ్యతన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. పొన్కల్‌ దులగుట్టలో.. నెమళ్లు పెంచి నెమలి ఘాట్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట డీసీసీబీ డైరెక్టర్‌ హరీశ్‌కుమార్‌, నాయకులు హన్మాగౌడ్‌, గంగారెడ్డి, నవీన్‌రావు, చంద్రాగౌడ్‌, ఏనుగు లింగారెడ్డి, నల్ల లింగారెడ్డి పాల్గొన్నారు.

కడెం : కడెం మండలం ఉడుంపూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్‌ టైగర్‌ జోన్‌ లోగోను ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, అధికారులతో కలిసి మంత్రి అల్లోల ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంపదను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo