బుధవారం 27 జనవరి 2021
Nirmal - Oct 31, 2020 , 00:27:04

ధాన్యరాశి.. రైతన్నకు సిరి

ధాన్యరాశి.. రైతన్నకు సిరి

  • 1. 50 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్ల దిగుబడి అంచనా
  • నిర్మల్‌ జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలు
  • గతేడాది కంటే 20 అదనం
  • కోతలు కోసి ఆరబెడుతున్న రైతులు
  • రేపటి నుంచి కొనుగోళ్లు షురూ..

నిర్మల్‌ టౌన్‌ : నిర్మల్‌ జిల్లాలో ధాన్యరాశులు వరి పండించిన రైతన్న ఇంట్లో సిరులు కురిపించబోతున్నాయి. ఈ వానకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన వరి పంట చేతికి వస్తున్నది. జిల్లాలో మొత్తం లక్ష ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇందులో 50 వేల ఎకరాల్లో దొడ్డురకం, మరో 50 వేల ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశారు. ఈ లెక్కన 1,56,211 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇంటి అవసరాల కోసం వినియోగించుకోనుండగా.. మిగతా లక్ష మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ యేడాది వానకాలంలో సాగు చేసిన వరి పంటకు వాతావరణం అనుకూలంగా ఉండడం, అక్టోబర్‌ మొదటి వారం వరకు విస్తారంగా వర్షాలు పడడంతో దిగుబడులు బాగానే వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఒక ఎకరానికి 20 నుంచి 25 క్విం టాళ్ల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. వరి ధాన్యం పండించిన రైతన్నకు మద్దతు ధర కల్పిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దిగుబడులపై ఆశలు పెట్టుకున్న రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలు..

నిర్మల్‌ జిల్లాలో మొత్తం 18 మండలాలున్నాయి. వ్యవసాయశాఖ అధికారుల సర్వే ప్రకారం వరి సాగు చేసిన గ్రామాల విస్తీర్ణాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా పౌరసరఫరాలశాఖ చర్యలు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 154 కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 56, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 37, డీసీఎంఎస్‌ 54, జీసీసీ ఆధ్వర్యంలో 5, హాకా ఆధ్వర్యంలో రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌ ఒకటిన రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముథోల్‌ నియోజకవర్గంలోని బోరిగాం గ్రామంలో ఈ కేంద్రాలను ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన తాగునీటి సౌకర్యం, విద్యుత్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. 

ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1,888..

ప్రభుత్వం ధాన్యం సేకరణకు మద్దతు ధరను ప్రకటించింది. ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాల్‌కు రూ.1,888, బీ గ్రేడ్‌కు రూ.1,868 ధర నిర్ణయించారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను ఆశ్రయించద్దని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  రైతులకు సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు. జిల్లాలో కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, సోన్‌, తదితర మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. కల్లాలకు పెద్ద ఎత్తున ధాన్యం తరలివస్తున్నది.  కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ సంచులను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. వానకాలం సీజన్‌లో వరి ధాన్యం అంచనాకు మించి వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. ఇటీవల కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని సూచించారు.  దానికనుగుణంగా మరో 20 అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర.. 

నాకు రెండెకరాల వరి పొలం ఉంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడడంతో ఆయకట్టు కింద సన్న, దొడ్డు రకం వరిని సాగు చేశా. ప్రభుత్వం నవంబర్‌ ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటామని చెప్పడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,888 చెల్లిస్తున్నది. దీంతో సన్నరకం కూడా ఇక్కడే అమ్ముకుంటాం.  

- సంతోష్‌, రైతు, వెంగ్వాపేట్‌ 


logo