మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 20, 2020 , 01:13:07

ఓటరు నమోదుకు చాన్స్‌

ఓటరు నమోదుకు చాన్స్‌

  •  ఈ నెల 21, 22 తేదీల్లో స్పెషల్‌ డ్రైవ్‌
  •  జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారుల చర్యలు  

నిర్మల్‌ టౌన్‌ : ఓటు హక్కును పొందేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. జనవరి 1, 2021 నాటికి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. ఎన్నికల కమిషన్‌ 2021 ముసాయిదా జాబితాను సోమవారం విడుదల చేసి ఓటరు నమోదుపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది నియోజకవర్గాలున్నాయి. 

మొత్తం 20,86,812 మంది ఓటర్లు ఉన్నారని, ఆదిలాబాద్‌ జిల్లాలో 41,88,50, మంచిర్యాల జిల్లాలో 58,70,64, నిర్మల్‌ జిల్లాలో 67,68,48, కుమ్రంభీం జిల్లాలో 40,38,59 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదాలో పేర్కొన్నది.  జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా ఓటరు నమోదు కోసం ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో స్పెషల్‌ డ్రైవ్‌ను బీఎల్‌వోల సమక్షంలోనిర్వహించనున్నారు. ఇందుకు ఆయా తహసీల్దార్లు బీఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు తదితర జాబితా సవరణపై సూచనలు ఇచ్చారు. జాబితాలో సవరణకు నిమగ్నమవుతున్నారు. 

పకడ్బందీగా ఓటరు నమోదు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లో ఓటరు నమోదు, జాబితాలో తప్పొప్పుల సవరణ, చనిపోయిన ఓటర్ల తొలగింపు, పోలింగ్‌ బూత్‌ల మార్పిడి, తదితర పనుల్లో  బీఎల్‌వోలు  నిమగ్నమయ్యారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓటరు నమోదు, మార్పులు,చేర్పులు ముసాయిదా సవరణపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైట్‌ ఫొటోలతో ఫారం నంబర్‌ 6ను పూర్తి చేసి పోలింగ్‌ బూత్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు కూడా ఆన్‌లైన్‌లో ఫారం 6(ఏ)లో వివరాలను  నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఫారం నంబర్‌ 7 ద్వారా ఓటరు జాబితాలో పేర్లుండి చనిపోయినట్లయితే వాటిని దరఖాస్తు చేస్తే వాటిని తొలగించాలి. ఫారం 8 ద్వారా ఓటరు జాబితాలో పేర్లు, తండ్రి పేరు, ఇతర తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి.  8 ఎ ద్వారా పోలింగ్‌ కేంద్రంలో మార్పుల గురించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని సూచించారు.