శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Nov 14, 2020 , 02:06:51

అన్నింటికీ ధరణి

అన్నింటికీ ధరణి

  • రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ అన్నీ ఒకేచోట
  • మొబైల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం
  • అరగంట వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి
  • జోరుగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు 
  • పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు
  • అన్నదాతలకు తీరిన భూసమస్యలు

ధరణి పోర్టల్‌.. అన్నింటికీ ఆధారంగా మారింది. సులభతర, పారదర్శక సేవలకు వేదికైంది. అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుండగా రైతాంగం సంబురపడుతున్నది. వ్యయప్రయాసలు, దూర భారం, అక్రమాలకు తావులేకుండా వేగంగా పని పూర్తవుతుండగా, ఇంటి వద్ద నుంచే మొబైల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కలిగింది. ఇన్నాళ్లకు అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించగా, సర్కారు తెచ్చిన ఈ పోర్టల్‌పై సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లాలోని అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరందుకోగా, ఆయా చోట్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్తున్నది. 

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ

 నిర్మల్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ రాకతో రైతులకు మేలు చేకూరుతున్నది. తహసీల్‌ కార్యాలయంలో అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ కూడా పూర్తి చేస్తుండడంతో, రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. దూరభారం, వ్యయప్రయాసలు, కాలయాపన, లంచాల బెడద లేకుండా.. పారదర్శకంగా, పకడ్బందీగా, వేగంగా, సరళంగా, సులభంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. అన్నదాతలకు భూసమస్యలు తీరగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సుమారు 2వేల వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయగా, అరగంట వ్యవధిలోనే ప్రక్రియ పూర్తవడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మొబైల్‌ ఫోన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించగా, మరుసటి రోజున అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ చేసి ఇస్తున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రైతాంగం ధరణి పోర్టల్‌, తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఎలాంటి సమస్యలు, కష్టాలు లేకుండా.. రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. పాత పట్టాదారు పాసు పుస్తకాల్లో మార్పులు చేసి ఇస్తుండగా, కొత్తవాటిని పోస్టులో పంపిస్తున్నారు. అన్ని సమస్యలకూ ధరణి పోర్టల్‌ చెక్‌ పెట్టిందని రైతులు చెబుతున్నారు.

రైతులు సంబురపడుతున్నరు..

నిర్మల్‌ టౌన్‌: ధరణి రాకతో రైతులు సంబురపడుతున్నరు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిమిషాల వ్యవధిలోనే భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయితున్నయి. అంతా మాయలా ఉందని గ్రామాల్లో రైతులు చర్చించుకుంటున్నరు. గతంలో తహసీల్‌ ఆఫీసుల్లో కొన్ని కారణాలతో పనులు లేటయ్యేటివి. ఇప్పుడా పరిస్థితి లేదు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకపోవడంతో, ఇబ్బందులన్నీ పోయినయ్‌. మీసేవకు వచ్చినవారు ధరణి పోర్టల్‌ గురించి అన్నీ అడిగి తెలుసుకుంటున్నరు. స్లాట్‌ బుక్‌ చేసేముందుకు వారికి పూర్తి స్థాయిలో చెబుతున్నం. మీసేవకు వచ్చే వారికి పది నిమిషాల్లోనే స్లాట్‌ బుక్‌ చేసి ఇస్తున్నం. దీంతో రైతులు సంతోషంగా ఇంటికి వెళ్తున్నరు. వారికి కేటాయించిన సమయానికి తహసీల్‌కు పోయి పని చేయించుకుంటున్నరు. స్లాట్‌ బుకింగ్‌ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా ఓపికగా వేచి చూస్తున్నరు. ప్రభుత్వం తీసుకచ్చిన ధరణి పోర్టల్‌ అందరికీ పని భారం తగ్గింది. గతంలోల ఇబ్బందులు పడే పని లేదు. సులభంగా వారి భూములు వారి పేరిట మారుతున్నయి. 

-పవన్‌కుమార్‌, మీ సేవ కేంద్రాల నిర్వాహకుల అసోసియేషన్‌ నిర్మల్‌జిల్లా అధ్యక్షుడు logo