ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Dec 10, 2020 , 00:57:43

యాసంగికి ‘రైతు బంధు’వు

యాసంగికి ‘రైతు బంధు’వు

  • ఉమ్మడి జిల్లాకు రూ.825.47 కోట్లు విడుదల
  • ఈనెల 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ..
  • ఐదు విడుతల్లో రూ.3,384.41 కోట్ల సాయం
  • సాగు సమయంలో తెలంగాణ సర్కారు అండ
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా రైతులు

తెలంగాణ సర్కారు రైతుల పక్షాన నిలుస్తున్నది. అన్నదాతల అవసరాలు తెలుసుకొని దానికి అనుగుణంగా పథకాలు ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తుండగా..  రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు ఐదు విడుతలుగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు.  ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు విడుతలుగా  ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు కూడా నిధులు విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 - నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ  

నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నది. మే 10, 2018న రైతుబంధు పేరిట పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడుతగా ఎకరానికి రూ.4వేల చొప్పున.. యేడాదికి రెండు దఫాలుగా రూ.8 వేలు చెల్లించారు. మొదటి విడుతలో చెక్కుల ద్వారా సాయం అందించగా.. 2018 డిసెంబర్‌లో యాసంగి నుంచి రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. 2018 జరిగిన ఎన్నికల హామీలో భాగంగా సాయాన్ని ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు దఫాలుగా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. 2019-20 వానకాలం నుంచి పెంచిన పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 2018-19లో వానకాలం, యాసంగికి రెండు విడుతలుగా రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. తర్వాత ఎకరానికి రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగిలో రెండు విడుతల్లో ఇచ్చారు. ఇప్పటికే ఐదు విడుతల్లో పంట పెట్టుబడి సాయం అందించగా.. 2020-21 సంవత్సరానికి యాసంగికి డబ్బులను విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఈ యాసంగికి డబ్బులు విడుదల

వానకాలానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 5,52,137 మంది రైతులుండగా.. వారికి రూ.825.47 కోట్ల పెట్టుబడి సాయాన్ని విడుదల చేశారు. నిర్మల్‌ జిల్లాలో 1,66,064 మంది రైతులకు రూ.221.09 కోట్లు, ఆదిలాబాద్‌లో 1,40,954 మందికి రూ.270.44 కోట్లు, మంచిర్యాలలో 1,37,028 మందికి రూ.165.94 కోట్లు, ఆసిఫాబాద్‌లో 1,08,091 మందికి రూ.168 కోట్లు విడుదల చేశారు. తాజాగా యాసంగిలో కూడా అంతే మంది రైతులకు.. అంతే మొత్తం డబ్బులు విడుదల చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు విడుతల్లో కలిపి ప్రభుత్వం రైతులకు రూ.3,384.41 కోట్లు విడుదల చేసింది. ఐదు విడుతల్లో నిర్మల్‌ జిల్లాకు రూ.852.73 కోట్లు, ఆదిలాబాద్‌కు రూ.1,171.15 కోట్లు, మంచిర్యాలకు రూ.713.91 కోట్లు, ఆసిఫాబాద్‌ జిల్లాకు రూ.646.62 కోట్లు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 2018-19 వానకాలంలో 4,92,484 మందికి రూ.616.19 కోట్లు, 2018-19 యాసంగి సీజన్‌కు 4,97,621 మందికి రూ.625.37 కోట్లు, 2019-20 వానకాలానికి 4,99,124 మంది రైతులకు రూ.752.59 కోట్లు, 2019-20 యాసంగి సీజన్‌కు 4,03,179 మంది రైతులకు రూ.564.97 కోట్లను జమ చేసింది.


పెరిగిన రైతుల సంఖ్య

రైతుబంధు పథకం అమలు ప్రారంభించినప్పుడు ఉమ్మడి జిల్లాలో రూ.616.19 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.825.47 కోట్లకు చేరింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అదనంగా రూ.210 కోట్లు పెరిగింది. రైతుల విషయానికొస్తే పథకం ప్రారంభ సమయంలో 4,92,484 మంది ఉంటే ఏకంగా 60 వేల మంది రైతులు పెరిగారు. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టగా.. భూ సమస్యలకు పరిష్కారం చేశారు. జూన్‌ 16, 2020 వరకు పాస్‌  పుస్తకాలు వచ్చిన వారికి కూడా రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ సీడింగ్‌ లేని వారికి అవకాశం ఇచ్చారు. ఆధార్‌, బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్న వారికి సరి చేసుకునే అవకాశం ఇచ్చారు. సాధ్యమైనంత మేర అందరు రైతులకు రైతుబంధు లబ్ధి చేకూరేలా చేశారు. దీంతో రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రైతులందరికీ ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతోనే పట్టాదారు పాస్‌ పుస్తకం అందిన ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేస్తున్నారు.

అర్హులకు రైతుబంధు

రైతుబంధు సొమ్మును విడుతలవారీగా జమ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతంలో మాదిరిగానే తక్కువ భూములు ఉన్న రైతులు ముందుగా, ఎక్కువ భూములు ఉన్న రైతులు తర్వాత ఇలా ఖాతాల్లో సొమ్ము జమ చేస్తారు. మొదట ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు తొలి విడుతలో, రెండో దశలో రెండున్నర  ఎకరాలలోపు, ఆ తర్వాత రెండు హెక్టార్లలోపు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతుబంధు సొమ్ము అకౌంట్లలో జమ కానుంది. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అర్హత ఉన్న ప్రతి రైతుకు సొమ్ము అందే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చిన తర్వాత రైతులకు సొమ్ము జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. పట్టాదారు పాస్‌ పుస్తకం ఉండి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న ప్రతి రైతుకు రైతుబంధు పథకం వర్తిస్తుందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. రైతుబంధు పథకంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తాజాగా యాసంగి సీజన్‌లో కూడా జిల్లాకు రూ.221కోట్ల మేర రానున్నాయని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మల్‌ డీఏవో అంజిప్రసాద్‌ తెలిపారు.logo