సోమవారం 18 జనవరి 2021
Nirmal - Dec 07, 2020 , 01:11:22

పోగొట్టుకున్న చోటే పొందారు

పోగొట్టుకున్న చోటే పొందారు

  •  ఆదర్శంగా నిలిచిన వడ్యాల్‌ యువకులు
  • మూడెకరాల స్థలంలో చేపల చెరువు ఏర్పాటు
  • స్థానికంగా బంగారుతీగ, బొచ్చ రకం పెంపకం
  • గతేడాది కట్ట తెగి తీరని నష్టం  n ఈసారి 16 టన్నుల చేపల ఉత్పత్తి

పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మిత్రులు. తమ కష్టాన్ని విధి వెక్కిరించి దూరం చేస్తే, అదే దారిని నమ్ముకొని విజయం సాధించారు. రూ.16 లక్షలతో చేపట్టిన చేపల చెరువు గతేడాది వరుణుడి రూపంలో కట్ట తెగి గోదావరి పాలవగా, వెనుకడుగు వేయలేదు. ఈ ఏడాది పక్కా ప్రణాళికతో  ముందడుగు వేసి పట్టువదలని విక్రమార్కుల్లా సాధించి చూపించారు. 16 టన్నుల చేపలు ఉత్పత్తి చేసి, శభాష్‌ అనిపించుకున్నారు. 

 -లక్ష్మణచాంద

కష్టాలను ఓర్చి ముందుకెళ్లాం..తెలిసిన పని చేస్తే మంచిగుంటదని చేపల చెరువును మొదలు పెట్టాం. ముగ్గు రం కలిసి ఎన్నో కష్టాలను భరించి, మొదటి అడుగు వేశాం. ఎందరినో కలిసి సలహాలు తీసుకున్నాం. అధికారుల అనుభవం మాకు ఎంతో పని చేసింది. మొదటిసారి చిన్న తప్పిదానికి నష్టపోయినా, వెనక్కి తగ్గలేదు. నిరాశ పడకుండా మరోసారి ప్రయత్నిద్దామని ముగ్గురం అనుకున్నాం.  కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నించాం. ఈ సారి మంచి ఉత్పత్తని సాధించాం. వచ్చే ఏడాదికి కూడా సిద్ధమవుతున్నాం. ఇదే ప్రోత్సాహంతో మరింత ఉత్పత్తి పెంచడానికి కృషిచేస్తాం. ప్రభుత్వం ద్వారా రుణ సహాయంకోసం దరఖాస్తు చేసుకున్నాం. మంజూరు కాగానే విస్తృత పరుస్తాం. ఈ సారి అనుకన్నది సాధించాం. చాలా సంతోషంగా ఉంది.

-కొంగెల్లి భీమేశ్‌, వడ్యాల్‌, లక్ష్మణచాంద

లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్‌ గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు చెందిన ముగ్గురు మిత్రులు ఏదైనా సాధించాలని ఆలోచించారు. తమకు తెలిసిన రంగంలోనే పెట్టుబడి పెడితే నలుగురికి ఉపాధితో పాటు స్థానికంగానే పోషకాహారం అందించే వీలుంటుందని భావించారు.  గ్రామానికి చెందిన యువకులు కొండ్ర మోహన్‌, పల్లికొండ సాగర్‌, కొంగెల్లి భీమన్న . వడ్యాల్‌ శివారులో మూడెకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. గతేడాది రూ.16 లక్షల పెట్టుబడితో చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. మూడెకరాల స్థలంలో చేపల చెరువును ఏర్పాటు చేయడానికి రూ.7 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత చేప విత్తనాలకు రూ.2 లక్షలు, దాణ కోసం రూ.7 లక్షలు ఖర్చు చేశారు. కాగా, వరుణుడి రూపంలో చేపల చెరువు తెగిపోయి, తాము పెంచుతున్న చేపలు వాగు ద్వారా గోదావరిలో కలిసిపోయి అపార నష్టాన్ని మిగిల్చాయి.

- లక్ష్మణచాంద

నిరాశ ఉన్నా.. నిబ్బరం వీడలే..

తొలిసారి వేసిన చేప పిల్లలు చేతికందక పోవడంతో వారు పట్టు వీడలేదు. పట్టువదలని విక్రమార్కుల్లా మరోసారి అదే రంగాన్ని నమ్ముకున్నారు. ఈ సారి మాత్రం ఆ తప్పు పునరావృతం కాకుండా, పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లారు. విజయం సాధించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరు నుంచి రూ.రెండు లక్షలతో 20 వేల చేప విత్తనాలను కొనుగోలు చేశారు. అర ఎకరం స్థలంలో ఫంగసీయస్‌ రకం, రెండున్నర ఎకరాల్లో బంగారుతీగ, బొచ్చ, రవు రకం చేపలను పెంచారు. మొదట ఫంగసీయస్‌ రకం చేపలు 8 టన్నుల వరకు అమ్మారు. అనంతరం రెండోదశలో మరో 8 టన్నుల వరకు మిగతా రకం చేపలను అమ్మారు. మొదటిసారి పెట్టిన పెట్టుబడి తిరిగి సాధించారు. కాగా, మూడోదశలో తొలుత ఫంగసీయస్‌ చేపల విత్తనాలను వేశారు. ఇవి అగస్టు నాటికి చేతికి రానున్నాయి. కాగా, మిగతా రకం చేపలను కూడా త్వరలోనే వేయనున్నారు. స్థానికంగా మండల ప్రజలకు రుచికరమైన చేపలను అందించడంతోపాటు, నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చేపలు అందిస్తూ లాభం పొందుతున్నారు. 

మొదట్లో నష్టపోయాం..


ప్రారంభంలో చేపల చెరువు రంగంలో అనుభవం లేకపో వడం, దానికి తోడు అకాల వర్షాలు మమ్మల్ని ముంచాయి. అప్పుడే ఏర్పాటు చేసిన చెరువు కట్టలు తెగిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాం. ఒకదశలో తీవ్ర ఆవేదనలో ఉన్నప్పటికీ పట్టుదలతో ఈసంవ త్సరం తిరిగి ఉత్పత్తి ప్రారంభించి మంచి ఫలితాలు సాధించాం. దీని కోసం ఎంతో శ్రమించాం. మత్స్య శాఖ అధికారుల సలహాలు కూడా తీసుకున్నాం. ఈ సారి ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకున్నాం. శ్రమకు ఫలితం వచ్చింది. మూడోదశలో మా కష్టానికి పూర్తి ఫలితం దక్కుతుందనుకుంటున్నాం.

-కొండ్ర మోహన్‌, వడ్యాల్‌, లక్ష్మణచాంద మండలం

మంచి దిగుబడి వచ్చింది..


ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చింది. వాతావరణం కూడా చేపల పెంపకానికి అనుకూలంగా ఉండడంతో బాగా బరువు పెరిగాయి. మత్స్యశాఖ అధికారుల సూచనలు, సలహాలతో మంచి దిగుబడి సాధించడం చాలా సంతోషంగా ఉంది. పోయినేడు జరిగిన నష్టాన్ని మర్చిపోయేలా ఈసారి చేపలు బయటకు వచ్చాయి. ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నాం. నిర్మల్‌ జిల్లాకేంద్రానికి కూడా పెద్ద ఎత్తున చేపలను పంపించాం. 

-పల్లికొండ సాగర్‌