బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 02, 2020 , 00:31:31

అడ్మిషన్లు ఫుల్‌....

అడ్మిషన్లు ఫుల్‌....

  •  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 12,371 మంది చేరిక
  •  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ముగిసిన ప్రవేశాల ప్రక్రియ
  •  ప్రైవేట్‌ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి  n నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలే నిదర్శనం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 16 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నవంబర్‌ 30తో ప్రక్రియ ముగిసింది. జనరల్‌ కోర్సుల్లో 10,052 మంది, ఒకేషనల్‌ కోర్సుల్లో 2,139 మంది, మొత్తం 12,371 మంది అడ్మిషన్‌ పొందారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తుండడం, పాఠ్యాంశాలతోపాటు ఎంసెట్‌, ఐఐటీ, జేఈఈ వంటి పరీక్షలకు సిద్ధం చేస్తుండడం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తుండడంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

- నిర్మల్‌ అర్బన్‌ 

నిర్మల్‌ అర్బన్‌ : తెలంగాణ సర్కారు కళాశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కార్పొరేట్‌ తరహాలో విద్య అందిస్తుండడంతో పేద విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తున్నది. దీనికితోడు ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా అధ్యాపకులు బోధ న కూడా అందిస్తున్నారు. గ్రూప్‌-1,2,4 వంటి పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించేలా మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాఠ్యాంశాలతోపాటు ఎంసెట్‌, ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఫలితంగా ఖాళీగా దర్శనమిచ్చే సీట్లు ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.

స్వరాష్ట్రంలోనే మహర్దశ..

ఉమ్మడి రాష్ట్రంలో కళాశాలల నిర్వహణ, తరగతి గదుల కొరత, విద్యార్థులకు ప్రాక్టికల్‌ ల్యాబ్‌లు లేకపోవడంతో కళాశాలల్లో చేరేందుకు అనాసక్తి చూపారు. విద్యార్థులు ప్రైవేట్‌  కళాశాల విద్యార్థులతో పోటీ పడక వెనుకంజలో ఉండేవా రు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళాశాలలకు నూత న భవనాల నిర్మాణం, కార్పొరేట్‌ తరహాలో కళాశాలల ని ర్మాణం, ప్రాక్టికల్‌ ల్యాబ్‌లు, క్రీడా స్థలాలు, లైబ్రేరీలు నిర్మించడంతో విద్యార్థులకు తరగతి గదుల కొరతతోపాటు ఇతర ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి. 

పెరిగిన ప్రవేశాలు..

రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలను బలోపేతం చేసేందుకు దశలవారీగా చర్యలు చేపట్టడంతో యేటా చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యాసంవత్సరానికి గాను  ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం కళాశాల అధ్యాపకులు నోటిఫికేషన్‌ జారీ చేశారు.  సెప్టెంబర్‌ 16న అడ్మిషన్ల ప్రక్రి య ప్రారంభం కాగా.. నవంబర్‌ 30తో గడువు ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెగ్యులర్‌లో 12,442 మంది, ఒకేషనల్‌లో 2,378 మంది  కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు.  

నిర్మల్‌ జిల్లాలో 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండ గా.. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గూపుల్లో రెగ్యులర్‌ కోర్సుల్లో 2,152 మంది, ఒకేషనల్‌ గ్రూపుల్లో 403 మంది విద్యార్థు లు అడ్మిషన్లు తీసుకున్నారు. మొత్తం 2,555 మంది విద్యార్థులు చేరారు.

మంచిర్యాల జిల్లాలో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ, మోడల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ కోర్సుల్లో 3,061 మంది, ఒకేషనల్‌ కోర్సుల్లో 870 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 13 ఉండగా.. జనరల్‌లో అడ్మిషన్లు 2,848 మంది, ఒకేషనల్‌లో 334 మంది చేరారు. మొత్తం 3,182 మంది చేరారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇంటర్మీడియెట్‌ కాలేజీలు 11 ఉండగా.. జనరల్‌ కోర్సుల్లో 1991 మంది, ఒకేషనల్‌ కోర్సుల్లో 532 మంది, మొత్తం 2,523 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు.

 సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాము. చదువుతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, విద్యార్థులకు ఆసక్తి ఉన్న విషయాలను తెలుసుకొని వాటిని సాకారం చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. దీంతో ప్రైవేట్‌కు దీటుగా అడ్మిషన్లు వచ్చాయి.

పర్శారం, నోడల్‌ అధికారి, నిర్మల్

జిల్లా జనరల్‌ ఒకేషనల్‌ మొత్తం

-------------------------------------------

ఆదిలాబాద్‌ 2,848 334 3,182

మంచిర్యాల 3,061 870 3,931

నిర్మల్‌ 2,152 403 2,555

ఆసిఫాబాద్‌ 1,991 532 2,523

--------------------------------------------

మొత్తం 10,052 2,139 12,371logo