శనివారం 16 జనవరి 2021
Nirmal - Nov 29, 2020 , 00:39:54

శారీరక దారుఢ్యం పెంచుకోవాలి

శారీరక దారుఢ్యం పెంచుకోవాలి

  • భైంసా డీఎస్పీ నర్సింగ్‌ రావ్‌
  • కుంటాల మండలస్థాయి  వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

కుంటాల : యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని భైంసా డీఎస్పీ నర్సింగ్‌ రావ్‌ సూచించారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో దౌనెల్లి గ్రామంలో శనివారం మండలస్థాయి వాలీబాల్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు చేరువయ్యేందుకు గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్యంతో చదువుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేయాలన్నారు. యువతో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలుపోటములను పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తి నింపేలా పోటీలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. యువత ప్రాథమిక స్థాయి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

మండల స్థాయిలో ప్రతిభ చూపిన వారిని పోలీస్‌ శాఖ అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి 15 జట్లు పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రథమ, ద్వితియ, తృతియ బహుమతులుగా రూ.5వేలు, రూ.2,500, రూ.1116తో పాటు విజేత జట్టుకు ట్రోఫీని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌, సర్పంచ్‌ ఎండీ హైమద్‌, ఉప సర్పంచ్‌ శ్రావణ్‌, స్థానిక నాయకులు ప్రకాశ్‌, నవీన్‌, యూత్‌ సభ్యులు ఎస్‌కే ఖదీర్‌, నరేందర్‌, దిలీప్‌, రవీందర్‌, భూషణ్‌, నరేశ్‌, యూత్‌ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.