గురువారం 21 జనవరి 2021
Nirmal - Nov 02, 2020 , 00:49:27

రెవె‘న్యూ’ రిజిస్ట్రేషన్‌

రెవె‘న్యూ’ రిజిస్ట్రేషన్‌

  • నేటి నుంచి పూర్తి స్థాయిలో ధరణి సేవలు 
  • సర్వం సిద్ధం చేసిన అధికారులు
  • ముస్తాబైన తహసీల్‌ కార్యాలయాలు
  • ఇరవై నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి
  • ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం.. 
  • పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు

భూ సంస్కరణల్లో మరో విప్లవాత్మక అధ్యాయం మొదలుకాబోతున్నది. దశాబ్దాలుగా  భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం ఇబ్బందులు పడ్డ రైతుల కోసం తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన నూతన విధానం అమల్లోకి వచ్చింది.ధరణి పోర్టల్‌ అనేక చిక్కుముళ్లకు పరిష్కారం చూపనున్నది. గత నెల 29న సీఎం కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించగా.. సోమవారం నుంచి తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. తహసీల్‌ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విధానాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. భూముల క్రయవిక్రయాలకు, రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రిజిస్ట్రేషన్లు ఒక చోట, మ్యుటేషన్లు మరొక చోట చేసే పూర్వ విధానంతో రైతులు విసిగిపోయారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత నెలలు, ఏండ్ల తరబడి రైతులు మ్యుటేషన్‌ కో సం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగే వారు. భూములపై హక్కులు సంక్రమించాలంటే నానా తంటాలు పడేవారు. అధికారుల చేయి తడిపితే గానీ పనులు జరిగేవికావు.

ఈ నే పథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తె చ్చింది. ఆధునిక సాంకేతికతను దన్నుగా చేసుకొని ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూములు, ఆస్తులను ఈ పోర్టల్‌ లో నిక్షిప్తం చేసింది. తమ భూముల క్రయవిక్రయాల్లో రైతు లు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ల విధానానికి స్వస్తిపలికి నూతన అధ్యాయానికి బాటలు వేశా రు. అందులో భాగంగానే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లు, మ్యు టేషన్లు చేసే అధికారాలు ఇచ్చారు. గతంలో ఏండ్ల తరబడి తిరిగినా జరగని పని ఇప్పుడు 20 నిమిషాల్లో జరిగేలా చర్య లు తీసుకున్నారు. దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ధరణి వెబ్‌సైట్‌ను గత నెల 29న సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లిలో ప్రారంభించగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. దీం తో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 70 మండలాల్లోని రెవె న్యూ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 ప్రస్తుతం నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు 

కేవలం వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను ప్రభుత్వం తహసీల్దార్లకు ఇచ్చింది. నాలా కన్వర్షన్‌, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం రిజిస్ట్రేషన్‌ శాఖ వద్దే ఉంచింది. సోమవారం నుంచి కేవలం వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నా రు. ఇందులో ముఖ్యంగా సేల్‌డీడ్‌ (భూముల విక్రయా లు), పార్టిషన్‌ డీడ్‌(భూముల పంపకాలు), సక్సెషన్‌ డీడ్‌ (వాసులకు హక్కులు కల్పించడం), గిఫ్ట్‌ డీడ్‌ (భూములు బహుమతిగా ఇవ్వడం) వంటి నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు చేసేందుకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు అధికారులు చె బుతున్నారు. తెలంగాణ భూమి, హక్కులు, పట్టాదారు పా సుపుస్తకం చట్టం-2020ని అనుసరించి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఇందులో పొందుపర్చిన భూరికార్డులే ప్రామాణికంగా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారు.

స్లాట్‌ బుకింగ్‌ విధానం ఇలా..

భూముల రిజిస్ట్రేషన్లు జరిపేందుకు రైతులు తప్పనిసరిగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు సొంతంగా, మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ధరణి వెబ్‌సైట్‌లోకి వెళ్లి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌పై లాగిన్‌ అవ్వాలి. మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. ఆ వెంటనే సంబంధిత నంబర్‌కు వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుంది. దానిని నమోదు చేయాలి. కొనుగోలుదారులు, విక్రయదారుల ఆధార్‌ నంబర్లు, పట్టాదారు పాసుపుస్తకం, కుటుంబసభ్యులు, కొనుగోలు చేసే విస్తీర్ణం, సర్వేనంబర్‌ వంటి వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ, పట్టాదారు పాసుపుస్తకం కోసం, మ్యుటేషన్‌ కోసం ఈ-చలాన్‌ ద్వారా ఫీజులు చెల్లించాలి. అప్పుడు తహసీల్‌ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తుదారులకు సమయం ఇ స్తారు. జిల్లాలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతులు అందించే వివరాలతో వెబ్‌సైట్‌ డాక్యుమెంట్‌ను జనరేట్‌ చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ తర్వాత 20నిమిషాల్లో మ్యుటేషన్‌ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.


logo