తప్పిన తిప్పలు..

- మ్యుటేషన్‌కు నో కిరికిరి
- అర గంటలోనే ప్రక్రియ పూర్తి
- వీఆర్వోలు, దళారుల దందాకు బ్రేక్
- అభ్యంతరాలతో ఆటంకాలు లేవు..
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో మ్యుటేషన్ ప్రక్రియ సులువైంది. అరగంట వ్యవధిలోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నది. గతంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఈ పని కావాలంటే రెండు నెలల కాలం పట్టేది. కాలయాపనతో పాటు అధికారులు కిరికిరి పెట్టేవారు. చేతులు తడిపితేగాని చేసేవారు కాదు. ధరణితో వీఆర్వోలు, వీఆర్ఏల మధ్యవర్తిత్వానికి తెరపడింది. రైతులు ఒక్క రూపాయి ఇవ్వకుండానే మ్యుటేషన్ పూర్తవుతున్నది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ సమయంలో అమ్మిన వారి కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలిపితే ప్రక్రియ నిలిచిపోయేది. తాజాగా అలాంటి వాటికి అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- నిర్మల్, నమస్తే తెలంగాణ\
జెల్ది మ్యుటేషన్ అయ్యింది..
భైంసా : నేను పన్నెండున్నర ఎకరాల భూమిని కొన్న. దీనికోసం మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్న. శనివారం సమయం ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న. కేవలం పది నిమిషాల్లోనే పనైంది. ఆ తర్వాత వెంటనే పట్టాదారు పాసుపుస్తకంల నేను కొన్న భూమిని ఎక్కించిన్రు. మ్యుటేషన్ కూడా ఎంటనే చేసిన్రు. గింతకుముందు రిజిస్ట్రేషన్ అయినంక కాగితాల కోసం, మ్యుటేషన్ కోసం ఆఫీసు చుట్టూ తిరగలేక ఇబ్బందయ్యేది. రిజిస్ట్రేషన్ అయిన ఎమ్మటే పాసు పుస్తకంల భూమి ఎక్కడం శానా సంతోషంగుంది. మాలాంటి పేద రైతులకు గింత జెల్ది రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయితే మల్ల ఇంటికిపోయి పని చూసుకుంటం. గిసొంటి రిజిస్ట్రేషన్లు పెట్టి సీఎం కేసీఆర్ సార్ మాలాంటోళ్లకు మేలు జేసిండు. - నరేందర్, రైతు
నిర్మల్, నమస్తే తెలంగాణ : గతంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేయగా.. మ్యుటేషన్ కోసం మాత్రం తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేవారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్ల ఆధారంగా మీసేవ కేంద్రాల్లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉండేది. దరఖాస్తుతోపాటు జిరాక్సు ప్రతిని తహసీల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉండేది. ఆ తర్వాత 45-60 రోజుల తర్వాత మ్యుటేషన్ పూర్తయ్యేది. భూముల విక్రయం తర్వాత మ్యుటేషన్ కోసం దరఖాస్తు పెడితే.. అభ్యంతరాలను స్వీకరించేందుకు కొంత గడువు ఇచ్చేవారు. భూమి ఉన్న గ్రామ పంచాయతీలో నోటీసు అతికించేవారు. దీంతో కుటుంబసభ్యులతోపాటు బయట వ్యక్తులు కూడా కొన్ని సార్లు అభ్యంతరాలు తెలిపేవారు. దీంతో మ్యుటేషన్ ప్రక్రియ నిలిచిపోయేది. మ్యుటేషన్ ప్రక్రియలో తహసీల్దార్‌కు భూములు కొనుగోలు చేసిన వారికి మధ్యవర్తులు వీఆర్వోలు, వీఆర్ఏలు ఉండేవారు. దీంతో వీరిలో కొందరు మ్యుటేషన్ కోసం పెద్ద ఎత్తున డబ్బులు గుంజేవారు. డబ్బులు ఇవ్వని వారు, అభ్యంతరాలు వచ్చిన వారు తహసీల్ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగాల్సి వచ్చేది. వీఆర్వోలు వివిధ కారణాలు చూపి కాలయాపన చేసేవారు. పెద్ద ఎత్తున డబ్బులు అప్పగిస్తే పనులు చేసేవారు. మ్యుటేషన్ అయ్యాక తహసీల్దార్ డిజిటల్ సైన్ చేశాక.. 1 బీ, పహాణీ వచ్చేది.
ధరణితో సులువైంది..
ప్రస్తుతం తహసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లతోపాటు మ్యుటేషన్లు చేస్తుండగా.. అప్డేషన్ కూడా పూర్తవుతున్నది. అది అరగంటలోపే ప్రక్రియ ముగుస్తున్నది. గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు కూడా కొత్తవి ఇచ్చేవారు. ప్రస్తుతం ఇప్పటికే పాసు పుస్తకాలు ఉన్నవారికి.. పాత పుస్తకంలోనే తాజాగా కొన్న భూముల వివరాలు రెండోపేజీలో రాస్తున్నారు. సర్వే నంబరు, భూమి విస్తీర్ణం వివరాలు రెండో పేజీలో రాసి.. ప్రింట్ తీసి ఇస్తున్నారు. అమ్మిన వారి పట్టాదారు పాసుపుస్తకంలో అమ్మిన భూమి విస్తీర్ణం వివరాలు తొలగించి.. మార్పులు చేసి ఇస్తున్నారు. అసలే భూములు, పాసు పుస్తకం లేని వారికి మాత్రం కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే పాసుపుస్తకం కోసం రూ.300 (కొరియర్ చార్జీలు కలిపి) చలానా రూపంలో చెల్లిస్తే.. ఇంటికే కొత్త పాసు పుస్తకం పంపిస్తారు. కలెక్టరేట్, తహసీల్ కార్యాలయం, వీఆర్వో, తహసీల్దార్ చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా.. పోస్టులో నేరుగా ఇంటికే వస్తున్నది. తాజాగా తహసీల్ కార్యాలయాల్లో చేపట్టిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్‌గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్‌పథ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం!
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు