గురువారం 03 డిసెంబర్ 2020
Nirmal - Oct 28, 2020 , 02:13:43

బీజేపీ.. ఇదేం నీతి..

బీజేపీ.. ఇదేం నీతి..

  • అధికారుల విధులకు ఆటంకం కలిగించడంపై మండిపాటు
  • డిపాజిట్‌ కూడా దక్కదని దాడులకు తెగబడడం విడ్డూరం
  • ఎన్నికల వేళ సోదాలు, తనిఖీలు సాధారణమని వ్యాఖ్య
  • కమలనాథుల తీరుపై జిల్లావ్యాప్తంగా మండిపడుతున్న జనం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) డబ్బు రాజకీయానికి తెరలేపడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల వేటలో నోట్ల కట్టలు కుమ్మరించడంపై జనం మండిపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో డబ్బులు పట్టుబడగా.. ఆ పార్టీ కార్యకర్తలే పోలీసులు, రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించేందుకు కేంద్రంలో ఎన్నికల సంఘం, దీనికి అనుబంధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఉంటాయి. వీటి నియమావళికి అనుగుణంగానే ఎలక్షన్లు జరుగుతాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాలు నియమావళికి కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ఎన్నికల సంఘాలకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రతి ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ఇతరాత్ర ప్రలోభాలపై అధికారులు గట్టి నిఘా పెడతారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలు ఇందుకు మినహాయింపు కాదు. డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేసి ఓట్లు దండుకోవాలనే పన్నాగం ఏ పార్టీ పన్నినా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎన్నికల కోడ్‌ ఉన్నంత కాలం అధికారులు పూర్తి స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తారని, అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడాలు ఉండవని ఇది వరకు ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు చెబుతున్నారు. పేర్లు చెప్పడానికి సంశయించిన సదరు అధికారులు దుబ్బాక హైడ్రామాపై స్పందించారు. అక్కడి సీపీ జోయల్‌ డెవీస్‌ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన సెర్చ్‌ వారెంట్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో పలు ఇండ్లలో సోదాలు నిర్వహించారని చెబుతున్నారు. ఒక ఇంటిలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన విషయాన్ని నిర్ధారించుకునే సమయంలోనే బీజేపీకి చెందిన కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగి నానా హంగామా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు ఎన్నికల నియమావళిని అమలు చేయకుండా ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెప్పించలేక, అబద్ధాలు చెప్పి దుబ్బాక ఎన్నికలో ఓట్లు దండుకోవాలని బీజేపీ చేస్తున్నది. జీఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి రావడం లేదని, విభజన చట్టం హామీలు నెరవేర్చడం లేదని, పలు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేకపోతున్న బీజేపీ నాయకులు ఆసరా పింఛన్లు తామే ఇస్తున్నాం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు తమ నిధులతోనే నడుస్తున్నాయని, కేసీఆర్‌ కిట్లకు నిధులు కేంద్రం ఇస్తుంటే పేరు వీళ్లది పెట్టుకున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తూ దుబ్బాకలో ఓట్లు దండుకునే కార్యక్రమానికి తెరలేపారని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ప్రజల ప్రయోజనాలు తీర్చినపుడు పార్టీ ప్రయోజనాలు ప్రజలు తీర్చుతారని చెబుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు. 

చేతకాకే ప్రలోభాలు

ఆసిఫాబాద్‌ టౌన్‌: ఎన్నికల్లో గెలిచేదారి తెలియకే బీజేపీ నాయకులు ప్రలోభాల దారి పట్టారు. వీరిదంతా ఎండమావిలో నీళ్ల కోసం వెతికినట్లే. సీఎం కేసీఆర్‌ చేస్తున్న సంక్షేమం దుబ్బాక ప్రజలందరికీ తెలుసు. చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ప్రజలను ఓట్లు అడగాలి. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజల కోసం చేసిన మంచి పని ఒక్కటీ లేదు. సిద్దిపేటలో బీజేపీ చేసిందంతా దిగజారుడు రాజకీయాలే. ఎన్ని కుట్రలు పన్నినా, జాతీయ పార్టీలపై ప్రజల్లో కొంత కూడా మంచి పేరు లేదు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి, ఇలాంటి పార్టీల ఆగడాలను అరికట్టాలి. 

-ఉబేద్‌ బిన్‌ యాహియా, కేసీఆర్‌ సేవాదళం జిల్లా అధ్యక్షుడు

గెలిచేందుకు వక్ర మార్గాలు..

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : ప్రజల ఓట్లతో గెలవాల్సిన బీజేపీ నేతలు డబ్బులు పంచి ఓట్లు సంపాదించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను కాస్త వ్యాపార పరంగా మారుస్తున్నారు. దుబ్బాకలో జరుగుతున్నది ఉప ఎన్నిక మాత్రమే. దానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. పోలీసులు, అధికారులు తమ పని తాము చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. నిజంగా ఇది చాలా దారుణం.  ఎన్నికల్లో విధ్వంసం సృష్టించే నాటకాలకు తెరలేపారు. మరోవైపు ఎన్నికలు జరగకుండా చేయాలనేది ఆ పార్టీ వ్యూహం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. కచ్చితంగా వారికి ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా స్పందించి చర్యలు తీసుకోవాలి. 

- వాల శ్రీనివాస్‌ రావు, రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు 

డబ్బుతో గెలువాలనుకోవడం సరికాదు

కాగజ్‌నగర్‌టౌన్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బుతో గెలువాలనుకోవడం సరికాదు. కొందరు రాజకీయ నాయకులు తప్పు చేసి, పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చేపడు తున్న సంక్షేమ పథకాలతో ఆ పార్టీకి ప్రజాదరణ ఉన్నది. ప్రజలంతా అటువైపు నిలబడ్డారని తెలిసే, బురదజల్లే కార్యక్ర మాలకు బీజేపీ నాయకులు దిగుతున్నారు. ఇలాంటి వారిని ప్రజలు గెలిపించరు. దుబ్బాకలో ఆ పార్టీ నాయకులు నిన్న పెద్ద డ్రామా చేసినట్లే ప్రజలు అనుకుంటున్నరు. రాష్ట్రంలో అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యం. దుబ్బాకలో ప్రజల నుంచి టీఆర్‌ఎస్‌కు వస్తున్న స్పందన టీవీల్లో చూస్తున్న. కచ్చితంగా అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమనిపిస్తున్నది. కొన్ని పార్టీలు చేస్తున్న నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.             

- మసూద్‌, కాగజ్‌నగర్‌

ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు..

కాగజ్‌నగర్‌టౌన్‌ : దేశంలోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలతో మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్‌ వైపే ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఎలా గెలువాలో తెలియని కొన్ని పార్టీలు జిమ్మిక్కులు చేస్తూ.. కాంట్రవర్సీ పనులకు దిగుతున్నయి. సిద్దిపేటలో మొన్న జరిగిందంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, అక్కడ ఇప్పటికే విజయం ఎవరిదో రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సోలిపేట కుటుంబం రాష్ట్రమంతా తెలుసు. డబ్బులు పంచి గెలువాలనుకోవడం వృథానే. డబ్బులతో దొరికి, ఇన్ని నాటకాలు ఆడుతున్న ఆ పార్టీకి ప్రజలే బుద్ది చెబుతరు. తెలంగాణ సమాజానికి గతంలో ఈ జాతీయ పార్టీలు చేసిందేమిటో అంతా తెలుసు. అభివృద్ధి, సంక్షేమానికే దుబ్బాక ప్రజలు పట్టం కట్టబోతున్నారు.     

- మాజీద్‌, కాగజ్‌నగర్‌