సోమవారం 18 జనవరి 2021
Nirmal - Nov 13, 2020 , 02:01:26

ఎనీవేర్‌ మేలు

ఎనీవేర్‌ మేలు

  • ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలి..
  • దూరం, వ్యయం తగ్గుదల.. సమయం కలిసొచ్చే చాన్స్‌
  • ప్రభుత్వం పరిశీలించాలంటున్న  ప్రజలు, రైతులు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ధరణి సేవలపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్‌ ద్వారా తహసీల్‌ కార్యాలయాల్లో పారదర్శకంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నది. దీంతో ప్రజలకు లంచాల బెడద లేకుండా.. అర గంట వ్యవధిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తవుతున్నది. రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ కూడా చేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వం ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తే సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఆయా మండల తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నది. ప్రస్తుతం రోజూ పది రిజిస్ట్రేషన్లకు స్లాట్‌బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తే ధరణి  పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలోని ఏ తహసీల్‌ కార్యాలయంలోనైనా.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. స్థానిక తహసీల్‌ ఆఫీసులోనే కాకుండా.. ఏ మండలంలోని తహసీల్‌ కార్యాలయంలోనైనా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సౌకర్యం ప్రజలకు కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది..

బిడ్డకు ఎకరం రాసిచ్చిన..

నాకు నలుగురు వారసులు. అందరికీ సమానంగా వ్యవసాయ భూములను పంచాలని అనుకున్న. నా బిడ్డ విజయకు కూడా గతంలో మాట ఇచ్చినట్లుగా మస్కాపూర్‌ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నఎకరం భూమిని సంతోషంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిన. రిజిస్ట్రేషన్‌ కోసం ఒంటి గంటకు ఖానాపూర్‌ తహసీల్‌ ఆఫీసుకు వచ్చిన. అధికారులు అన్ని అడిగిన్రు. వివరాలన్నీ తెలుసుకున్నరు. నాది, నా కూతురుది, ఇద్దరు సాక్షుల సంతకాలు తీసుకున్నరు. మా అందరి పొటువలను కంప్యూటర్లకు ఎక్కించిన్రు. 20 నిమిషాల్లోనే పత్రాలు సిద్ధం చేసి, నా పేరిట ఉన్న భూమిలో ఒక ఎకరం నా బిడ్డకు బదలాయించిన్రు. మ్యుటేషన్‌ కూడా చేసి తహసీల్దార్‌ నరేందర్‌ సారు దస్తావేజు పత్రాలను ఇచ్చిన్రు. నాకైతే చాలా సంబురమనిపించింది. ఇంత జప్పన పని అయితదనుకోలె. నా బిడ్డ కూడా మస్తు సంతోష పడ్డది. అదెదో ధరణి పోర్టల్‌ అంట .. మంచిగున్నది. కేసీఆర్‌ సారు ఏది జేసిన పేదోళ్లకు, రైతులకు మంచే చేస్తున్నడు. గిట్ల చేసిండు కాబట్టే రైతులంతా ఆయన్ను దేవుడంటున్నరు. 

-ఆకుల గురవయ్య, మస్కాపూర్‌, ఖానాపూర్‌

దూరమున్నోళ్లకు సౌలత్‌ ఉండాలె..

ఖానాపూర్‌ : ధరణితో గతంలో కంటే చాలా సునాయాసంగానే పనులవుతున్నాయ్‌. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులకు రిజిస్ట్రేషన్లు తహసీల్‌ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. మధ్య దళారీలు లేరు.. డాక్యుమెంటు రైటర్లు లేరు.. మీ సేవలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని నేరుగా తహసీల్‌ కార్యాలయానికి పోతే నిమిషాల్లోనే పని అయిపోతున్నది. కొన్ని కారణాలతో భూములు కొనుగోలు చేసిన రైతులు.. వారి సొంత మండలాలకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేని పరిస్థితులుంటాయి. పట్టణాల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటికి దూరంగా ఉంటున్న వారు రిజిస్ట్రేషన్‌ కోసం సొంత మండలానికి రావడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. భూములు అమ్మినవారు తాము ఉన్న చోటికే వస్తే తమకు అందుబాటులో ఉన్న తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌలత్‌ కల్పిస్తే బాగుండేది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుండడంతో వాళ్ల భూముల రికార్డు అంతా ధరణి పోర్టల్‌లో ఉండనే ఉంది. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలని కోరుతున్న.

- ఐనవేని నడిపి నర్సయ్య, రైతు, మస్కాపూర్‌

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న..

నిర్మల్‌ అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందుకోసం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్న. ఈ సామాజిక మాధ్యమాలతో స్థానిక ప్రజలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలు, ఇతర దేశాల వారికి ఇక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. ధరణి అందించే సేవలను వివరిస్తూనే, ప్రజలకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మొదలు పెట్టిన ఈ కార్యక్రమంపై సోషల్‌ మీడియా ద్వారానే నిత్యం ప్రచారం చేస్తున్నా.           - ఆదుముల్ల హరీశ్‌, నిర్మల్‌ 

పని చాలా సులువైంది..

