శనివారం 16 జనవరి 2021
Nirmal - Dec 07, 2020 , 01:11:18

యాసంగికి శుభవార్త

యాసంగికి శుభవార్త

  • నీటి విడుదలకు సర్కారు నిర్ణయం
  • 15 తర్వాత తీసుకోవచ్చని ఆదేశాలు
  • ప్రాజెక్టుల్లో నీరు పుష్కలం.. రైతుల్లో ఆనందం.. 
  • సరస్వతీ కాలువ, కడెం, స్వర్ణ ఆయకట్టుకు వరం

యాసంగిలో పంటలకు అవసరమైన నీటి విడుదలకు సర్కారు అనుమతించింది. నిర్మల్‌ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 తర్వాత స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి ఎప్పుడైనా నీరు విడుదల చేసుకోవచ్చని సాగునీటి పారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండగా.. ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఎస్సారెస్పీ కింద సరస్వతీ కాలువ, సదర్మాట్‌, కడెం, స్వర్ణ ప్రాజెక్టుల కింద యాసంగి సాగుకు నీరు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాలో సరస్వతీ కాలువ, కడెం, స్వర్ణ, సదర్మాట్‌ ఆనకట్ట ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో రైతులు బోర్లు, బావులతోపాటు ఆయకట్టు కింద ఇప్పటికే నార్లు పోశారు. నిర్మల్‌ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు ఉండగా.. యా సంగిలో వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. యాసంగిలో ఈ సారి సుమారు 85,607 ఎకరాల్లో వరి వేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 తర్వాత యాసంగి పంటలకు నీరు విడుదల చేయవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నీటిని విడుదల చేసుకోవచ్చని సా గునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు సాగునీటి పారుదలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వారబందీ పద్ధతిలో నీరు విడుదల

ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సీరెస్పీ)లో ఆశించిన మేర నీటి నిల్వలు ఉండడంతో యాసంగిలో వరి సాగుకు ఢోకా లేదు. జిల్లాలో సరస్వతీ కాలువ ద్వారా 38,800 ఎకరాల ఆయకట్టుకు.. సోన్‌, నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌ మండలాలకు నీరు అందుతోంది. ఎస్సారెస్పీ పూర్తి మట్టం 1,0 91అడుగులు(90.313 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1, 091అడుగులు (90.313 టీఎంసీలు) మేర నీటి నిల్వలు ఉండడంతో నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి జూన్‌ 1 నుంచి 361.85 టీఎంసీల వరద నీరు వచ్చి చేర గా.. ఇప్పటి వరకు 227.46 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేకపోగా.. 462 క్యూసెక్కుల నీటిని తాగు నీటి అవసరాలకు వదులుతున్నారు. సరస్వతీ కాలువ కింద ఆయకట్టులో వరి నారు పోయగా.. రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 తర్వాత నీటి విడుదలకు సర్కారు నిర్ణయించడంతో.. ఈ నెల 20-25 మధ్య నీటి విడుదల చేసే అవకాశం ఉంది. వారబందీ పద్ధతిన నీటి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సరస్వతీ కాలువతో 1000 క్యూసెక్కుల నీరు వదులుతుండగా.. ఈ నీరంతా కడెం ప్రాజెక్టులోకి చేరుతోంది.

ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం

కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 695.40 అడుగులు (6.455 టీఎంసీలు) మేర నీరుంది. కడెం ఆయకట్టు కింద 68 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కడెం, దస్తురాబాద్‌, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ఆయకట్టు ఉంది. ఇక కడెం ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే రెండు జిల్లాల రైతులతో సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకోనున్నారు. సారంగాపూర్‌ మండలం స్వర్ణ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి మట్టం 1183 అడుగులు (1.4847 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1180అడుగులు (1.3 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సదర్మాట్‌ ద్వారా ఈ నెల 9 నుంచి 150 క్యూసెక్కులు నీరు కడెం ప్రాజెక్టుకు విడుదల చేయనున్నారు. సదర్మాట్‌ ఆనకట్ట కింద ఖానాపూర్‌, కడెం మండలాల్లో 17 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సదర్మాట్‌ పూర్తి స్థాయి మట్టం 11.5 అడుగులుకాగా.. ప్రస్తుతం 7.5 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.