మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 13, 2020 , 02:01:18

పౌర సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి

పౌర సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి

  • భైంసా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా   
  • ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి

భైంసా : భైంసా పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌర సేవా కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సూచించారు. పౌరసేవా కేంద్రంతో పాటు కూరగాయల వ్యాపారుల దుకాణా సముదాయాలు, మున్సిపాటీ వాహనాలను గురువారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో కలిసి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భైంసాలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవా కేంద్రంలో జనన, మరణ, మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని  ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చని తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు సమారు రెండున్నర కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణకు 9 ఆటోలు, 1 స్వీపింగ్‌ మిషన్‌, తదితర యం త్రాలు, పరికరాలు కొన్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ స్థలంలో కూరగాయల వ్యాపారులకు 8 దుకాణా సముదాయలను నిర్మించి,  ప్రతి నెలా రూ. 600కు అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. ప్రధాన కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం కింద సుమారు 50 మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాన్ని మంజూరు చేయించామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మాట్లాడుతూ నిర్మల్‌ జిల్లాలో మొదటి సారిగా పౌరసేవా కేంద్రాన్ని భైంసా మున్సిపాలిటీలో ప్రారంభించామని, ఈ కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాబీర్‌ హైమద్‌, ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు, కమిషనర్‌ ఖదీర్‌, ఆర్డీవో రాజు, తహసీల్దార్‌ నర్సయ్య, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బామ్ని రాజన్న, పోతారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, రాము, ఆసిఫ్‌, ఫారూఖ్‌, మంత్రి భోజారాం తదితరులు పాల్గొన్నారు.