సోమవారం 25 జనవరి 2021
Nirmal - Oct 23, 2020 , 00:31:58

పందిళ్ల సాగు.. ప్రోత్సాహం బాగు..

పందిళ్ల సాగు.. ప్రోత్సాహం బాగు..

  • దళిత రైతులకు ప్రభుత్వం భారీ రాయితీ
  • 80 యూనిట్లకు నిధులు మంజూరు
  • 220 మంది దరఖాస్తు

నిర్మల్‌ టౌన్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళిత రైతులకు చేయూత అందించేందుకు ప్రభుత్వం పందిళ్ల సాగుకు భారీ రాయితీ ఇస్తున్నది. నిర్మల్‌ జిల్లాలో పందిళ్ల సాగు ద్వారా వ్యవసాయోత్పత్తులను పెంచుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వారు 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే జిల్లాలో 80 యూనిట్లకు నిధులు మంజూరయ్యాయి. అక్టోబర్‌ నెలలో దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన నిధులు విడుదల చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

నిర్మల్‌ జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి లో 1.10 లక్షల దళిత కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 50 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాగునీటి వనరులున్న రైతులకు పందిళ్ల సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులు పట్టాదారు పాసుపుస్తకంతో పాటు బోరు ఉంటే ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి రుణాలను అందించనున్నారు. ఒక ఎక రం నుంచి రెండున్నర ఎకరాల వరకు పందిళ్ల సాగుకు అవసరమ య్యే నిధులను ప్రభుత్వమే రాయితీపై విడుదల చేస్తున్నది. జిల్లాలో ఒక్కో రైతుకు రూ.3.50 లక్షల రుణం ఇస్తుండగా.. రూ. 2.10 లక్షలు సబ్సిడీ పోనూ రూ.1.40 లక్షలు బ్యాంకు ద్వారా రుణంగా అందిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు పందిళ్ల సాగుపై జిల్లా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రయోజనాలెన్నో...

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పందిళ్ల సాగుకు ప్రభుత్వం పెద్దమొత్తంలో రాయితీ ఇవ్వడంతో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. చాలా మంది రైతులు గ్రామాల్లో పంటలను బోర్లు, బావుల కింద సాగు చేస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి పంటల సాగును పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పందిళ్ల సాగును ప్రోత్సహిస్తున్నది. గతేడాది మామడ, కడెం, భైంసా, తదితర ప్రాంతాల్లో పందిళ్ల సాగు ద్వారా రైతులు కూరగాయలు సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది మరో 220 మంది రైతులకు పందిళ్ల సాగు కింద రుణాలను అందిస్తున్నారు. మంజూరైన రుణాలతో భూమిని చదును చేసుకోవడం, పందిళ్లను ఏర్పాటు చేసుకోవడం, విత్తనాలు కొనుగోలు చేయడం.. ఇలా అవసరమయ్యే ఖర్చులకు ప్రభుత్వం మొత్తం రాయితీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పెరిగి అన్నివర్గాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యానవనశాఖ అధికారులు సైతం పందిళ్ల సాగును ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందిన రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా సాగులో మెళకువలపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. దీనివల్ల దళిత రైతులకు పందిళ్ల సాగు ఆర్థిక లాభాలు తెచ్చే అవకాశం ఉంది.  

దరఖాస్తుదారులందరికీ రుణాలు..

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళిత రైతులు పందిళ్ల సాగుకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ప్రభుత్వం ద్వారా రాయితీ రుణాలు అందిస్తాం. ఇప్పటికే 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. 80 మందికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. గతేడాది జిల్లా లో పందిళ్ల సాగు ద్వారా కూరగాయలు సాగు చేసిన రైతులు ఆర్థికంగా బలపడ్డారు. 

- మైసర్ల హన్మాండ్లు, ఏడీ, ఎస్సీ కార్పొరేషన్‌logo