మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Dec 03, 2020 , 00:20:27

అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు

అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు

  •  200కేజీల గంజాయి స్వాధీనం
  • ఏడుగురిపై కేసు

సోన్‌ : నిర్మల్‌ జిల్లా కేంద్రంగా కొన్ని రోజులుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టు రట్టయింది. సుమారు 200 కేజీల గంజాయిని తరలిస్తున్న వాహనాలతో పాటు మహారాష్ట్రకు చెందిన ఏడుగురిని బుధవారం సోన్‌ మండల పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను  బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. సోన్‌ మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద సోన్‌, మామడ ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి జాతీయ రహదారిపై నిర్మల్‌ వైపు వస్తున్న లారీ, మారుతి స్విఫ్ట్‌ కారులో పూలమొక్కల చాటున గంజాయిని దాచి పెట్టి తరలిస్తున్నారు. పోలీసులు వాహనాల వద్దకు వెళ్లి విచారించారు. లారీలో ఉన్న ముఠా సభ్యులు పూలమొక్కలను అనకాపల్లి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు తీసుకెళ్తున్నామని చెప్పా రు. పూలమొక్కలు, కొబ్బరిమొక్కలు ఎండిపోయి ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వాహనాలను తనిఖీ చేశారు. పూలమొక్కల చాటున ఐదు సంచుల్లో ఉంచిన 200 కేజీల గంజాయిని పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా..

అందులో కూడా గంజాయి లభించింది. వెంటనే ముఠా సభ్యులను ఏడుగురిని పట్టుకొని, కారు, లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలల వ్యవధిలో సోన్‌ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టి  326 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని తెలిపారు. సోన్‌, మామడ ఎస్‌ఐలు ఆసిఫ్‌, వినయ్‌లతో పాటు పోలీస్‌ సిబ్బంది ప్రభాకర్‌, సాయికుమార్‌, సునీల్‌కుమార్‌, గంగయ్య, శంకర్‌, మోహన్‌ను అభినందించారు. వీరికి త్వరలో రివార్డు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo