బుధవారం 27 జనవరి 2021
Nirmal - Nov 26, 2020 , 00:48:18

మిల్లింగ్‌.. కష్టమే..!

మిల్లింగ్‌.. కష్టమే..!

  • నిర్మల్‌ జిల్లాలో సగం కూడా పూర్తికాని సీఎంఆర్‌
  • 2019-20 యాసంగిలో 44,685 మెట్రిక్‌ టన్నులు
  • ఇప్పటి వరకు 19,910  మెట్రిక్‌ టన్నుల  లెవీ పూర్తి
  • నెలాఖరుతో ముగియనున్న  గడువు
  • నెల రోజులుగా  ఎఫ్‌సీఐ  గోదాంలు,  ర్యాకుల కొరత

నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ధాన్యాన్ని బియ్యంగా మార్చడంలో మిల్లర్లు బాగా వెనుకబడ్డారు.  2019-2020 యాసంగిలో ఇచ్చిన లెవీ లక్ష్యాలను గడువులోపు చేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెలాఖరుతో కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) గడువు ముగుస్తున్నది.  ఇప్పటివరకు కేవలం 45 శాతం మాత్రమే పూర్తవగా.. ఇంకా 55 శాతం మిగిలి ఉంది. గడువుకు ఐదు రోజులు మాత్రమే ఉంది. జిల్లాలో 44,685  మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా., ఇప్పటివరకు కేవలం 19,910 మెట్రిక్‌ టన్నులు ఇచ్చారు. నెల రోజులుగా ఎఫ్‌సీఐ గోదాంలు, ర్యాక్‌ల కొరత ఉంది. ప్రస్తుతం సమస్య పరిష్కారమైనా.. పీడీఎస్‌కు బియ్యం మిల్లింగ్‌ చేసి ఇవ్వడం కష్టంగానే ఉంది. 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ధాన్యాన్ని  బియ్యంగా మిల్లింగ్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) చేయడంలో రైస్‌ మిల్లర్లు బాగా వెనకంజలో ఉన్నారు. 2019-2020 యాసంగిలో ఇచ్చిన లెవీ లక్ష్యాన్ని మిల్లర్లు గడువులోగా చేరే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు మిల్లర్లు కేవలం 45 శాతం మాత్రమే పూర్తి చేశారు. మరో 55శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు ఇంకా ఐదు రోజులే గడువు ఉంది. జిల్లాలో 44, 685మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లింగ్‌ చేసి ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 19910మెట్రిక్‌ టన్నుల బియ్యమే ఇచ్చారు. గత నెల రోజులుగా ఎఫ్‌సీఐ గోదాంలు, రాక్‌ల సమస్య ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారమైనప్పటికీ తాజాగా పీడీఎస్‌కు బియ్యం మిల్లింగ్‌ చేసి ఇవ్వడం కష్టంగా మారింది. 

నిర్మల్‌ జిల్లాలో ఈ ఏడాది యాసంగి (2019-2020)లో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు రైస్‌ మిల్లర్లకు అప్పగించారు. క్వింటాల్‌ ధాన్యానికి 67 నుంచి 68 కిలోల బియ్యం తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ బియ్యాన్ని ప్రజా పంపిణీ కోసం వినియోగిస్తుంటారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వారికి లెవీ పెడుతుండగా.. ప్రస్తుతం జిల్లాలో మిల్లర్లు లక్ష్యం చేరడంలో బాగా వెనకబడ్డారు. యాసంగి సీజన్‌కు సంబంధించి 44,685 మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లింగ్‌ చేసి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 19,910మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే మిల్లింగ్‌ చేసి ఇచ్చారు. 24,775 మెట్రిక్‌ టన్నుల మేర బియ్యం మిల్లింగ్‌ చేయాల్సి ఉంది.  

ఐదు రోజుల్లో ముగియనున్న గడువు..

యాసంగి సీజన్‌ మొత్తంలో 1541 రాక్‌ల సీఎంఆర్‌ పెట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 687 రాక్‌ల బియ్యం మాత్రమే పెట్టారు. మరో 854 రాక్‌ల బియ్యం మిల్లింగ్‌ చేసి ఇవ్వాల్సి ఉంది.  జిల్లాలో రైస్‌ మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 45 శాతమే పూర్తయింది. వాస్తవానికి నవంబర్‌ నెలాఖరుతో సీఎంఆర్‌ గడువు ముగుస్తున్నది. మరో ఐదు రోజులు లక్ష్యం చేరడం కష్టంగానే ఉంది. మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీ పెడతారు. జిల్లాలో 31 వరకు రైస్‌ మిల్లులు ఉండగా.. యాసంగి సీజన్‌లో కేవలం 9 రైస్‌ మిల్లులకు మాత్రమే సీఎంఆర్‌ లక్ష్యం విధించారు. యాసంగి సీజన్‌లో కేవలం బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే పెడతారు. వానకాలంలో రా రైస్‌ పెడుతుండగా.. అన్ని మిల్లులకు సీఎంఆర్‌ లక్ష్యం విధిస్తారు. జిల్లాలో 9 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉండగా.. యాసంగిలో వీటికి మాత్రమే లక్ష్యాలను నిర్దేశిస్తారు. 

గత నెల రోజుల నుంచి ఎఫ్‌సీఐ గోదాంలు, రైల్వే రాకుల కొరత ఉంది. జిల్లాలో కస్టం మిల్లింగ్‌ రైస్‌ను నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి ఎఫ్‌సీఐకి పంపుతారు. అక్కడ గోదాంల కొరత ఉండడం, రైల్వే ర్యాకుల కొరత ఉండడంతో నెల రోజులుగా మిల్లర్ల లారీలు బియ్యం లోడుతో వేచి చూడాల్సి వచ్చింది. ఒక్కో లారీ 10-15 రోజుల పాటు రోడ్డుపైనే నిలిచి ఉన్నాయి. దీంతో మిల్లర్లకు ఒక్కో లారీకి రోజుకు రూ.5-10వేల వరకు ఆర్థికంగా భారం పడింది. దీంతో ఒక్కో లారీకి రూ.50వేల నుంచి 60వేల వరకు నష్టం భరించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎఫ్‌సీఐ గోదాంలు, రైల్వే రాకుల సమస్య తీరిపోయింది. దీంతో లారీలను వెంటనే ఖాళీ చేసి పంపిస్తున్నారు.

ప్రతి నెలా 4  వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం..

కొవిడ్‌ నేపథ్యంలో నవంబర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ అందిస్తున్నది. ఒక్కో యూనిట్‌కు 10 కిలోల చొప్పున (డబుల్‌ రేషన్‌) ఇస్తున్నారు. సాధారణంగా ఒక్కో యూనిట్‌కు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తుండగా.. ప్రస్తుతం రెట్టింపు రేషన్‌ ఇస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు ఉచిత రేషన్‌.. రెట్టింపు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో 2.04లక్షల రేషన్‌ కార్డులకు ప్రతి నెలా 4 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉన్నది. యూనిట్‌కు 10 కిలోల చొప్పున బియ్యం ఇస్తే.. ప్రతి నెలా జిల్లాకు 7 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉన్నది. ఇప్పటికే ప్రతి నెలా 5 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పీడీఎస్‌కు అవసరం ఉందని.. ఆ మేరకు సరఫరా చేయాలని ఫౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లకు సూచించారు. logo