నల్ల వరి.. ఆరోగ్య సిరి

- బ్లాక్ రైస్ సాగుపై దృష్టి పెట్టిన పలువురు రైతులు
- నిర్మల్ జిల్లాలో నలుగురి క్షేత్రాల్లో విజయవంతంగా సాగు
- సోన్, నిర్మల్, దస్తురాబాద్ మండలాల రైతులు
- వంద రోజుల్లో కోత దశకు..
- ఆన్లైన్లో ఆర్డర్ ద్వారా విత్తనాలు తెప్పించిన సోన్ రైతు
సోన్: కొత్త పంట.. ఆపై శాస్త్రీయ సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సోన్కు చెందిన ఈ యువరైతు నమ్మాడు. అనుకున్నదే తడవుగా జిల్లాలోనే మొదటిసారిగా బ్లాక్ రైస్ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఇక్కడి మార్కెట్లో లభించని ఈ నల్ల వరిని ప్రయోగత్మాకంగా మొదలు పెట్టి, సక్సెస్ అయ్యాడు. సోన్ మండల కేంద్రానికి చెందిన కంచెరి సుమేశ్ది వ్యవసాయ కుటుంబం. మొదట వ్యవసాయానికి అనుబంధంగా డెయిరీ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల శిక్షణ తీసుకున్నాడు. ఇదే సమయంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. ఈ వానకాలం సీజన్లో వినూత్న సాగు చేపట్టాలని అనుకున్నాడు. ఓ దినపత్రికలో వచ్చిన నల్ల వరి సాగు వార్తపై ఆయన దృష్టి పడింది. దిగుబడులు, లాభాలు, ఆరోగ్యానికి మేలు గురించి తెలుసుకున్నాడు. తాను కూడా సాగు చేయాలని అనుకున్నాడు. వెంటనే సెల్ఫోన్లో ఇందుకు సంబంధించిన సమాచారంపై శోధించాడు. అస్సాంలో ఈ పంట ఎక్కువగా సాగవుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అక్కడ సాగు చేస్తున్న వారి ఫోన్ నంబర్లను సాధించాడు. అక్కడి వారితో మాట్లాడి నల్ల వరి సాగు నైపుణ్యాన్ని తెలుసుకున్నాడు. విత్తనాలను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి, ఢిల్లీ నుంచి తెప్పించాడు. తనకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో ఒక ఎకరం నల్ల వరి సాగు మొదలు పెట్డాడు. మిగతా మూడు ఎకరాల్లో మన వరి సాగుతో పాటు మక్క, ఇతర పంటలను వేశాడు. నల్ల వరి 95-110 రోజుల్లో కోతకు వస్తుందని వ్యవసాయశాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నాడు. వారి సూచనలు పాటిస్తూ పైరుకు కావాల్సిన సేంద్రియ ఎరువులతో పాటు మందులను పిచికారీ చేశాడు. ప్రస్తుతం వరి పంట గొలక దశలో ఉంది. మరో 15 రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోనే మొదటి సారిగా నల్ల వరి సాగు చేసి, అందరితో శభాష్ అనిపించుకున్నాడు. పలువురు వ్యవసాయ శాఖ అధికారులు కూడా సుమేశ్ను కలిసి, పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అక్కడ చూశా.. ఇక్కడ మొదలుపెట్టా..
చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అందుకే సాగులో సరికొత్త మెళకువలు నేర్చుకుంటున్నాను. పంట మార్పిడి విధానం ద్వారా ఎంతో మేలు ఉంటుంది. ఏపీలోని అనంతపూర్ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై జడ్బీఎన్ఎఫ్ (జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్) ద్వారా శిక్షణ ఇస్తున్నాను. అక్కడి రైతులు కొందరు నల్ల వరి ధాన్యం సాగు చేస్తున్న విషయాన్ని చూశాను. ప్రయోజనాలను అడిగి తెలుసుకొని, విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నా పొలంలో సాగు మొదలు పెట్టా. ప్రస్తుతం పంట బాగానే ఉంది. నాతో పాటే గ్రామానికి చెందిన చాకలి రాజన్నకు అవగాహన కల్పించి వేయించా. -బోడిగాం లింగయ్య, వెంగ్వాపేట్
మరో ఇద్దరు కూడా..
నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వాపేట్కు చెందిన బోడిగాం లింగయ్య, చాకలి రాజన్న, దస్తురాబాద్ మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన జాడి నవీన్ కూడా నల్ల వరి సాగు చేస్తున్నారు. ఇందులో బోడిగాం లింగయ్య, చాకలి రాజన్న నల్గొండ జిల్లాకు వెళ్లి, ఈ సాగు వివరాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే విత్తనాలు తెచ్చారు. అర ఎకరం చొప్పున సాగు మొదలు పెట్టారు. దస్తురాబాద్ మండలానికి చెందిన జాడి నవీన్ సోదరుడు నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయశాఖలో పని చేస్తున్నాడు. అతడి ద్వారా ఈ పంట సాగు వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే పది గుంటల భూమిలో సాగు మొదలు పెట్టాడు.
బంధువు ప్రోత్సాహంతో..
మా సోదరుడు నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయశాఖలో విస్తీర్ణాధికారిగా పని చేస్తున్నాడు. అక్కడి రైతులు కొందరు నల్ల వరి ధాన్యం సాగు చేస్తున్నారనే విషయం నాకు చెప్పిండు. అందుకే మొదట పది గుంటల్లో పంటను మొదలు పెట్టిన. ఈ నల్ల బియ్యం ఆరోగ్యానికి మంచి చేస్తుందని అందరూ చెబుతున్నరు. -జాడి నవీన్, రైతు, మున్యాల గ్రామం
ఆరోగ్యానికి మేలే..
సుమేశ్ సాగు చేసిన నల్ల వరి ధాన్యం ఆరోగ్యానికి మేలు చేయనుంది. ఈ బియ్యానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. సాధారణ వరి ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, బ్లాక్ రైస్ 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. ఆరోగ్యరీత్యా సాధారణ బియ్యంతో పోల్చితే నల్ల బియ్యం ప్రజల్లో వ్యాప్తి చెందే కీలక రోగాలకు రోగ నిరోధక శక్తిగా ఉపయోగపడనుంది. నల్ల బియ్యం కేజీ ధర రూ. 200 నుంచి రూ. 400 వరకు ఉంటుందని యువ రైతు తెలిపాడు. నల్ల బియ్యంలో ‘ఆంథినియోసిన్స్' అనే పదార్థం ఉండడంతో కేన్సర్ ఉన్న మహిళలు వాడితే, మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ‘ఇ’ ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఈ బియ్యం తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని సోన్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంబాజీ తెలిపారు. నల్ల బియ్యాన్ని పూర్వకాలంలో ‘సూపర్ ఫుడ్'గా పిలుస్తుండేవారు. వరి సాగులో సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి, వినూత్న పద్ధతిలో కొత్త వంగడాలను సాగు చేస్తేనే మార్కెట్లో డిమాండ్ పెరిగి రైతు ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తూ నూతన సాగుకు కొందరు రైతులు శ్రీకారం చుడుతున్నారు.
తాజావార్తలు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్