సోమవారం 25 జనవరి 2021
Nirmal - Nov 21, 2020 , 02:00:44

పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం

పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు
  • దానిమ్మ, అరటి, జామ, బొప్పాయి తోటల పెంపకానికి సబ్సిడీ అందజేత
  • ఇప్పటికే ఉద్యానవన శాఖకు నిధులు 

  • రాయితీపై ట్రాక్టర్లు మంజూరు

సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికిగాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో పెంపకానికి సంబంధించిన సబ్సిడీ నిధులను ఉద్యానవనశాఖకు విడుదల చేసింది. జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ పెంపకానికి ప్రణాళికలు రూపొందించగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు 80 శాతం, మిగతా వారికి 20 శాతం యూనిట్లు మంజూరు చేయనున్నది. మరోవైపు రాయితీపై జిల్లాకు 5 ట్రాక్టర్ల చొప్పున అందించనున్నది. - నిర్మల్‌ టౌన్‌

నిర్మల్‌ టౌన్‌ : సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వనుంది.  ఈ మేరకు 2020-21 సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 హెక్టార్లు(వెయ్యి ఎకరాలు)లో తోటల పెంపకానికి సబ్సిడీకి సంబంధించిన ఉద్యానవన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో పత్తి, వరి, సోయా, పసుపు, జొన్న, పప్పు దినుసు పంటలు, వరి, గోధుమ తదితర పంటలు సాగుచేస్తున్నారు. అధిక వర్షాలు, తెగుళ్ల బారిన పడి దిగుబడి రాక చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.మరోవైపు ప్రతి యేటా పెట్టుబడి పెరుగుతూ వస్తున్నది. ప్రత్యామ్నాయ పంటలైన పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించేందుకు రైతులకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు వచ్చింది. ఇక్కడి భూముల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా ఏ పండ్ల తోటలు అనుకూలమో అధికారులు సూ చించనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పండ్ల తోటల పెంపకంపై జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఉద్యాన వన, వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పరిపాలన అనుమతులు తీసుకున్నారు.

హెక్టార్‌ భూమిలో తోట పెంపకానికి అందించే సబ్సిడీ  

   యూనిట్‌ విలువ సబ్సిడీ

జామ    రూ.73,330 రూ.29,330 

దానిమ్మ     రూ.66,680 రూ.26672 

అరటి    రూ.1,02462 రూ.40,985 

బొప్పాయి   రూ .60,000 రూ.30,000

ఉమ్మడి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పెంచేందుకు ప్రణాళిక

నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలో 100 హెక్టార్ల చొప్పున వివిధ పండ్ల తోటలు సాగు చేసేందుకు నిర్ణయించారు.  ఒక్కో జిల్లాలో 25 హెక్టార్లలో జామ, 35 హెక్టార్లలో అరటి, 35  హెక్టార్లలో బొప్పాయి, 5 హెక్టార్లలో దానిమ్మ తోటలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు 80 శాతం, మిగతా వారికి 20 శాతం యూనిట్లు మంజూరు చేస్తారు. ఇందుకోసం జిల్లా స్థా యిలో కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వీరు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు.  జామ హెక్టార్‌కు 111 మొక్కలు, దానిమ్మ 666, అరటి 3086, బొప్పాయి 3086 మొక్కలు నాటాల్సి ఉంటుంది. 

విడుతల వారీగా సబ్సిడీ విడుదల 

జామ తోటకు మొదటి విడుత కింద రూ.17,600, రెండు, మూడు విడుతల్లో రూ. 5865 చొప్పున, దానిమ్మ తోటకు మొదటి విడుతలో రూ.16,003, రెండు, మూడు విడుతల్లో రూ.5334 చొప్పున, అరటితోటకు మొదటి విడుతలో రూ.30,739, రెండో విడుతలో రూ.10,246 విడుదల చేయనున్నారు. బొప్పాయికి మొదటి విడుతలో రూ. 22,500, రెండో విడుతలో రూ. 7,500 సబ్సిడీని రైతు ఖాతాల్లో  పభుత్వం జమ చేయనుంది. 

ట్రాక్టర్ల కొనుగోలుకు రుణం, సబ్సిడీ

ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో జిల్లాకు 5 ట్రాక్టర్ల చొప్పున సబ్సిడీ పై మంజూరు చేయనుంది. ఇందులో ఎస్సీలకు 2, ఎస్టీ 1, బీసీలకు 2 ట్రాక్టర్లను అందించనున్నారు. రూ. 4 లక్షల విలువ యూనిట్‌ గల ట్రాక్టర్‌కు ప్రభుత్వం రూ. 75వేల సబ్సిడీ అం దించనుంది. మిగతాది బ్యాంకు రుణం ద్వారా  అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈజీఎస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ పథకాల కింద పండ్ల తోటలు సాగు చేసిన రైతులకు ఈ పథకంలో అవకాశం లేదని, కొత్త రైతులనే ఎంపిక చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది. 

దరఖాస్తు చేసుకోండి..

ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లా లో పండ్ల తోటలు సాగు చేసుకోవాలనుకునే రైతులు వ్యవసాయ పాస్‌పుస్తకం, ఆధా ర్‌ కార్డు, బ్యాంకు ఖాతా, సాగు భూమి వివరాలు, మోటార్‌ సర్వీస్‌ నంబర్‌తో పూర్తిగా అన్ని పత్రాలతో మీ సేవా కేంద్రంలో డిసెంబర్‌ 31 దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించాలి. 

-జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌ బాబుlogo