సోమవారం 25 జనవరి 2021
Nirmal - Dec 06, 2020 , 01:32:42

ట్రిపుల్‌ ఐటీ కొలువుల్లో మేటి

ట్రిపుల్‌ ఐటీ కొలువుల్లో మేటి

  • విద్యార్థులకు వరంగా మారిన విద్యా సంస్థ   
  • ఎస్‌ఎస్‌సీ తర్వాత య ఆరేళ్ల పాటు సమీకృత విద్య 
  • రెండేళ్లు పీయూసీ.. నాలుగేళ్లు  ఇంజనీరింగ్‌ కోర్సు   
  • ఏటా 1500 సీట్ల భర్తీ.. మొత్తం విద్యార్థులు 7500  
  • 50-60 ఐటీ కంపెనీల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు   
  • చదువు పూర్తయ్యేలోగా 60 శాతానికిపైగా ప్లేస్‌మెంట్‌ 
  • పై చదవుల కోసం విదేశాలకు వెళ్తున్న స్టూడెంట్లు   
  •  నైపుణ్యముంటే అద్భుత అవకాశాలు : ఐటీ నిపుణులు

సరస్వతీ అమ్మవారు కొలువు దీరిన బాసరలోని ట్రిపుల్‌ ఐటీ తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యను అందిస్తున్నది. యేటా 1500 మంది విద్యార్థులు తమ ఆరేళ్ల కోర్సు పూర్తి చేసుకుంటుండగా, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో 60 శాతం మందికి పైగా ప్లేస్‌మెంట్‌ లభిస్తున్నది. ఇక మిగతా వారిలో కొందరు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబాయి నగరాల్లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవుతుండగా, మరికొందరు విదేశాలకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే రాబోయే కాలం మొత్తం టెక్నాలజీదేనని, అందులో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందంటున్నారు నిపుణులు.

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : బాసర ట్రిపుల్‌ ఐటీ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తోంది. అందులోనూ ఇంజినీరింగ్‌ విద్యకు వేదికగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఐటీ రంగం మరింత విస్తరిస్తున్నది. ఈ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో ఐటీ దిగ్గజ కంపెనీలు వరదలా వస్తున్నాయి. ఎన్నో ప్రముఖ సంస్థలు తమ సేవలను విస్తృతం చేస్తున్నాయి. మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా తమ తమ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్‌ కోర్సులు చదివిన వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ప్రతిభఉంటే చాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఐటీ ఆధారిత సేవల రంగంలో దేశవ్యాప్తంగా చూస్తే. 40.36 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నట్లు అంచనా. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. 

సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ కోర్సులపై ఆసక్తి

హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు కూడా విస్తరిస్తున్నది. అందులో భాగంగా ఐటీ టవర్లను ఏర్పాటు చేసి, ఉద్యోగావకాశాలను పెంచుతున్నది. దీంతో విద్యార్థులు ఐటీ రంగంవైపు దృష్టి సారిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కరీంనగర్‌, నిజామాబాద్‌లాంటి ప్రాంతాల్లోనూ ఐటీ టవర్లను ఏర్పాటు చేసి.. ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో మూడు ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండగా.. నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాలలో ఒక్కో ఇంజినీరింగ్‌ కాలేజీ ఉండేది. వీటిని హైదరాబాద్‌కు తరలించగా, ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏకైక ప్రముఖ విద్యా సంస్థ ట్రిపుల్‌ ఐటీ బాసరలో ఉంది. ఆరేళ్ల సమీకృత విద్యా విధానం అమలులో ఉండగా, పదో తరగతి పూర్తయ్యాక ఇందులో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. 85శాతం విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వారు ఉండగా, మిగతా వారు ఇతర రాష్ర్టాల వారు ఉంటారు. 

ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 7500 సీట్లు

ఆరేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్‌ కోర్సు అమలు చేస్తుండగా, రెండేళ్ల పాటు పీయూసీ (ఇంటర్‌), నాలుగేళ్ల పాటు బీటెక్‌(ఇంజినీరింగ్‌) కోర్సు ఉంది. ఇక్కడ సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ కోర్సులతో పాటు ఎంఎంఈ, సివిల్‌, మెకానికల్‌ మొత్తం ఆరు రకాల కోర్సులను బోధిస్తున్నారు. పీయూసీలో వచ్చే జీపీఏ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఎక్కువ జీపీఏ వచ్చిన వారికి సీఎస్‌ఈ, ఈసీఈలో అవకాశం లభిస్తోంది. 2008లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయగా, 2 వేల సీట్లతో ప్రారంభించారు. ప్రస్తుతం 7500సీట్లు ఉండగా, యేటా 1500 సీట్లు కొత్తగా భర్తీ చేస్తారు. యేటా 1500 మంది విద్యార్థులు తమ ఆరేళ్ల కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్నారు. ట్రైనింగ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉండగా, సాంకేతిక నైపుణ్యాలు, ప్లేస్‌మెంట్‌ ట్రిక్స్‌, ఇంటర్వ్యూలు ఎలా హాజరు కావాలో నేర్పిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో 60 శాతం ప్లేస్‌మెంట్‌

చివరి సంవత్సరంలో పాసై రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థుల్లో 60 శాతానికిపైగా విద్యార్థులు వివిధ కంపెనీలకు రిక్రూట్‌మెంట్‌ అవుతున్నారు. యే టా ట్రిపుల్‌ ఐటీలో టెక్‌ మహీంద్ర, విప్రో, ఇన్ఫోసిస్‌, క్యాబ్‌ జెమినీ, టీసీఎస్‌వంటి సంస్థలు ప్లేస్‌మెంట్‌ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి. 1500 మంది విద్యార్థుల్లో 1000 మంది వరకు పాస్‌ అవుతుండగా, ఇందులో 500-600 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా విద్యార్థుల్లో కొందరు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబాయి నగరాల్లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక అవుతుండగా, మరికొందరు విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. ఇందులో కొందరు పై చదువులు చదువుతుండగా.. మరికొందరికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

లాక్‌డౌన్‌లో వర్క్‌ ఫ్రం హోం..

కరోనాతో వివిధ రంగాలు కుదేలైనా, ఐటీ రంగం మాత్రం యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగించింది. లౌక్‌డౌన్‌లో ఆఫీసులను మూసివేసినా, ఉద్యోగులను మాత్రం ఇంటి నుంచి పనిచేయించాయి. దేశవ్యాప్తంగా 85 శాతం మంది ‘వర్క్‌ ఫ్రం హోం’ చేసినట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌, సేల్స్‌ఫోర్స్‌, ఇన్ఫోసిస్‌ లాంటివే కాదు అనేక సంస్థలు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ట్విట్టర్‌ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. టీసీఎస్‌ 2025 నాటికి తన ఉద్యోగుల్లో 75 శాతం మందిని కార్యాలయానికి రప్పించాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. రాబో యే 3-5 ఏళ్లలో ఐటీ రంగంలో సుమారు 60 శాతం మంది ఉద్యోగులు తమ ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశముందని ఇటీవలే ఒక ప్ర ముఖ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనివల్ల కొన్ని ఇబ్బందులు న్నా.. కార్యాలయానికి వెళ్లి రావడం, సమయం, ప్రయాణ ఖర్చులు వృథా కావడం వంటివి తప్పుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఇది మేలు చేసే అంశమేనని నిపుణులు భావిస్తున్నారు. సంస్థలకు ఆర్థిక భారం తప్పుతుందని, సిబ్బందికి అనవసర ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. భారం తప్పితే మరెన్నో స్టార్టప్‌ కంపెనీలు మార్కెట్లోకి వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.


ఐటీ వైపే మొగ్గు చూపుతున్నారు..


బాసర : బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలకు యేటా 60కి పైగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. విద్యార్థులు దాదాపు ఐటీ రంగం వైపే మొగ్గు చూపుతున్నారు. మా యూనివర్సిటీలో విద్యార్థులకు కంపెనీల్లో ఉద్యోగాలు ఎలా సాధించాలో విశ్లేషణాత్మకంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నాం. ఇప్పటికే ఈ యేడాది 350కి పైగా విద్యార్థులు వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. త్వరలోనే కంపెనీల్లో ఉద్యోగాల్లో జాయిన్‌ కానున్నారు. 

 - టీపీవో హరిబాబు, బాసర


logo