లోకేశ్వరం : గతంలో రిజిస్ట్రేషన్లతో ఇప్పుడున్న ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ను పోల్చుకుంటే పని చాలా సులువైంది. అప్పట్లో సబ్‌ రిజిస్ట్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసి తహసీల్‌ కార్యాలయంలో మ్యుటేషన్‌ చేసేది. దీంతో కాలయాపన అయ్యేది. కానీ ధరణితో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకే చోట జరుగుతుండడంతో అరగంటలోనే ప్రక్రియ పూర్తవుతున్నది. దీంతో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు తొమ్మిది రిజిస్ట్రేషన్లు చేశాం. గతంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక డాక్యుమెంట్లు వచ్చేందుకే మూడు నుంచి నాలుగు రోజులు పట్టేది. తర్వాత మ్యుటేషన్‌ కోసం రెండు, మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చేది. ధరణి పోర్టల్‌ ద్వారా వెంటనే పత్రాలు చేతికి వస్తున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోర్టల్‌తో అధికారులకు పని భారం చాలా వరకు తగ్గింది.   

- వెంకటరమణ, తహసీల్దార్‌(లోకేశ్వరం)

వెంటనే పత్రాలు అందుతున్నయ్‌..

లోకేశ్వరం : అప్పట్లో భూములు రిజిస్ట్రేషన్‌ కావాలంటే ఐదారు నెలలు పడుతుండే. ఇప్పటి ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు వెంటనే అవుతున్నాయి. ఒక్కటే కాడ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతున్నయ్‌. పని అయిపోయిన పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పత్రాలు చేతికిస్తున్నరు. ఈ పద్ధతి మంచిగున్నది. తెలిసినోళ్లకు, తెలియనోళ్లకు, ఎవరికైనా ఈ పద్ధతి సులభంగా ఉంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

- రామోల్ల రమేశ్‌, రైతు(లోకేశ్వరం)

రేషన్‌ తీసుకుంటున్నట్లు..  రిజిస్ట్రేషన్‌ కూడా చేయాలె..

చెన్నూర్‌ : నేను మావూరి ఆయన అంగ ఓదెలు దగ్గర ఐదారు రోజల కింద సర్వే నంబర్‌ 72/అలో 22 గుంటల భూమిని కొనుకున్నా. పాత లెక్క మంచిరాలకు పోవుడు లేదని, మన తాసీల్‌ ఆఫీసుకు పోతే పని అయితదని మా ఊరోళ్లే చెప్పిన్రు. ముందుగాల మీసేవలో పేర్లు, భూమి లెక్కలు కంప్యూటర్‌లో కొట్టించుకోవాలన్నరు. వాళ్లు చెప్పినట్టు మంగళవారం మీసేవకు పోయిన. అక్కడ ఎంబటే కంప్యూటర్‌లో వివరాలు కొట్టి కాగితాలు నాకిచ్చి తాసీల్‌ ఆఫీసుకు పోమ్మన్నరు. ఈ కాగితాలు పట్టుకొని నేను, అమ్మినాయన, సాక్షులం బుధారం తాసీల్‌ ఆఫీసుకు పోయినం. తాసీల్దార్‌ను కలిసినం. మేము పొద్దుగాల్నే పోవడంతో ఎవరూ లేరు. మా కాగితాలు చూసిన తాసీల్దార్‌ కంప్యూటర్‌లో మా ఏలి ముద్రలు, ఫొటోలు తీసుకొని పని అయిపోయిందని చెప్పిన్రు. నాకు ఇప్పటికే మా ఊళ్లో భూమి,. పట్టాదార్‌ పాసు పుస్తకం ఉంది. నాకున్న పాసు పుస్తకంలనే ఇప్పుడు కొన్న భూమిని ఎక్కించిన్రు. రిజిస్ట్రేషన్‌ కాగితాలు ఇచ్చి పొమ్మన్నరు. అరగంటల్నె పని అయిపోవుడు అల్కగనిపించింది. సీఎం కేసీఆర్‌ సార్‌ పది పదిహేను రోజుల క్రితం కొత్తగా ఈ పద్ధతి పెట్టడం మంచిగుంది. ఇప్పుడు కంట్రోల్‌ బియ్యం తీసుకుంటున్నట్లు.. భూమి యాడకొన్నా ఏ మండలంల ఆఫీసులన్నా రిజిస్ట్రేషన్‌ చేసుకునేటట్టు చేస్తే ఇంకా అల్కగుంటది. ఒక్కోపారి ఒకే దినంల బాగా రిజిస్ట్రేషన్లుంటే ఆల్చమైతది. అప్పడు ఇంకో తాసిల్‌ ఆఫీసుకు పోయి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అక్కడ జల్ది పని చేసుకొని ఇంటికి రావచ్చు. మనకిష్టమచ్చిన మండలంల రిజిస్ట్రేషన్‌ చేసుకునేటట్టు సీఎం కేసీఆర్‌ సార్‌.. చేస్తే ఇంకా మంచిగుంటది.                                  - అంగ మల్లయ్య, రైతు, లింగంపల్లి, చెన్నూర్‌