మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Nov 28, 2020 , 00:30:57

సాకారం దిశగా సొంతింటి కల

సాకారం దిశగా సొంతింటి కల

  • అర్హులైన వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు
  • నిర్మల్‌ జిల్లాకు  6,686 మంజూరు
  • ఇప్పటికే  మంత్రి స్వగ్రామం ఎల్లపెల్లిలో45  మందికి అందజేత
  • తాజాగా నియోజకవర్గంలో పంపిణీకి సిద్ధం 
  • పట్టణాలు, పల్లెల్లో దరఖాస్తుల స్వీకరణ
  • పరిశీలన పూర్తి.. త్వరలో గ్రామసభల ద్వారా ఎంపిక
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత గృహప్రవేశాలు

రాష్ట్ర సర్కారు ‘డబుల్‌ బెడ్రూం’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతున్నది. ఇప్పటికే మంత్రి అల్లోల స్వగ్రామమైన ఎల్లపెల్లిలో తొలి మోడల్‌ కాలనీ నిర్మించి, 45 మందికి ఇండ్లు అందించింది. తాజాగా నిర్మల్‌ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపడుతుండగా, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయ్యింది. త్వరలో గ్రామసభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనుండగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు  అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ


నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాకు ఇప్పటికే మొత్తం 6686 ఇండ్లు మంజూరు కాగా, ఇందులో గ్రామీణ ప్రాం తాలకు 3426 ఇండ్లు, పట్టణ ప్రాంతాలకు 3260 ఇండ్లు మంజూరు చేశారు. జిల్లాలో నిర్మల్‌ నియోజకవర్గానికి 3761ఇండ్లు, ముథోల్‌ నియోజక వర్గానికి 2240 ఇండ్లు, ఖానాపూర్‌ నియోజక వర్గానికి 685 చొప్పున ఇండ్లు మం జూరయ్యాయి. వీటిలో 878 ఇండ్ల నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో నిర్మల్‌ పట్టణంలో 644 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 234 ఇండ్లు ని ర్మించారు. మిగతా వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉ న్నాయి. నిర్మల్‌ నియోజకవర్గంలో 863 ఇండ్లు పూర్తికాగా, ముథోల్‌ నియోజకవర్గంలో మరో 15 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. నిర్మల్‌ నియోజకవర్గంలో నిర్మల్‌ పట్టణంలో 644 ఇండ్లు పూర్తికాగా, ఆయా మండలాల్లోని వివిధ గ్రామాల్లో 219 ఇండ్లు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి.

మంత్రి స్వగ్రామంలో..

నిర్మల్‌ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదా య శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన స్వగ్రామమైన నిర్మల్‌ మండలం ఎల్లపెల్లిలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల మోడల్‌ కాలనీ నిర్మించారు. ఈ కాలనీలో ముందుగా 45 ఇండ్లు నిర్మించడంతో పాటు అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వలు వేశారు. కాలనీకి విద్యుత్‌ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించారు. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయగా, వీరంతా ఇండ్లలో ఉంటున్నారు. ఇదే కాలనీలో మరో 24 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి.. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచారు. నిర్మల్‌ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కూడా ఇండ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధం చేశారు.

లక్కీ డ్రా ద్వారా పంపిణీ..

నిర్మల్‌ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీకి దరఖాస్తులను కూడా స్వీకరించారు. నిర్మల్‌ అర్బన్‌లో 10,586 దరఖాస్తులు రాగా, రూరల్‌లో 6451 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై తహసీల్దార్లు ఇంటింటికీ తిరిగి పరిశీలన చేశారు. ఈ పథకం నిబంధనల ప్రకారం అర్బన్‌లో 5020 దరఖాస్తు లు, రూరల్‌లో 2778 దరఖాస్తులు అర్హత కలిగి ఉన్నాయని గుర్తించారు. ఈ జాబితాలపై పట్టణాల్లోని వార్డులు, గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మరోసారి పరిశీలన చేశారు. అభ్యంతరాలు స్వీకరించి.. అర్హులైన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఈ జాబితాలను కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ (డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కమిటీ-డీఎల్‌సీ) ఆమోదం తీసుకుంటారు. గ్రామాలు, పట్టణాల్లో నిర్మించిన ఇండ్లకంటే అర్హులు ఎక్కువగా ఉంటే.. వార్డులు, గ్రామాల వారీగా లక్కీ డ్రా తీసి.. డబుల్‌ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత గృహ ప్రవేశాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత డబుల్‌ బెడ్రూం ఇండ్లలోకి గృహ ప్రవేశాలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లోనూ డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా త్వరలో ప్రకటిస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల త ర్వాత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి.. షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా షెడ్యూల్‌ను తయారు చేసి ప్రకటించనున్నారు. అ ర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిబంధనల ప్రకారం డబుల్‌ ఇండ్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరుతుండగా డబుల్‌ ఇండ్ల రాక పట్ల లబ్ధిదారులు ఎంతో సంబుర పడుతున్నారు.



logo