గురువారం 28 జనవరి 2021
Nirmal - Nov 19, 2020 , 01:59:50

చెరువుల్లో ఆక్రమణలకు చెక్‌..

చెరువుల్లో ఆక్రమణలకు చెక్‌..

  • నిర్మల్‌లో గొలుసుకట్టు చెరువులపై మూడు శాఖల సమగ్ర సర్వే    
  • పైలెట్‌ సర్వే కింద కంచెరోని చెరువు పూర్తి
  • దశలవారీగా మరో 13 చెరువులపై అధికారుల దృష్టి  
  • 100 ప్లాట్లు, రెండు ఇండ్ల యజమానులకు నోటీసులు

నిర్మల్‌ టౌన్‌: నిమ్మలనాయుడి కాలంలో ని ర్మించిన చెరువులో ఆక్రమణలపై జిల్లా అధికారు లు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఓ చెరువు లో ఆక్రమణలపై కోర్టు జోక్యం చేసుకోవడంతో క లెక్టర్‌ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పట్టణంలోని అన్ని చెరువుల్లో ఆక్రమణలను గుర్తిస్తున్న అధికారులు వాటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించారు. నిర్మల్‌ చుట్టూ మొత్తం 13 గొలుసుకట్టు చెరువులు ఉండడంతో చెరువు లో ప్రతియేటా  ఆక్రమణలు పెరుగుతూ నివాస స్థలాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న చెరువు శిఖం భూ ముల్లో కొందరు పాత డాక్యుమెంట్ల పేరిట అధికారులను తప్పుదోవ పట్టించి, అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఐదా రేండ్ల నుంచి చెరువు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు జరగడంతో జిల్లా అధికారులు దీనిపై సీరియస్‌గా తీసుకొని జాయింట్‌ సర్వే నిర్వహిస్తున్నారు. పట్టణంలోని  కంచెరోని చెరువు, గొల్లపే ట్‌, మోతీతలాబ్‌, పల్లె చెరువు, మంజులాపూర్‌ చెరువు, తంబాకుదుబ్బ, జాఫర్‌ చెరువు, తదితర చెరువుల్లో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఈ చెరువులు నీటిపారుదలశాఖ ఆ ధీనంలో ఉండగా, రెవెన్యూశాఖ భూరికార్డులను అనుసరిస్తూ రెవెన్యూ, ల్యాండ్‌రికార్డు సర్వే, నీటిపారుదలశాఖ, మున్సిపల్‌శాఖ సంయుక్తంగా చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టాయి.

కంచెరోని కట్టలో ఆక్రమణలు

నిర్మల్‌ పట్టణంలో మొట్టమొదటిసారిగా కంచెరోని చెరువును పైలట్‌ సర్వే కింద ఎంపిక చేయడంతో పూర్తిస్థాయిలో ఆక్రమణలను గుర్తించినట్లు జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. చెరువు మొత్తం 46 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. శిఖం భూముల్లో ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) ఆధారంగా చెరువు సరిహద్దులో ఉన్న భూ ముల్లో అక్రమంగా ప్లాట్లు, ఇండ్లు, వెంచర్లు ఉన్నవాటిని గుర్తించారు. మొత్తం వంద ప్లాట్లు, రెండు ఇండ్లు, ఒక వెంచరు చెరువు శిఖం భూముల్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఆక్రమించినవారికి డిమాండ్‌ నోటీసులను అందించారు. నోటీసులకు సరైన  సమాధానం రాకుంటే, వాటిని మరో వారం రోజుల్లో కూల్చివేసి ధ్వంసం చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించబోతుంది. అదే విధంగా చెరువులో ఉన్న నీటి సామర్థ్యం ఆనుకొని వంద మీటర్లు ఉన్న భూములను బఫర్‌ జోన్లుగా గుర్తించారు. ఈ భూముల్లో కూడా ఎలాంటి ఆక్రమణలు లేకుండా అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా ల్యాండ్‌ రికార్డు సర్వే, తహసీల్దార్‌, నీటిపారుదలశాఖ, మున్సిపల్‌ శాఖ అధికారులు వారం రోజులుగా సర్వే నిర్వహించి నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌ కు అందించినట్లు తెలుస్తోంది. 

మిగతా చెరువులపై దృష్టి..

నిర్మల్‌ పట్టణంలోని శివారు ప్రాంతంలో ఉన్న చెరువులో ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు అన్ని చర్యలను తీసుకుంటున్నారు. కంచెరోని కట్టలో అక్రమాలు బయటపడడంతో మి గ తా చెరువులను కూడా అదేస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. రెండు రోజుల్లో మంజులాపూర్‌ చెరువులో సర్వే నిర్వహించేందుకు కసరత్తు చేస్తు న్నారు. అదే విధంగా మిగతా చెరువుల్లో త్వరలో నే సర్వే నిర్వహించనున్నారు.

చెరువుల రక్షణకు ట్రంచ్‌ల ఏర్పాటు..

నిర్మల్‌ పట్టణంలోని చెరువులు ఆక్రమణకు గు రి కాకుండా అధికారులు ఇక నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సర్వే పూర్తయిన చెరువులో శిఖం భూముల సరిహద్దులను గుర్తించి సరిహద్దు బండరాళ్లను ఏర్పాటు చేస్తున్నా రు. చుట్టూ జేసీబీ సాయంతో ట్రంచ్‌లను ఏర్పా టు చేస్తున్నారు. భూమిని ఆనుకొని బోర్డులను ఏ ర్పాటు చేసి ఈ భూమి ప్రభుత్వ శిఖం భూముల ని, దీన్ని ఎవరూ ఆక్రమించినా చట్టపరమైన చర్య లు తీసుకుంటామని బోర్డులు ఏర్పాటు చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెరువులో ఆక్రమణలు తొలగిస్తే ప్రభుత్వ భూమిని కాపాడుకోవచ్చని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 

ఆక్రమణలను గుర్తిస్తున్నాం..

నిర్మల్‌ పట్టణంలోని గొలుసుకట్టు చెరువుల్లో ఆక్రమణలపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కంచెరోని కట్టను పైలట్‌ సర్వే కింద ఎంపిక చేసి అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. వంద ప్లాట్లు, రెండు ఇండ్లు శి ఖం భూముల్లో ఉన్నట్టు గుర్తించి వారికి డిమాండ్‌ నోటీసులను అందించాం. 

 -సుభాష్‌చందర్‌, తహసీల్దార్‌


logo