బుధవారం 20 జనవరి 2021
Nirmal - Nov 03, 2020 , 02:47:32

ప్రారంభమైన ధరణి సేవలు

 ప్రారంభమైన ధరణి సేవలు

  • తొలి రోజు 72 స్లాట్‌ బుకింగ్‌లు, 39 రిజిస్ట్రేషన్లు.. 
  • కిటకిటలాడిన తహసీల్‌ ఆఫీసులు
  • బారులుదీరిన రైతులు
  • ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రాహర్షం
  • సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు

తెలంగాణ చరిత్రలో భూక్రయవిక్రయాలకు సంబంధించి సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయంతో భూముల లావాదేవీలు సులభం కానున్నాయి. గత నెల 29న సీఎం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించగా.. సోమవారం నుంచి తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 72 మంది స్లాట్‌బుక్‌ చేసుకోగా.. 39 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అర గంటలోనే తంతు పూర్తికావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పడ్డ బాధలు తీరిపోయాయని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన పోర్టల్‌ విధానం సులభంగా, పారదర్శకంగా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  

- నిర్మల్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ముందు రోజు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి సోమవారం రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్లు కూడా చేశారు. ప్రస్తుతం తహసీల్‌ కార్యాలయాల్లో నాలుగు రకాల పట్టాల మార్పిడి చేస్తున్నారు. సేల్‌డీడ్‌, గిఫ్డ్‌ డీడ్‌, సక్సేషన్‌, పార్టిషన్‌ చేస్తున్నారు. సేల్‌డీడ్‌కు సంబంధించి అమ్మేవారు, కొనేవారు, సాక్షులు తప్పనిసరిగా ఉండాలి. గిఫ్ట్‌డీడ్‌కు సంబంధించి.. బహుమతి ఇచ్చే వారు, ఎవరి పేరుతో చేసుకుంటున్నారో వారు, సాక్షులు ఉండాలి. పార్టిషన్‌కు సంబంధించి.. ఎవరి పేరిట భూమి ఉందో వారితోపాటు.. మిగతా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉండాలి. సక్సెషన్‌కు సంబంధించి.. చనిపోయిన తండ్రి పేరిట ఉన్న ఆస్తిని వారసులకు చేస్తున్నారు. వారసులంతా ఉండాలి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. మ్యుటేషన్‌కు సంబంధించి.. ఎకరానికి రూ.2,500 చొప్పున చెల్లించాలి. పట్టాదారు పాసుపుస్తకం చార్జీలు రూ.300 చెల్లించాలి. తొలి రోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిన్న చిన్న సాంకేతిక సమస్యలు మినహా.. పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.  విజయవంతంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగకుండా.. ఒకేరోజు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూరి ్తచేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ధరణి పోర్టల్‌తో పని సులువైంది..

దిలావర్‌పూర్‌ : నా పేరు మంచాల నర్సయ్య. మాది నిర్మల్‌ మండలం చిట్యాల గ్రామం. దిలావర్‌పూర్‌ గ్రామానికి చెందిన మైస మల్లయ్య నుంచి లోలం శివారులో గల 224/ఈ  సర్వే నంబర్‌లో గల 20 గుంటల భూమిని కొనుగోలు చేశా. సీఎం కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని చెప్పడంతో నిర్మల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లలేదు. ధరణి పోర్టల్‌ ప్రారంభమైందని తెలియగానే ఈ రోజు ఉదయం మీసేవకు వెళ్లా. అక్కడి నుంచి తహసీల్‌ కార్యాలయానికి వెళ్లా. అక్కడ తహసీల్దార్‌ను కలువగానే గంటలోపు రిజిస్ట్రేషన్‌ చేసిండ్రు. 24 గంటలు గడువక ముందు తనకు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ అయి తన పేరు మీద పట్టదారు పాసుపుస్తకం అందించారు.logo